ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

– పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్, సీ.పీ వెల్లడి
నవతెలంగాణ – కంటేశ్వర్
పార్లమెంటు ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్, సీ.పీలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వచ్చిందని, జూన్ 06 వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26 న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సీఎంసీ కళాశాలలో కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. 2019 పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కూడా సీఎంసీ లోనే చేపట్టినప్పటికీ కేవలం నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను మాత్రమే ఇక్కడ లెక్కించారని, పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాల ఓట్లను జగిత్యాలలో లెక్కించడం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి మాత్రం నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన ఓట్లన్నీ ఒకేచోట సీఎంసీ లోనే కౌంటింగ్ జరుపుతామని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ సహా జిల్లా పరిధిలో మొత్తం ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున అనుమ‌తులు లేకుండా ఎటువంటి స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌రాద‌ని సూచించారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న మీదటే సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో   ఎం.సీ.సీ,  సర్వేలెన్స్ బృందాలను,  ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను,  వీడియో సర్వేలెన్సు బృందాలను,  ఎం.సీ.ఎం.సీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని, నోడల్ అధికారులను నియమించామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై సంబంధిత చట్టాలను అనుసరిస్తూ కేసులు నమోదు చేస్తామని అన్నారు. కోడ్ ఉల్లంఘన గురించి ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సీ-విజిల్ యాప్ ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందన్నారు. ఈ యాప్ ద్వారా కోడ్ ఉల్లంఘన అంశాలు లైవ్ ఫోటోలు, వీడియోలు తీసి ఈ.సీ దృష్టికి తేవచ్చని సూచించారు. ఎన్నికల నియమావళి అమలు తీరు పర్యవేక్షణకై జిల్లా స్థాయిలో ఇంటెలిజెన్స్ కమిటీని నెలకొల్పామని తెలిపారు. 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు, దివ్యంగ ఓటర్లు ఇంటి నుండి ఓటు వేసే వెసులుబాటు ఉందని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజులలోపు, అంటే ఏప్రిల్ 22 వ తేదీ లోపు 12-డి ఫారం భర్తీ చేసి బీ.ఎల్.ఒలకు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ముందస్తుగానే వారికి బీఎల్ఓ ల ద్వారా 12 – డీ ఫారంలు అందజేయబడతాయని తెలిపారు. ఎన్నికల విధుల్లో సుమారు 8 వేల మంది వరకు సిబ్బంది పాల్గొంటారని అన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.  పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల‌లో అదనపు పోలీసు బలగాలతో పాటు, ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. పరిస్థితులను బట్టి పోలింగ్ నాటికి వీటి సంఖ్య మారే అవకాశాలు ఉంటాయన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు జిల్లాలో మొత్తం 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటిలో అంతర్రాష్ట్ర సరిహద్దులలో నాలుగు ఉమ్మడి తనిఖీ కేంద్రాలు ఉండగా, జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో ఆరు చెక్ పోస్టులు, జిల్లాలోనే స్థానికంగా వివిధ ప్రాంతాలలో మరో ఎనిమిది తనిఖీ కేంద్రాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని  ప్రజలు తగిన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు తో ప్రయాణించవద్దని, తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆ కమిటీకి తగిన ఆధారాలు సమర్పించినట్లయితే  గ్రీవెన్స్ కమిటీ వాటిని పరిశీలించి నగదు విడుదల చేస్తుందని తెలిపారు. తనిఖీ బృందాలకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ ఐ.ఏ.ఎస్ కిరణ్మయి, ట్రైనీ ఐ.పీ.ఎస్ చైతన్య రెడ్డి, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love