మార్పు కావాలంటే.. కాంగ్రెస్‌ రావాలి

If you want change.. Congress should come– తప్పుల కేసీఆర్‌ శిరచ్ఛేదనం జరగాల్సిందే..
– కేసీఆర్‌ అధికారంలో ఉంటే ఉద్యోగాలు రావు
– భూములు గుంజుకునేందుకే కామారెడ్డికి వస్తున్నారు.. : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్‌/వరంగల్‌/ రామారెడ్డి
మార్పు కావాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని, తెలంగాణ పాపాల భైరవుడు కేసీఆర్‌ వంద తప్పులు పూర్తయ్యాయని, ఇక శిరచ్ఛేదనం జరగాలని, బీఆర్‌ఎస్‌ నేలకూలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించకుంటే 30 లక్షలమంది నిరుద్యోగ యువకులు అడవిబాట పట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మంగళ వారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట, కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించకుంటే 30 లక్షలమంది నిరుద్యోగ యువకులు అడవిబాట పట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తల్లిదండ్రులపై భారం మోపలేక పట్టణాల్లో విద్యార్థులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2004 వైఎస్సార్‌ హయాంలో రూ.12వేల కోట్లతో రైతు కరెంటు బకాయిల రద్దు, 9 గంటల కరెంటు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చిన వెంటనే ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు అమలు చేస్తామని స్పష్టంచేశారు. అలాగే, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల నెలకొల్పే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, కరువు, ఆడబిడ్డలపై అత్యాచారాల్లో మొదటి స్థానం తప్ప, ఏ విషయంలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందో కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు. సీఎం అయిన తర్వాత ఏడాదికి 1800 బార్లు, 3000 వైన్‌ షాపులు, 62వేల బెల్టు షాపులు తెరిచి, రూ.36 వేల కోట్ల ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన నాయకుడు.. దేశంలో ఏక్కడా లేడన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నా.. గ్రామాల్లో బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఖాళీ సీసాలు అమ్ముకుని బతుకమని చెపుతున్న అసమర్థుడని తెలిపారు. స్టేషన్‌ ఘనపూర్‌ భవిష్యత్తు, అభివృద్ధి ఇక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ అభ్యర్థి సింగపురం ఇందిరను గెలిపించాలని పిలుపునిచ్చారు. సభలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, రాష్ట్ర అబ్జర్వర్‌ శోభారాణి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఉపాధ్యక్షులు జగదీష్‌ రెడ్డి, సుభాష్‌ రెడ్డి, కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, లింగాజీ, చేపూరి చిరంజీవి, అనిల్‌, దిలీప్‌ రెడ్డి, మండలాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు
వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలోని మామునూరు లక్ష్మీపురం వద్ద జరిగిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత దోచుకున్నారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్‌ కుటుంబం మింగిందని ఆరోపించారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్‌ను చూడటానికి వెళితే అక్కడి వరకు పోకుండా పోలీసులను పెట్టి అడ్డుకున్నారన్నారు.
గజ్వేల్‌లో కేసీఆర్‌.. వెయ్యి ఎకరాల్లో, కేటీఆర్‌ 100 ఎకరాల్లో గడీలు నిర్మించుకున్నారని, కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. ఆరూరి రమేష్‌ లాండ్‌ పులింగ్‌ పేరుతో తమ భూములను లాక్కోవద్దని పేదలు నిరసన తెలిపితే పోలీస్‌ బుట్లతో తొక్కించారని తెలిపారు. ఆ జీవో ఇంకా రద్దు కాలేదన్నారు. పేదలందరూ కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కేఆర్‌ నాగరాజు, నర్సంపేట నియోజకవర్గ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, హన్మకొండ నియోజకవర్గం అభ్యర్థి రాజేందర్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వరద రాజేశ్వర్‌ రావు, హన్మకొండ నియోజక వర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి నాయిని రాజేందర్‌ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ అధికారంలో ఉంటే ఉద్యోగాలు రావు
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో నిర్వహించిన సభలో రేవంత్‌ మాట్లా డుతూ.. సీఎం కేసీఆర్‌ కుటుంబం అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగా లు రావని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తలేవని, తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతా యని ఆశపడ్డ యువతకు నిరాశే మిగిలిందన్నారు. నిరుద్యోగులు ‘నిరుద్యోగ గోస’ బ్యానర్‌ పట్టు కున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు ఖాళీ కడుపుతో రెక్కల కష్టం చేసి పిల్లలను చదివిస్తే.. ప్రభుత్వం పరీక్షా పత్రాలు అమ్ముకుందని, దాంతో నిరుద్యోగు లు ఉద్యోగం రాక, ఊర్లో ముఖం చూపించక ఉరేసుకుని చస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతుల ఆత్మహత్యలూ ఆగలేదని, రామా రెడ్డికి చెందిన లింబయ్య పంట నష్టపోయి పట్నం లో బతకలేక ట్యాంక్‌ బండ్‌పై ఉరేసుకున్నాడని, ధాన్యం కుప్పపై చలికి, వానకు గుండె ఆగిపోయి బీరయ్య అనే రైతు చనిపోయాడని గుర్తుచేశారు. ఆ బాధిత కుటుంబాలను సీఎం, ఎమ్మెల్యేలు పరామ ర్శించిన పాపాన పోలేదన్నారు. మాస్టర్‌ ప్లాన్‌తో భూములు గుంజుకు నేందుకు కేసీఆర్‌ కామారెడ్డికి వస్తున్నాడని స్పష్టం చేశారు. అడవిలో పులి ఊర్లలో మనుషులను, పెంపుడు జంతువులను తినడానికి వస్తే.. పక్క ఊరి నుంచి తనను వేటగాడిగా అధిష్టానం పంపిందని, కేసీఆర్‌ను వెంటాడి కామారెడ్డి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను వివరించారు. ఈ సభ సందర్భంగా మండలంలోని బట్టు తాండ సర్పంచ్‌ రెడ్డినాయక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ, అరికెల నర్సారెడ్డి, అద్దంకి దయాకర్‌, యూసుఫ్‌ అలీ, జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌ నారెడ్డి మోహన్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love