చల్లకొచ్చి ముంతదాచుడెందుకు?

చల్లకొచ్చి ముంతదాచుడెందుకు?దేశంలో పెచ్చరిల్లిన మతోన్మాద రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఏప్రిల్‌ 22న రాజస్థాన్‌లో ప్రారంభించి దేశమంతా స్వయానా ప్రధానే వెదజల్లుతున్న ప్రసంగాల తీరు చూసి ప్రపంచమే విస్తుపోతోంది. మోడీ కక్కుతున్న విషం మైనారిటీలనే కాదు, మెజారిటీ మతస్తుల్లోనూ భయాందోళనలు కల్పిస్తోంది. ఈ ఉన్మాదం దేశాన్ని ఏ స్థాయికి చేరుస్తుందోనని సామాన్య పౌరులు సైతం ఆందోళనపడ్తున్నారు. కష్టజీవుల వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసే సాధనంగా, ఆ విధంగా శతసహస్ర కోటీశ్వరుల బొక్కసాలు నింపే మార్గంగా దీన్ని పరిగణిస్తున్నారు.
విషయం ఇది కాగా, గత డిసెంబరు వరకు ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’గా ఒక వెలుగు వెలిగిన ‘రాజమానస పుత్రిక’కు అసలీ ధ్యాసే ఉన్నట్టు కనపడదు. అధినేత ఆయన లెఫ్టినెంట్లు మౌఖికంగా వాడే భాషకి, ఈ పత్రికలో రాసే మాటలకీ పొంతనుండదు. అంటే, ‘సామ్రాట్టు’కి రైటింగ్‌లో దొరకరన్నమాట. అవసరమైనపుడు ‘బారాఖూన్‌ మాఫ్‌’ చేయమని అభ్యర్థించుకునేందుకేనా ఆ విన్యాసం? ఇక ‘పతనా’ల గురించి, ‘స్వాభిమానం’ గురించి సీపీఐ(ఎం)ను దెప్పిపొడిచిన వ్యక్తి కంటే ‘వివేక భ్రష్ట సంపాతముల్‌’కు సూట్‌కాగల వ్యక్తులు అరుదు.
‘టంకశాల’ వారి వంటి పెద్దలు ఊరకరాస్తారా వ్యాసాలు? ఆ వ్యాస లక్ష్యం సీపీఐ(ఎం)కు, కాంగ్రెస్‌కు మధ్య మంటపెట్టడం. కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నట్టు కనపడుతూ ‘మీ పార్టీ విజయన్‌ని తిడితే మీరెందుకు మాట్లాడరని సీపీఐ(ఎం)ను దెప్పిపొడవడం! రాజకీయాలు వదిలేసిన కాంగ్రెస్‌ స్థాయికి సీపీఐ(ఎం) ఎందుకు దిగజారదని అశోక్‌గారి చొప్పదంటు ప్రశ్న అనుకుంటా! పైగా కేరళకుపోయి రేవంత్‌రెడ్డి, ఆయన అధినేత రాహుల్‌గాంధీ కేరళ ముఖ్యమంత్రిని ‘దోషి’గా నిర్థారించివస్తే తమ్మినేని వీరభద్రం, భట్టి విక్రమార్కతో సయ్యాటలాడారనేది అశోక్‌గారి విమర్శ. నవతెలంగాణలో వీరభద్రం మాట్లాడిన వాక్యం ఒకటే కనపడటం కూడా అశోక్‌గారి ఆశ్చర్యానికి మరో కారణం. అది విలేకరుల ముందు అన్న విషయం. అడగదల్చుకున్న దాన్ని మొహమ్మీదే అడిగే అలవాటున్న నలుగురు సీపీఐ(ఎం) నేతలు లోపల మాట్లాడినదాన్ని బయట విలేకరులతో చెప్పిన మాటలతో పోల్చి ఊహాగానాలు చేయడం ఎంతటి జర్నలిస్టులకైనా తగదు.
సీపీఐ(ఎం) రాజకీయ విధానం తప్పనుకుంటే దాన్ని సూటిగా విమర్శించవచ్చు. ఆ పని కొందరు చేస్తున్నారు కూడా. దాన్నెవరైనా అర్థం చేసుకుం టారు. కాని స్పష్టంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న దాన్ని టంకశాల వారు చూడలేదో, చూసినా తన విమర్శనా పత్రానికి సూట్‌ కాదనుకున్నారో తెలీదుగాని నవతెలంగాణలో వచ్చిన కింది విషయాలను ఐచ్ఛికంగా పరిగణనలోకి తీసుకోలేదు.
