మతం, మంగళసూత్రం…ఓ చౌకీదార్‌!

మతం, మంగళసూత్రం...ఓ చౌకీదార్‌!పార్లమెంట్‌ తొలి దశ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్‌ విధాన సరళి మోడీని భయపెట్టిందా? అందుకేనా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది.2006 నాటి మన్మోహన్‌సింగ్‌ మాటలను వక్రీకరిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నది. వికాస్‌ పురుష్‌, ఆత్మనిర్భర భారత్‌ అనే నినాదాలు మర్చిపోయి మతం, మంగళ సూత్రాలు చుట్టూ రాజకీయాలు చేస్తున్నది అందుకేనా? రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ దేశంలో ఎవరి దగ్గర ఎంత ఆదాయం బంగారం ఉందో లెక్కించి ఆ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హిందూ మహిళా మంగళసూత్రాలను లాక్కొని, ఎక్కువ మంది పిల్లలు న్న కుటుంబాలకు ఇస్తుందని తమ మేనిఫేస్టోలో పేర్కొందని తీవ్రమైన మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ప్రధాని.సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అందుబా టులో ఉన్న సహజ వనరులపై రాజ్యానికి నియంత్రణ ఉండాలి. సమాజంలో వాటిని అందరికీ సమానంగా పంచాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్‌ 30(బి)స్పష్టం చేస్తున్నది.అంతే కాకుండా ఉత్పత్తి పరికరాలు, సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఆర్థిక విధాన రూపకల్పన చేయాలని ఆర్టికల్‌ 39(సి) తెలుపు తున్నది. అదే కదా కాంగ్రెస్‌ పార్టీ కూడా తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. దానిని వక్రీకరిస్తూ కాంగ్రెస్‌ పార్టీ హిందూ మహిళల మంగళ సూత్రాలను ముస్లిం మహిళలకు పంచాలనుకుంటుంది అనే అర్థం వచ్చే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోడీ.
ఎన్నికల సందర్భంగా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ (ఎంసిసి) అమలో ఉన్నపుడు ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే 1951 పీపుల్స్‌ రిప్రజేంటేషన్‌ యాక్ట్‌ ప్రకారం నేరమని చట్టం చెపుతున్నది. అయినా కూడా మోడీ మత విద్వేషాపు వ్యాఖ్యలపై చట్టం చుట్టమై చోద్యం చూస్తున్నది. కనీసం వివరణ కోరే సాహసం కూడా చేయలేకపోతున్నది ఎలక్షన్‌ కమిషన్‌! దేశంలో 22 కోట్ల మంది పేదలు తీవ్ర దారిద్రంలో బతుకుతున్నారు. వారికి రోజుకు సగటున 375 రూపాయల కంటే తక్కువ ఉపాధి పొందుతున్నారు. నిజానికి భారత దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే ఈ దేశంలో ఉన్న అదానీ, అంబానీల లాంటి వారి సంపదను పంచితే చాలుకదా! దేశంలో తరతరాలుగా ఉన్న కటిక పేదరికం దారిద్య్రం అనేది అంతరించి పోతుంది. అప్పుడు ఎవరు ఎవరి మంగళ సూత్రాలు, బంగారం లాక్కొని పంచాల్సిన అవసరం ఉండదు! చౌకీదార్‌ ఇంత చౌకబారు మాటలు మాట్లాడం వెనుక ఓటమి భయం స్పష్టంగా అర్థమవుతున్నది. ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా తన సొంత రాష్ట్రం గుజరాత్‌ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు మోడీ. పాటిదార్‌ కమ్యూనిటీకి చెందిన నేత కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నుంచి పోటీ చేస్తున్నారు అందులో భాగంగా వాల్మీకి కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వాల్మికులు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని, బ్రిటిషర్లు ఎన్ని విధాలుగా హింసించినా లొంగకుండా ధైర్యంగా పోరాటం చేశారని, రాజపుత్రులు మాత్రం లొంగిపోయారని, భయపడి వారితో వైవాహిక సంబంధాలు పెట్టుకున్నారని ప్రసంగిం చారు ఈ మాటల వల్ల రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో రాజపుత్రులు, క్షత్రియులు బీజేపీకి వ్యతిరేకం గా ఉద్యమిస్తున్నారు. ఆ తర్వాత అభ్యర్థి రూపాలా నష్టాన్ని గుర్తించివెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ రాజ పుత్రులు శాంతించడం లేదు. పురుషోత్తం రూపాలను పోటీ నుంచి తప్పించాలని పట్టుపడుతున్నారు. ఆయన్ను ఒకవేళ తప్పిస్తే దాదాపు పదిహేను శాతం ఉన్న పాటిదర్‌ కమ్యూనిటీ ఓట్లను కొల్పోయి తీవ్రంగా నష్టపోతామని, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బీజేపీ తర్జన భర్జన పడుతున్నది.
