‘విముక్తి’ అనేశావు. ఎలాగ?”
”ఎలాగా? ఎలాగో నీ బ్యాగ్‌లో వున్న పుస్తకంలో చదవాలన్నాను. ఆ పుస్తకం బ్యాగులో నిజంగా వుందా, తీసేశావా?”
”నిజంగా ఇప్పుడు బ్యాగులో లేదు! మొన్న మా క్లాసులో ఒకడు నేను చదువుతోంటే, తొంగి తొంగి చూసి, ‘కాపిటలా? ఈ పుస్తకం గురించి బాగుంటుందనో యేదో కొందరంటారు. కొన్నావా? ఒక్కసారి నాకియ్యి! రేప్పొద్దున్నేకల్లా ఇచ్చేస్తానోరు! అరె, సారీ! రేపు మార్నింగ్ సినిమాకి టిక్కట్టుందిలే, ఎల్లుండి తప్పకుండా ఇచ్చేస్తానోరు! ప్లీజ్! ఏమన్నా రాస్తా దాని మీద!’ అని గబ గబా అంటోంటే, అసలు భరించలేకపోయాను. రేపొద్దున్న సినిమా అట! అది మానకూడదట! కాపిటల్‌ని తిరగేసి, ఏదో రాస్తాడట! ఎంత వాగాడో!”
”సరే, అడిగాడులే. నువ్వేమన్నావు? ఇవ్వలేదా, ఇచ్చావా?”
”ఇచ్చానా! ఇస్తే, నీ ముందు కూర్చో గలిగేవాడినా?”
”నాకేం తెలుస్తుంది? నిన్ను కూర్చోవద్దంటానా?”
”నువ్వు అంటావని కాదు. కాపిటల్‌ని వాణ్ణి ముట్టుకోనిస్తే, నేనే నీ ముందు కూర్చోగలిగే వాణ్ణి కాదు!”
”అది తప్పు! ఆ పూట ఇవ్వక్కర్లేదు గానీ, ‘నేను చదవడం అయ్యాక ఇస్తాలే’ అంటే మంచిదే. ఏమో! కాస్త చదివి, తిరగేసి, తిరగేసి చదివి ఏమన్నా మారే వాడేమో! తర్వాత, ఆ పుస్తకం గురించే మాట్లాడే వాడేమో! ‘తర్వాత ఇస్తాలే’ అనకపోయావా? చూడనియ్యి ఒక సారి! నేను మాత్రం కాపిటల్ చదవక ముందు ఈ మాత్రం మాట్లాడ గలిగే వాడినా?”
”అవును గోపాల్! నాకూ కొత్తగానే తెలిశాయి నీ మాటల్తో!”
”ఏమో మరి! ఒక సారి ఇస్తే చదువుతాడేమో!”
”నా కలా అనిపించలేదు అప్పుడు!”
”అప్పుడు సరే! ఇప్పుడు?”
”ఏమో! అతడు మళ్ళీ అడిగితే, అడిగితేనే కాదులే. అసలు ఏ పుస్తకాలు చదివాడో అడిగి, చదవాలంటే కొనుక్కోలేవా? – అంటా.”
”అవును, అంతే! ఒక్క రోజ్కెనా నువ్వు చదవకుండా ఎవరికీ ఇవ్వకు!”
”అలా ఇస్తే, నీతో అబద్ధం చెప్పాల్సిందే!”
”అలాంటి మాటలు మానెయ్యి! ఇలాంటి మాటలు చెప్పడాలూ, వినడాలూ, నీకూ, నాకూ వ్యక్తి పూజలై పోతాయి, తెలుసా?”
”సరే! సరదాగా అన్నాలే. ఇందాకేదో అడగాలనుకుంటే వచ్చింది. సమాజం, మొదట్లో బానిస యజమానుల పెత్తనం కింద ప్రారంభమైందని చెప్పి, తర్వాత ఎదిగింది, మరి కాస్త ఎదిగింది, మరీ కొంత ఎదిగింది అన్నావు. యజమానుల పెత్తనాల్లో మార్పులు వుంటే మాత్రం, వాటిని సమాజం ఎదగడం, అంటామా?”
”బాగా అడిగావు! సమాజం ఎదగడానికి కారణం, యజమానులు కారు! శ్రామిక వర్గంలో ఎదుగుదలలే, ఎదురు తిరగడాలే అసలు కారణం! ఒకప్పుడు బానిసలుగా బతికిన వాళ్ళు, తర్వాత కౌలు రైతులుగా మారి, ఆ తర్వాత జీతాల శ్రామికులుగా ఈ నాటి దశకి ఎదిగినట్టు కాదా? వాళ్ళ పోరాటాల వల్లే మార్పులన్నీ! మనకు తెలియనివి, బోలెడుంటాయిలే. మరి, అదంతా ఎదుగుదలే శ్రామిక వర్గ భావాల్లో.”
”అయితే, ఇప్పుడు మనం ఎలా ఎదగాలి? మన భావాల్లో ఏం మార్పులు రావాలి?”
”ఆలోచించి చూడు!”
”మనం ఉద్యోగాలు కావాలనుకుంటున్నాం. వస్తే వస్తాయి! జీతాలూ వస్తాయి! అంతేనా జరగాల్సింది? దానితో మనకి సంతృప్తేనా? పక్కనే బిచ్చగాళ్ళు వుంటారే! పక్కనే బికార్లూ వుంటారే! వాళ్ళెలా ఎదగాలి?”
