ఎన్నికల్లో చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి
ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?
పంటలను కొనుగోలు చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చెప్పిందొకటి… అధికారంలోకి వచ్చాక అమలు చేసేదొకటని ఎద్దేవా చేశారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని వివరించారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదా?అని విమర్శించారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా?అని ప్రశ్నించారు. 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారనీ, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందనీ, మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలని డిమాండ్ చేశారు.
శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయని విమర్శించారు. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపేశారని తెలిపారు. శనగలకు మద్దతు ధర రూ.5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రయివేట్ వ్యాపారులకు రూ.మూడు వేలు, రూ.నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని అడిగారు. కనీస మద్దతు ధర రూ.3,371 ఉంటే, ప్రయివేటు వ్యక్తులకు కేవలం రూ.2,500లకే రైతులు నష్టపోతూ అమ్ముకుంటున్నారని వివరించారు. ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష అవసరమా?అని తెలిపారు. ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, లేదంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.



