సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు

నవతెలంగాణ- విలేకరులు
తమ జీవితాలకు భద్రత.. జీవనానికి అవసరమైన వేతన పెంపు కోసం జీవో 60 అమలు చేయాలంటూ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం కనికరం చూపడం లేదు. పైగా సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికారులు, పోలీసులు కలిసి కుట్ర చేస్తున్నారు. పలు చోట్ల పోటీ కార్మికులతో పనులు చేయించే ప్రయత్నం చేయగా జీపీ కార్మికులు, సీఐటీయూ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండల కేంద్రంలో పోటీ కార్మికులతో పనులు చేయించేందుకు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తంగా మారింది. నవీపేట్‌ పంచాయతీ స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ్‌లో ఎంపికైంది. దాంతో శనివారం కేంద్ర బృందం తనిఖీలకు రానుండటంతో ప్రత్యేక అధికారి, డీఎల్‌పీఓ నాగరాజు పోటీ కార్మికులతో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను సమ్మె శిబిరం ముందు నుంచి తీసుకెళ్లే యత్నం చేశారు. కార్మికులు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌, జిల్లా ఉపాధ్యక్షులు నాయక్‌వాడి శ్రీనివాస్‌ అడ్డుకున్నారు. దీంతో ఎంపీడీవో సాజిద్‌ అలీ, ఎంపీఓ రామకృష్ణ, ఎస్‌ఐ రాజారెడ్డి పోలీసు బందోబస్తుతో కార్మికులు, నాయకులను అడ్డు తొలగించేందుకు ప్రయత్నించగా.. తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గ్రామాల్లో కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే జీవో 51ను వెంటనే రద్దు చేయాలని నూర్జహాన్‌ డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ సమ్మె విరమించబోమని తేల్చి చెప్పడంతో ఎస్‌ఐ రాజారెడ్డికి సీఐటీయూ నాయకులు, కార్మికుల మధ్య గంటకు పైగా వాగ్వివాదం జరిగింది. చివరకు కార్మికులు పట్టువీడకపోవడంతో పోలీసులు, అధికారులు వెనుదిరిగారు.నల్లగొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండలంలో జీపీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జేఏసీ ప్రతినిధులతో వెంటనే జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి తక్షణమే సమస్యల్ని పరిష్కరించాలన్నారు. డిండిలో జీపీ కార్మికుల సమ్మె శిబిరాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ సందర్శించగా.. వినతి అందజేశారు. నల్లగొండ జిల్లా కనగల్లులో సమ్మెకు తెలంగాణ ఆల్‌ హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) మద్దతు తెలిపింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో వేరే వారితో పనులు చేయిస్తున్నారని గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. గ్రామ కార్యదర్శి ఫాతిమా పోటీ కార్మికులతో పని చేయిస్తుండగా జీపీ కార్మికులంతా గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. ప్రయివేట్‌ కార్మికులకు దండాలు పెడుతూ మా పొట్ట కొట్టొద్దని అభ్యర్థించారు. అనంతరం ఎంపీపీ చింతా కవితరాధారెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో జీపీ కార్మికుల దీక్షలకు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. ఇబ్రాహీంపట్నం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మంకు మురళి కార్మికులకు సంఘీభావం తెలిపారు. షాబాద్‌లో కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.

Spread the love