అదేరోజు కాప్రాలో మాట్లాడిన రాఘవులు టంక శాల వారన్నట్టు ‘మరి కొన్ని వ్యాఖ్యలు’ చేయటం కాదు నవతెలంగాణ వార్త చదివితే ఏ కాంగ్రెస్‌ నాయకుడికైనా నషా ళానికి ఎక్కేపదాలు వాడారు. అదే రోజు అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేరళలోనే మాట్లాడు తూ అసలు ‘రాహుల్‌కు విజ్ఞత ఉందా?’ అని ప్రశ్నించారు. దాదాపు పది లైన్లు నవతెలంగాణ ప్రచురించింది. రాహులయినా, రేవంతయినా సీపీఐ(ఎం)కు చుట్టాలు కాదు. సీపీఐ(ఎం) నడిచేది రాజకీయాలను బట్టి. రాహుల్‌ గాంధీని పార్లమెంటు నుండి సస్పెండ్‌ చేస్తే మొట్టమొదట దాన్ని ఖండించింది విజయన్‌ మాత్రమే.
కేరళలో కాంగ్రెస్‌ చేస్తున్న కక్కుర్తి రాజకీయాలు తప్పిస్తే, బీజేపీని నిరోధించేందుకు సీరియస్‌ ప్రయత్నం చేస్తున్న ఇండియా కూటమిలో కాకుండా, అసలుంటుందో లేదో తెలియని కేసీఆర్‌ ఊహాలోకాల్లోని ‘హాచ్‌ పాచ్‌’ కూటమిలో వామపక్షాలు భాగస్వాములయ్యుండాలనేది ఈ మేటి కాలమిస్ట్‌ ఆలోచన కాబోలు!
అశోక్‌ వ్యాసంలో మరో కీలకాంశం ఇండియా కూటమిలో ఐక్యత లేదట! ఉమ్మడి పత్రం ప్రకటించలేదట! నాయకుడెవరో తేల్చుకోలేదట! శక్తివంతులైన అనేక ప్రాంతీయ పార్టీలతో కూడిన వేదికకు విధానాలు కీలకమవుతాయి. అనేకసార్లు సీపీఐ(ఎం) నేతలు ప్రకటించినట్టు ముందీ మహమ్మారి’ని దింపేస్తే 1977లాగా, 1996లాగా, 2004లాగా కూటములు, దానికి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకులు సమకూరడం పెద్ద కష్టమేమీకాదు. అనేక మంది బీఆర్‌ఎస్‌ నేతల ఉపన్యాసాల్లో బీజేపీని ఓడించాలనే మాట సెర్చ్‌లైట్‌ వేసి వెతికినా కనపడదు. బహుశా ఆ కోవకే అశోక్‌ వ్యాసం చెందుతుందేమో.
అశోక్‌ సౌకర్యవంతంగా కొన్ని విషయాలను వదిలేశారు. లేదా తిరగేసి చెప్పారు. కేరళ మోడల్‌ ఒక ‘నానుడి’ కాదు అది ఒక నిజం. అది తెలంగాణ మోడలో, గుజరాత్‌ మోడలో కాదు. ప్రజల ఆశల నుండి ఆవిర్భవించిన ప్రజాపాలన మోడల్‌. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా కేరళ గొంతు నులిమేస్తున్నది. అయినా అక్కడ ఇళ్ళు లేనివారికి ఇళ్ళు కట్టించి ఇచ్చింది ఆ ప్రభుత్వం. వాటిని పార్టీల వారీగా పంచుకోలేదు మన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళలా. గ్రామ సభల్లో నిర్ణయించిన వారికే ఇల్లు. ఫలానా వ్యక్తికి అని సర్పంచ్‌ ప్రతిపాదిస్తే ఆయన కు లేదా ఆమెకు ఇల్లు ఇప్పటికే ఉందని చెప్పి ఎవరైనా రుజువు చేస్తే ఆ వ్యక్తికి ఇల్లురాదు. ఈ పద్ధతి ఇతర బూర్జువా పార్టీలకు అసాధ్యమైన విషయం. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో సగం పంచాయతీలు, లోకల్‌ బాడీల ద్వారా ఖర్చు చేస్తారక్కడ. యావత్‌ భారతదేశంలో 41, 42 రాజ్యాంగ సవరణలను అమలుచేసిన రాష్ట్రం అది.
