లౌకిక విలువల్ని కాపాడుకుందాం..

 ప్రజాస్వామిక లౌకిక విలువల్ని ప్రేమించే మిత్రులారా..ప్రజాస్వామిక లౌకిక విలువల్ని ప్రేమించే మిత్రులారా..
భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా నిర్మాణం చేయాలని పాలకులను రాజ్యాంగం ఆదేశించింది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠిక ప్రకారం దేశ పౌరులందరికీ సమాన హోదా, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కాలి. స్వతంత్రంగా ఆలోచించడానికి, భావాలను ప్రకటించడానికి, విభిన్న విశ్వాసాలు కలిగి ఉండి తదనుగుణంగా నడుచుకోవడానికి స్వేచ్ఛ, సమానత్వం ఉండాలి. పౌరుల మధ్య పరస్పర గౌరవాభిమానాలకు హామీ ఇచ్చే సౌభ్రాతృత్వం ఉండాలి.మన సమాజంలో ఎన్ని అసమానతలు, వివక్షలు ఉన్నప్పటికీ అట్టడుగు ప్రజాజీవితంలో స్వేచ్ఛ, సహకారం, లౌకిక భావన ఉన్నాయి. ప్రజలు వ్యక్తిగత, సాముదాయక జీవితంలో కట్టుబాట్లకు, విశ్వాసాలకు లోబడి ఉన్నప్పటికీ ఇతరులతో ప్రజాస్వామికంగా వ్యవహరించే వారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్న సమానత్వం, స్వేచ్ఛ, సహకారం, లౌకిక దృష్టి అనేవాటిని రాజ్యాంగం ఆధునిక ప్రజాస్వామిక విలువలుగా తనలో భాగం చేసుకుంది. వీటి ద్వారా ఈ లోకాన్ని మరింత మానవీయం చేయాలని, మంచిగా తయారు చేయాలని భారత ప్రజలు కలగన్నారు. అనేక సామాజిక ప్రక్రియల ద్వారా వీటిని నిజం చేసుకోడానికి రాజ్యాంగంలో మార్గనిర్దేశం చేసుకున్నారు.
దేశ ప్రజలు వందల ఏండ్లుగా స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక ప్రగతి కోసం చేసిన పోరాటాలు లేకుండా వీటిని మనం ఊహించలేం. రాచరిక భూస్వామ్య వ్యవస్థ నుంచి, వలస పాలన నుంచి విముక్తి పొందే క్రమంలో ఈ ఆదర్శాలు ముందుకు వచ్చాయి. అలాగే అంతర్జాతీయంగా జరిగిన వివిధ ప్రజాపోరాట అనుభవాల నుంచి, ఆచరణల నుంచి కూడా ఇవి క్రోడీకరించ బడ్డాయి. మహత్తరమైన ప్రజాస్వామిక లౌకిక విలువలు రాజ్యాంగ పీఠికలో భాగమయ్యాయి. మన సమాజాన్ని ఆధునికత వైపు నడిపించడానికి చారిత్రకంగా ఇవన్నీ అవసరమయ్యాయి.అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన 74 ఏండ్లలో దేశ సార్వభౌమాధికారం ఏమైంది? లౌకిక విలువలు ఎంతవరకు ప్రజల జీవితంలో భాగమయ్యాయి? మొత్తంగానే మన దేశం ప్రజాస్వామిక స్వభావం సంతరించుకున్నదా?సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆచరణలోకి వచ్చాయా? అసలు మన దేశం సామ్యవాదం వైపుగా పయనిస్తున్నదా? ఇలాంటి ప్రశ్నలు ఈనాడు మన ముందుకు వచ్చి నిలబడ్డాయి. ముఖ్యంగా రాజ్యాంగం ద్వారా ప్రజలకు లభించిన రాజకీయ సమానత్వం సామాజిక సమానత్వంగా పరివర్తన చెందడానికి ఒక అనివార్యమైన షరతుగా ఉండాల్సిన లౌకికవాద స్ఫూర్తి క్రమంగా రాజ్య విధానాలలో లుప్తమైపోయింది.
