ప్రేమకు పరిమితులెందుకు?

ప్రేమకు పరిమితులెందుకు?భార్యా భర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మనసులో ఉన్న విషయాలు పంచుకుంటే ఆ భారం తగ్గిపోతుంది. అలా కాదు అని భార్యతో ఇలాగే మాట్లాడాలి, భర్తతో ఇలాగే మాట్లాడాలి. ప్రేమికులతో ఇలా మాట్లాడాలి అంటూ నియమాలు పెట్టుకుని సరిగ్గా మాట్లాడుకోకపోతే సమస్యలు మరింత పెరగుతాయి. భార్యా భర్తలు ప్రేమికుల్లా అన్నీ చెప్పుకుంటారా అని కొందరు అనుకుంటారు. మరికొందరైతే అసలు మాట్లాడుకోవడమే తప్పనుకుంటారు. ఇద్దరి మధ్య దూరం పెరగకుండా చూసుకోవడం ముఖ్యమని అస్సలు అనుకోరు. దీని వల్ల కూడా చాలా జంటల మధ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అలాంటి కథనే ఈ వారం ఐద్వా అదాలత్‌లో.. మీరూ చదవండీ…
నవీన్‌కు దాదాపు 38 ఏండ్లు ఉంటాయి. పదేండ్ల కిందట నీలిమతో వివాహయింది. నీలిమ, నవీన్‌కి అక్క కూతురు. పెద్దలు కుదిర్చిన వివాహం. నవీన్‌ ఓ ప్రయివేట్‌ కంపెనీలో ఉద్యోగి. నీలిమ ఆ కోర్సూ, ఈ కోర్సూ అంటూ ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటుంది. కానీ ఏదీ సరిగా పూర్తి చేయదు. మొత్తానికి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.
అలాంటి నీలిమ ఎవరితో చెప్పుకోలేని ఓ సమస్యతో చాలా రోజుల నుండి సతమతమవుతుంది. తెలిసిన వారి ద్వారా ఐద్వా లీగల్‌ సెల్‌కు వచ్చి ‘మాకు పెండ్లి జరిగి పదేండ్లు అవుతుంది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దీని గురించి నవీన్‌ అస్సలు పట్టించుకోడు. నాతో అసలు ప్రేమగానే ఉండడు. ఏదో తనకు నచ్చినప్పుడు వస్తాడు అంతే. నాకు అలా నచ్చడం లేదు. నన్ను తనకు నచ్చినట్టు ఉపయోగించుకుంటాడు. తనతో ఈ విషయం మాట్లాడదామంటే అస్సలు వినిపించుకోడు. వాళ్ళమ్మతో చెబుదామంటే నాకు అమ్మమ్మ అవుతుంది. తనతో ఈ విషయం ఎలా చెప్పాలి? మా అమ్మకు చెబుదామంటే బాధపడుతుందేమో అని భయం. మీరే ఎలాగైనా నా భర్తతో మాట్లాడి నాకో పరిష్కారం చూపండి’ అంది.
మేము నవీన్‌కు ఫోన్‌ చేసి పిలిపించి నీలిమ బాధ గురించి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించాము. కానీ అతను మేము చెప్పింది మొత్తం విని ‘తను నాకు భార్య అనుకుంటున్నారా ప్రేమికురాలు అనుకుంటున్నారా? తనకు చెప్పాల్సింది పోయి మీరు నన్నే పిలిచి మాట్లాడుతున్నారు. మేము భార్యా భర్తలం కదా ప్రేమికుల్లా ముద్దులు పెట్టడం, పెట్టించుకోవడం ఇలాంటివి నాకు నచ్చవు. తనేమో ఇద్దరం కలిసి లవ్‌ స్టోరీలు చూద్దామంటది. ఇదంతా నాకు ఇష్టం లేదు. భార్యా భర్తలంటే ఎలా ఉండాలి? ఆడదానికి ఆ మాత్రం తెలియదా? మా కుటుంబంలో ఇలా ఆలోచించే వారు ఎవరూ లేరు. నీలిమనే ఇలా తయారయింది. మా అమ్మ, నాన్న, అక్క, బావ, అన్నయ్య, వదిన ఎవరూ ఇలా వంకరటింకరగా ఆలోచించరు. నీలిమ మాటల్లో ఎప్పుడూ నాకు అదే ధ్వాస కనిపిస్తుంది’ అన్నాడు.