బీఆర్‌ఎస్‌ వైఖరి బీజేపీకి ధైర్యం తెస్తోందనే విషయం అశోక్‌ గమనించారా? బీఆర్‌ఎస్‌ ఓట్లు చెదిరి ఎటుపోతు న్నాయి? కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదెందుకు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ కంటే కాంగ్రెస్‌పైనే దాడెందుకు ఎక్కుపెట్టారు? బీఆర్‌ఎస్‌ నేతలకు కాంగ్రెసే ఎందుకు ప్రమాదకరంగా కనిపిస్తోంది? కవిత అరెస్టుపై కేసీఆర్‌ ఎదుకు స్పందించలేదు? ఈ విషయం అశోక్‌ పరిగణనలోకి తీసుకున్నారా? నమస్తే తెలంగాణలో టంకశాల అశోక్‌ రాసిన వ్యాసం లక్ష్యం బీజేపీని ఓడించడమా? కాంగ్రెస్‌ చేతగానితనాన్ని ప్రశ్నించడమా? సీపీఐ(ఎం)ను నిందించ డమా? ఆయన ఏమి కోరుకున్నారు? బీజేపీని ఓడించడానికి కాలకూటవిషమైనా మింగడానికి సిద్ధంగా ఉండాలని ఆయనకి తెలియదనుకోలేం. నాజీలపై యుద్ధంలో అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌లతో జట్టుకట్టినందుకు.. సోవియట్‌ అధ్యక్షుడు స్టాలిన్‌పై వచ్చిన విమర్శలకు సమాధానంగా ”తన మాతృదేశ రక్షణకు తాను దెయ్యంతోనైనా సంధి చేసుకుంటా”నన్న విషయం మనగమనంలో ఉండాలి.
తెలంగాణలో మతతత్వ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అశోక్‌కి అర్థం కాదనో, కాలేదనో అనుకోలేం. బీఆర్‌ఎస్‌ నాయకులు పక్కచూపులు చూడడమేకాదు. బీజేపీ, కాంగ్రెస్సుల్లోకి సర్దుకుంటున్నారు. వారి అనుయాయులూ గోడదూకేస్తున్నారు. ఈ దశలో బీఆర్‌ఎస్‌ పక్కనుండాల్సిన కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ పక్షం వహించడమేంటి? అనేది అశోక్‌ ప్రధాన అంశం. చల్లకోసం వచ్చి ముంత దాచుకుంటే ఏం ఉపయోగం? అసలీ మతోన్మాద ప్రమాదంగాని, దాని సీరియస్‌నెస్‌గాని ఏ ఎండకాగొడుగు పట్టే బీఆర్‌ఎస్‌కు అర్థం కాలేదంటే అర్థం చేసుకోవచ్చు. టంకశాల అశోక్‌ వంటి సీజన్డ్‌ కాలమిస్ట్‌లకు తెలియాలికదా!?
బీజేపీ మరోసారి అధికారంలోకొస్తే దేశ రాజ్యాంగానికి, సమగ్రతకు, సమైక్యతకు పెనుప్రమాదం పొంచి ఉందనేది ఒక్క సీపీఐ(ఎం) అభిప్రాయమేకాదు. అనేకమంది జ్యూరిస్టులు, సైంటిస్టులు, ఆర్టిస్టులవంటి మేధావులేకాదు, చివరికి మతాచార్యులు సైతం ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మతోన్మాద ప్రమాదాన్ని సాకల్యంగా ఆకళింపు చేసుకున్నవారు కమ్యూనిస్టులే! వారిని దారి తప్పించే ప్రయత్నాలు చెల్లుబాటుకావు.
సీపీఐ(ఎం) తాను నిర్ణయించుకున్న పంథాలో నడుస్తుంది. అది బీఆర్‌ఎస్‌కో, బీజేపీకో ఉపయోగపడేందుకు కాదు. ఆ రాజకీయ విధానమే సరైంది కాదని భావించినవారు దాన్ని విమర్శించవచ్చు. సరిచేసుకొమ్మని చెప్పవచ్చు. కాని అశోక్‌ కాంగ్రెస్‌ను ఏమని విమర్శించారో, ఎందుకు విమర్శించారో ఆ పనినే సీపీఐ(ఎం)ను చేయమని అడగడం ఏం న్యాయం?
ఆర్‌ సుధాభాస్కర్‌

Spread the love