తత్ఫలితంగా ప్రజల లౌకిక జీవితాచరణ తీవ్రంగా దెబ్బతినిపోయి, యావత్‌ సమాజమే మెజారిటీ మతాచారాల, విశ్వాసాల, కట్టుబాట్లలోకి దిగజారిపోతున్నది. మైనారిటీ మత సమూహాల ప్రజలు తీవ్రమైన అభద్రతకు గురవుతున్నారు. కులాధిపత్య, పితృస్వామ్య విలువలతో కూడిన వర్ణధర్మాన్ని కాపాడే మనుస్మృతి ముందుకు వచ్చింది. ఫలితంగా వర్గ, వర్ణ, లింగ అసమానతల వ్యవస్థకు తగినట్లుగా ప్రజల మానసికత తయారవుతున్నది. ప్రజల్లో సహనం, సహజీవనం స్థానంలో విద్వేష సంస్కృతిని ప్రేరేపించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇందుకు విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్‌ అభివృద్ధి, వాటి భావజాలం సైతం తోడయ్యాయి. మతతత్వంతో ప్రజల సామాజిక జీవితాన్ని, కార్పోరేట్‌ పెట్టుబడిదారీ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల్లోని లౌకిక, సమానత్వ పునాదుల్ని దెబ్బతీస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి సృష్టించిన మతమే మనిషిని శాసించే నిరంకుశ శక్తిగా రూపాంతరం చెందుతున్నది. భారత రాజ్యాంగం ఏ విలువల మీద, ఆదర్శాల మీద రూపొందిందో వాటికి తీవ్రమైన విఘాతం కలుగుతోందని దేశ ప్రజలు ఆందోళన పడుతున్నారు. చట్టబద్ధ పాలన, రాజ్యాంగ మార్గదర్శకత్వం లోపిస్తే దేశం ఎట్లా ఉంటుందో మన అనుభవంలోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగం ప్రకటించిన లక్ష్యాల వైపు నుంచి ఈ స్థితిని అంచనా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిలో ‘లౌకిక విలువలు’ కీలకమైన అంశంగా ఇప్పుడు మన ముందున్నది.
ఇటువంటి పరిస్థితుల్లో సాహిత్యకారులుగా మన కర్తవ్యం ఏమిటి? ప్రయివేటు వ్యక్తిగత జీవితానికి పరిమితం కావాల్సిన మతానికి సామాజిక జీవితంలో చోటులేదని చెప్పాలి. రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని సాధనం చేసుకోవడం ప్రమాదకరమని చెప్పాలి. ఈరోజు మన కండ్లముందే లౌకిక, ప్రజాస్వామిక విలువలను ధ్వంసం చేస్తున్న ఫాసిస్టు క్రమాలను మానవ జీవితంలో దర్శించి సాహిత్యంగా మలచాల్సి ఉంది. వర్తమాన సామాజిక అవసరాలకు తగినట్లుగా లౌకిక విలువలకు ఉండే భిన్న పార్శ్వాలను సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకుంటూ సాహిత్య వస్తువుగా ఎంచుకోవాలి. గత కాలపు సాహిత్యాన్ని సైతం మౌలిక లౌకిక దృష్టితో కొత్తగా అధ్యయనం చేయాలి. ఇందుకు కావాల్సిన జ్ఞాన చైతన్యాల వినిమయం కోసం సమూహ-సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌ 2024 ఏప్రిల్‌ 28న ‘లౌకిక విలువలు-సాహిత్యం’ అనే అంశంపై వరంగల్లు నగరంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నది. ప్రజాస్వామికవాదులైన తెలంగాణ రచయితలందరూ సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొని లౌకిక విలువల పరిరక్షణను సాహిత్య ఉద్యమంలో భాగంగా విస్తరింప చేయాలని కోరుతున్నాం.
– సమూహ-సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌

Spread the love