అంతే కాకుండా హర్యానా, ఉత్తరఖాండ్‌ లాంటి రాష్ట్రాల్లో సైన్యంలో చేరి ఉపాధి పొందుతున్న వారి సంఖ్య ఎక్కువ. అగ్నిపథ్‌ స్కీమ్‌ వల్ల కొత్తగా చేరాలనుకునే వారిలో తీవ్ర ఆందోళన, భయం ఉంది. అగ్నిపథ్‌కు వ్యతిరేకిస్తూ వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇవన్నీ గ్రహించి బీజేపీ అధినాయకత్వం మోడీ ఉత్తర భారత దేశంలో కొల్పేయే ఓట్లను, సీట్లను దక్షిణ భారత దేశంలో పూడ్చుకోవాలని కచ్చతీవు లాంటి ఎప్పుడో ముగిసి పోయిన వివాదాస్పద అంశాలను రాజకీయంగా రగిలించి ఓట్లు దందుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ ఓటర్లు ఆ వైపుగా ఆకర్షితులు కాలేదని గ్రహించిన మోడీ వెంటనే తన అమ్ముల పొదిలో ఎప్పుడూ రెడీగా ఉండే అస్త్రాలైన హిందూత్వ బాణాలను బయటకి తీశాడు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలోనే 2002-గోద్రా అల్లర్లలో ముస్లింల రక్తపాతంతో ఆ నేల తడిసిముద్దయింది. ఇందులో ప్రధానంగా విద్వేషాలు రెచ్చగొట్టి సంఫ్‌ు కార్యకర్తలను ముస్లింల మీదకు ఎగదోసింది మోడీనేని అందరికీ తెలుసు. అలాంటి రక్తపాతాలు, విద్వేషాలు జరిగితేనే ఎన్నికల్లో లబ్ది పొందొచ్చనేది మోడీ అంతంగంలో ఉన్నదే. దేశంలో ఉన్న ముఖ్యమైన సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చి మంగళ సూత్రాలు లాక్కోనీ మైనార్టీలకు పంచాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నదని చవకబారు ఆరోపణలు చేస్తున్నాడు.
శ్రావణమాసంలో విపక్ష నాయకులు మటన్‌ తింటున్నా రని వారి బుద్ధి మొఘల్స్‌ బుద్ధని కూడా కామెంట్స్‌ చేయడం మోడీకే చెల్లుతుంది. ఎవరు ఏం తినాలి, ఏ బట్టలు వేసు కోవాలి, ఎవరిని పెండ్లి చేసుకోవాలి, ఎవరితో కలిసి జీవించాలి అనే వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టడం శోచనీయం. భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు పాటించే సువిశాల భారత దేశంలో అందరు ఒకే రకమైన పద్ధతులు పాటించాలను కోవడం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో ఎలాసాధ్యం? అలా బలవంతం చేయడమనేది నియంతృత్వ పాలనకు నిదర్శనమే అవుతుంది. అంతేకాదు మోడీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోని ముస్లింలీగ్‌ తో పోల్చారు. దేశ విభజన చేసే ఆలోచనలు కలిగించే విధంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ఉందనడం దారుణం. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితెచ్చి దేశంలో ఉన్న ఒక్కొకరికి రూ.15 లక్షల నుంచి 20 లక్షలు ఉచితంగా ఇస్తానని, దేశానికి ఓ చౌకీదార్‌గా పని చేస్తానని ప్రచారం చేసుకున్న మోడీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా దేశ ప్రజలకు పంచిది లేదు. చౌకీదార్‌ చోరీదారులకు సహాయం చేశాడే తప్ప ప్రజలకు ఒరగబెట్టిం దేమీ లేదు. అదే విధంగా రామమందిరం, హిందుత్వ అనేది బీజేపీ ఎన్నికల నినాదం కాదని మోడీ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఏ ఎన్నికలు చూసినా హిందూ, ముస్లిం, మందిర్‌, మాంసం ఇవే ప్రధాన అజెండాగా తిప్పుతున్నారు.
హిందూ మహిళల మంగళ సూత్రాలు, బంగారం డబ్బులు మైనార్టీలకు పంచి పెట్టాలని 2006లోనే మన్మోహన్‌ సింగ్‌ చెప్పాడని చెబుతున్న మోడీ అలాగైతే 2006 నుంచి 2014 వరకు ఎంత మంది మంగళ సూత్రాలు, డబ్బులు లాక్కొని పంచి పెట్టారో చెప్పాల్సింది కదా. 2006లో ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై ఏర్పాటు చేసిన జాతీయ అభివృద్ధి మండలి 52వ సమావేశంలో మైనారిటీలు, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలు, చిన్నారులందరినీ ఉద్దేశించి తను అన్నట్లుగా అప్పుడే వివరణ కూడా ఇచ్చారు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌. ఎన్నికల్లో లబ్దికోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ మెజార్టీలకు మైనార్టీల వల్ల ప్రమాదం ఉంటుదని, ఒకరి వల్ల ఇంకొకరికి సమ స్యలు వస్తాయని అభద్రత భావం కల్పించడం సరైన పద్ధతి కాదు. దేశ ప్రజలల్లో ఒకరిమీద ఒకరికి నమ్మకం, విశ్వాసం ఉండే విధంగా, సోదరభావం పెంపొందే విధంగా ప్రధాని రాజకీయ ఉపన్యాసాలు ఉండాలి గానీ, ఇలా మత, విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని మాత్రం భారత ప్రజలు క్షమించరు.
భరత్‌ చౌహాన్‌
9030666999

Spread the love