”శ్రమ దోపిడీ మొత్తంగా అంతర్ధానం అవ్వాలన్నదే మన ఆలోచన! ఇంకా, బికార్లేంటీ, బిచ్చగాళ్ళేంటీ?”
”అవును, అవును! అంతే! ఇంకా ఎంత కాలం భరించాలి దోపిడీ? అది కాదు, ఆ కౌలూ, వడ్డీ, లాభం – అన్ని దోపిడీలూ పోవాల్సిందే! కానీ, గోపాల్! ‘లాభం’ అనేది కూడా పూర్తిగా పోవాల్సిందే కదా?”
” ‘లాభం’ వేరా? కౌలూ, వడ్డీలతో కలిసిందే లాభం కదా? చెప్పలేదా? సరుకుల్ని అమ్మగా వచ్చే లాభం లోనించే పరిశ్రమ నించున్న భూమికి కౌలు! ఖర్చులికి ‘పెట్టుబడి’ పేరు పెట్టి, దానికి వడ్డీ! మూడోది లాభం! మూడు పంపకాలయ్యేదే మొత్తం దోపిడీ! ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తావు రవి బాబూ ఆ పుస్తకం?”
”చేస్తా! చేస్తా! చేసేస్తా గోపాల్! పరీక్షల గోల ఒకటి కదా, చస్తున్నాను! వాటిని మానేస్తాలే. మరి, లాభం పోతే, దాన్ని లాక్కుంటూ, బతికే పెట్టుబడిదార్లు గార్లు ఎలా బతుకుతారంటావు?”
”నీతో లాభం లేదు, నువ్విక పనికి రావు! లాభం అని నేనూ అన్నాను గానీ, అది చెత్త మాట! నీకు ఆలోచనా శక్తి ఈ బూర్జువా పరీక్షలతో పూర్తిగా పోయింది! ‘లాభాన్ని లాగే వాళ్ళు’, అది లేకపోతే ఎలా బతుకుతారు – అంటావా? అంత మాత్రం ఆలోచించ లేవా? లాభాలు లేకుండా శ్రామిక వర్గం వాళ్ళంతా ఎలా బ్రతుకుతున్నారు? అసలీ ‘లాభం’ మాటని మనం పలక కూడదు. బొత్తిగా తప్పుడు మాట అది! ఏ విషయంలో అయినా, ‘లాభం లేదే!’ అన్నామంటే, ఇప్పుడే అన్నాగా? ఎక్కడి నించో ఏదో రావాలని ఆశలతో ఎదురు చూడ్డమేగా? లాభాన్ని లాగకపోతే దోపిడీ దారులెలా బ్రతుకుతారబ్బా – అని, నీకు బెంగ పట్టుకుందా?”
”సరే, తిడితే తిట్టు! ఇవన్నీ నాకు ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? నన్ను పిలిచి పది రోజులు దాటి పోయింది.”
”నువ్వయితే, పది రోజులూ దాట నిచ్చి, ఆ తర్వాత వచ్చావు. బూర్జువా పరీక్షల మత్తులో, ఫస్ట్ క్లాస్ మార్కుల పిచ్చి గర్వంలో మునిగావు. అంతేగా?”
”అంటే అను! ఇందాకే చెప్పేశాను. ఈ పూటకి ఆఖరిగా తిట్టి చెప్పెరు! శ్రమ దోపిడీ అంతర్ధానం తర్వాత ఈ సమాజం ఎలా ఉంటుందో చెప్పు!”
”దోపిడీ పోతే, దోపిడీ జరగని సమాజం ఉంటుంది! అందరికీ కడుపులు నిండడం! అందరికీ చదువులు! అందరికీ పనులూ, విశ్రాంతులూ! అందరికీ సంతృప్తులూ, సంతోషాలూ! బాధలూ, అసూయలూ, కలహాలూ, వుండే పరిస్తితులే లేకపోతే, హత్యలుంటాయా? ఆత్మహత్యలుంటాయా? మూఢ నమ్మకాలుం టాయా?”
”మరి దేవుళ్ళూ?”
”అదీ చెప్పాలా? మూఢ నమ్మకాలు వుండవు అన్నానుగా? సమాజాన్ని, అలాగే ఉత్తమంగా ఊహించు!”
”మనం కూడా, నేను కూడా, ఉత్తమంగా అయిపోవాలి! ఇప్పుడే అయ్యాను! కమ్యూనిస్టుగా అయిపోయాను!”
”అప్పుడే కాదు, నీ పరీక్షలో? రాయవా?”
”కాదు, ఇంక వొద్దు! ఉత్తమ సమాజంలో, ఉత్తమ పరీక్షల కోసం చదువుతాను. మరి నువ్వు? నీ పీహెచ్‌డీ చదువు ఆపుకుంటావా?”
”ఎప్పుడో, ఆర్నెల్ల కిందటే, కాపిటల్‌ని మొదలెట్టి, రెండు సార్లు చదివేసిన తర్వాతే, నా పీహెచ్‌డీ పరిశోధనలనీ అవగొట్టి, ఈ విషయమే ఆలోచిస్తున్నాను నిన్న మొన్నటి నించీ.”
”ఏం ఆలోచించావు చెప్పు! తొందరగా చెప్పు!”
”మనం ఉత్తమ సమాజం కోసం ఆలోచించాలి!”
”అంటే, కమ్యూనిస్టులుగా మారాలంటావు. అంతేగా?”
(ఇంకావుంది)
– రంగనాయకమ్మ