– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని 158 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)ను కేవలం రూ.7,380 కోట్లకు 30 ఏండ్లపాటు లీజుకిచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ లీజుకివ్వడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణమే ఓఆర్‌ఆర్ లీజు విధివిధానాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు మణిహారంగా, ప్రజలకు సౌకర్యంగా, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న ఓఆర్‌ఆర్‌ను ముంబయికి చెందిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనే ప్రయివేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం లీజుకివ్వాలని నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్‌లో ఆర్నెళ్ల క్రితమే లీజు నిర్ణయం జరిగినా గోప్యంగా ఉంచిందని పేర్కొన్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న ఓఆర్‌ఆర్ ఆదాయం మేరకు లీజు నిర్ణయం జరగలేదని, నిబంధనలేవీ పాటించలేదని, వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆర్థిక నిపుణులు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అదానీ, అంబానీల వంటి ప్రయివేట్, కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుకుంటామని, ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ తదితరాలను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టకుండా చూడాలని డిమాండ్ చేశారు. లీజుకు సంబంధించిన విమర్శలు వస్తున్నందున ఒప్పంద వివరాలను ప్రజలముందుంచాలని డిమాండ్ చేశారు.