నీలిమ మాట్లాడుతూ ‘ఆయనకు నచ్చినప్పుడు నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నాకు నచ్చకపోయినా నేను ఎప్పుడూ ఆయన్ని కాదనలేదు. కానీ ఆయన మాత్రం నా గురించి అస్సలు పట్టించుకోడు. నా ఇష్టాల గురించి ఆలోచించడు. ఆయన సుఖం ఆయన చూసుకుంటాడు’ అంది.
ఇద్దరి మాటలు విన్న తర్వాత మేము ‘భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా, అన్యోన్యంగా ఉండడం చాలా అవసరం. ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండాలంటే దానికి శారీరక సంబంధం కూడా చాలా అవసరం. ఇందులో ఎక్కువ, తక్కువ అని ఉండదు. అయితే అది జీవితంలో ఒక భాగంగానే ఉండాలి. అదే జీవితంగా మారిపోకూడదు. భార్యంటే కేవలం మీ కోరికలు తీర్చుకోడానికే ఉంది అన్నట్టు మీ ప్రవర్తన ఉండకూడదు. గతంలో కంటే పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆమే మనిషే కదా ఆమెకూ కొన్ని కోరికలు, ఆలోచనలు ఉంటాయి. వాటికి మీరూ విలువివ్వాలి. భార్యతో ప్రేమికురాలిగా ఎలా ఉంటాను అంటున్నారు. అందులో తప్పేముంది. ప్రేమ విషయంలో భార్యతో ఇలా ఉండాలి, ప్రేమికురాలితో అలా ఉండాలి అనే నియమాలు ఏమీ లేవు. భార్యపైన ప్రేమ చూపించడంలో తప్పేమీ లేదు. ముందు మీరిద్దరూ ప్రశాంతంగా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి. ప్రస్తుతం ఉన్నది మీరిద్దరే. కనుక ఒకరికి నచ్చినట్టు ఒకరు నడుచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ సమస్యలు పరిష్కారమవుతాయి’ అని నవీన్‌కి చెప్పాము.
కాస్త అర్థం చేసుకున్న నవీన్‌ ‘ఇన్ని రోజులు నా భార్య నా ఇష్టం అనుకున్నాను. నా ప్రవర్తన వల్ల తను ఇంత బాధపడుతుందని అనుకోలేదు. ఇప్పటి నుండి తన మనసుకు నచ్చినట్టు నడుచుకుంటాను. తనకు నచ్చినట్టు ఉంటాను’ అని చెప్పాడు.
నీలిమతో ‘నవీన్‌ మారతానని చెప్పాడు. నువ్వు కూడా కాస్త బాధ్యతగా ఉండటం నేర్చుకోవాలి. నేర్చుకుంటున్న కోర్సుల్లో ఏదో ఒకటి పూర్తి చేసి మంచి ఉద్యోగం చూసుకో. నీకూ బాధ్యతలు తెలిసి వస్తాయి. ఇంట్లో నీకేదైనా ఇబ్బంది వస్తే అమ్మమ్మతోనో, అమ్మతోనే చెప్పుకోడానికి ఇబ్బంది పడకు. ఒక వేళ వాళ్ళకు చెప్పుకోలేకపోతే మా దగ్గరకు వచ్చి చెప్పు. అంతే కానీ నీలో నువ్వు కుమిలిపోవద్దు. ఏది ఏమైనా ఇద్దరూ సంతోషంగా ఉండండి’ అని చెప్పాము.
ఇద్దరినీ కూర్చోబెట్టి ‘ముందు ఇద్దరూ పిల్లలకు ప్లాన్‌ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్‌ని కలిసి మందులు వాడండి. ప్రేమికులు భార్యాభర్తలైతే కొంత కమిట్‌మెంట్‌ పెరుగుతుంది. అదే తల్లిదండ్రులైతే బాధ్యతలు మరింత పెరుగుతాయి. మీ ఇద్దరి మధ్య ఆ బాధ్యత లేకనే ఈ సమస్యలన్నీ. తల్లిదండ్రులైతే మీ మధ్య ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతే కానీ ఎవరి కోరికలకు తగ్గట్టు వాళ్ళు నడుచుకోవాలని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. నేటి కాలంలో పిల్లలు పుట్టకుండా ఎంత ఆలస్యం చేస్తే సమస్య అంత ఎక్కువగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి’ అని చెప్పి పంపించాము.

Spread the love