
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కాంగ్రెస్ ఉద్దెర మాటలు..అడ్డగోలు హామీలిచ్చి ఆరు గ్యారెంటీల అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రజలను మాయచేసి మభ్యపెట్టిందని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని శుభం గార్డెన్ లో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ విద్యార్థి యువజన చైతన్య సదస్సు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ నీళ్లు,నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. కొట్లాడి సాధించిన తెలంగాణ లో పదేళ్లు అభివృద్ధి చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మాయచేసి మభ్యపెడుతుందన్నారు.
రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించాలని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1.61 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్ కు గుడి …బడి తేలేదన్నారు. నేను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ లో ట్రిబుల్ ఐటీ మంజూరు చేయించి, 50 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తే ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పట్టించుకోక పోవడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు తరలించిందని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిదీలో బండి సంజయ్ ఒక్క గుడి తేలేదు.. ఒక్క నవోదయ పాఠశాల తేలేదని పేర్కొన్నారు. బండి సంజయ్ కి యువకులు, విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా కేంద్రం నుంచి నైపుణ్యాభివృద్ది కేంద్రాలు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ కు ఇతర రాష్ట్రాల వారు వివిధ స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు నేర్చుకుని వచ్చి 30లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు.తెలంగాణ లో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఇంకా 23 నవోదయ విద్యాలయాలు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవిందర్ రావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాష్, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కర్ర శ్రీవారి,దరువు ఎల్లన్న, ఏనుగుల రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు,మాజీ సర్పంచ్ లు, విద్యార్థి నాయకులు యువకులు పాల్గొన్నారు.