కాంగ్రెస్‌ సెంచరీ

కాంగ్రెస్‌ సెంచరీ– ఇండిపెండెంట్‌ ‘మహా’ ఎంపీ బేషరతు మద్దతు
– వందకు చేరిన హస్తం పార్టీ బలం
– సాంగ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన విశాల్‌ పాటిల్‌
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో 99 స్థానాల వద్ద ఆగిపోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు సెంచరీ మార్కును చేరింది. మహారాష్ట్రలోని సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికైన విశాల్‌ పాటిల్‌ కాంగ్రెస్‌ పార్టీకి తన బేషరతు మద్దతును ప్రకటించారు. దీంతో 18వ లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ బలం పెరిగింది. కాంగ్రెస్‌కు ఇప్పుడు 100 మంది ఎంపీలు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత, కాంగ్రెస్‌ సంప్రదాయక కంచుకోట అయిన సాంగ్లీ సీటు శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాక్రే)కి దక్కటంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు కలత చెందారు. అయితే విశాల్‌ పాటిల్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. విశాల్‌ పాటిల్‌ మహావికాస్‌ అఘాడి(ఎంవీఏ), మహాయుతి(ఎన్డీఏ) రెండింటి అభ్యర్థులను ఓడించారు. రెండుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన సంజరు పాటిల్‌ కంటే విశాల్‌ పాటిల్‌కు 1,00,053 ఓట్లు ఎక్కువ వచ్చాయి.
కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపుతూ పాటిల్‌ లేఖ అందిన తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌, మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ వంటి స్పూర్తిదాయక మహనీయులకు విశాల్‌ పాటిల్‌ నిర్ణయం సముచితమైన నివాళి అని ఖర్గే ప్రశంసలు గుప్పించారు.
విశాల్‌ పాటిల్‌ ఎవరు?
విశాల్‌ పాటిల్‌ కుటుంబానికి కాంగ్రెస్‌, గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వసంతదాదా పాటిల్‌ మనవడు విశాల్‌ పాటిల్‌. విశాల్‌ దివంగత తండ్రి ప్రకాష్‌ బాపు పాటిల్‌ కూడా ఎంపీగా ఉండగా, ఆయన సోదరుడు ప్రతీక్‌ పాటిల్‌ యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోటే. అయితే 2014లో లోక్‌సభ ఎన్నికల్లో విశాల్‌ సోదరుడు ప్రతీక్‌ పాటిల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2019 లో, విశాల్‌.. రైతు నాయకుడు రాజు శెట్టి స్వాభిమాని షెట్కారీ పార్టీ నుంచి ఎన్నికలలో పోటీ చేశాడు. అయితే ఓట్ల చీలిక కారణంగా.. బీజేపీ అభ్యర్థి సంజరు పాటిల్‌ రెండోసారి ఇక్కడ నుంచి గెలిచారు.
దళిత, ముస్లిం ఓట్లు నిర్ణయాత్మక అంశం
2019 లోక్‌సభ ఎన్నికలలో సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గంలో చీలిక ఏర్పడింది. వంచిత్‌ బహుజన్‌ అఘాడి(వీబీఏ) అభ్యర్థి 2.5 లక్షలకు పైగా ఓట్లు సాధించటంతో అది కాస్తా విశాల్‌ ఓటమికి దారితీసింది. అయితే, ఈ ఏడాది ఎన్నికల్లో వీబీఏ తన సొంత అభ్యర్థిని నిలబెట్టకుండా విశాల్‌కు మద్దతిచ్చింది. దీంతో దళిత, ముస్లిం ఓట్లు విశాల్‌కు కలిసొచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు, మహాయుతి అభ్యర్థి సంజరు పాటిల్‌ కోసం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా ర్యాలీలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో అభివృద్ధి పనుల కంటే హిందుత్వ, హిందూ-ముస్లిం అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టి మతం ఆధారంగానే ఓట్లు సాధించాలనేది వారి ప్రచార ప్రసంగాల్లో కనిపించింది. అయితే, సాంగ్లీలోని ఓటర్లు మాత్రం హిందుత్వ కార్డును తిరస్కరించి విశాల్‌ పాటిల్‌ను తమ ఎంపీగా ఎన్నుకున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగానూ ఎన్డీఏకు చేదు ఫలితాలు రావటంతో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌.. తన పదవికి సిద్ధమైన విషయం విదితమే.

Spread the love