సంక్షేమ వసతి గృహాలలో నిరంతర పర్యవేక్షణ చేయాలి..

– విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలి..
– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సంక్షేమ వసతి గృహాల పట్ల నిరంతర పర్యవేక్షణ, విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ఆయన కాన్పరెన్స్ హాలులో వివిధ సంక్షేమ శాఖల అధికారులు, సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశమై వాటి పనితీరును సమీక్షిస్తూ వసతి గృహాలు, విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్ర్రారంభమైనందున, కొత్త విద్యార్ధులు వస్తున్నందున డార్మినేటరీలలో విద్యార్ధుల ట్రంక్ పెట్టెలు అస్తవ్యస్తంగా ఉండనివ్వవద్దని, స్టడీ రూములను శుభ్రం చేయించాలని, వాష్ రూములు, వాష్ చేసే ప్రాంతాలు, టాయ్లెట్స్, స్నానపు ఏరియాలు బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ గా వుండాలని తెలుపుతూ వాటర్ ట్యాంక్లను శుభ్రం చేయించాలని, పరిసరాలు, చెట్లు గడ్డి పెరిగిన చోట శుభ్రం చేయించాలని, డైనింగ్ ఏరియా పరిశుభ్రత చాలా ముఖ్యమని, సరుకులు, స్టోర్ రూమ్ పరిశీలించాలని, పాత స్టాక్ ను పరీక్షగా పరిశీలించి గడువు ముగిసిన సరులు తీసివేయాలని, కిచెన్ స్టాక్ ను పరిశీలించాలని, బియ్యం, పప్పు, వంట నూనె, దినుసులు తదితర పదార్దాల ఫ్రెష్ స్టాక్ ను వంటకు వినియోగించాలని, ఇందుకోసం పుడ్ ఇన్స్పెక్టర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వర్షా కాలం కాబట్టి పొడి వాతావరణంలో వంట సామాగ్రి వుండేలా చూడాలని, వంట మనిషి సామాగ్రిని స్టోర్ చేసే విధానాన్ని పరిశీలించాలని, చిన్న విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, వంట చేసే విధానంపై సరైన ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించారు. వాటర్ వలన వ్యాధులు వచ్చే అవకాశం చాలా వుందని, డయేరియా తదితర వ్యాధులకు అవకాశం ఉన్నందున నీరు స్టోరేజీ చేసే ప్ర్రాంతాలను పరిశీలించాలని, ఫ్రెష్ నీరు వాడాలని,  త్రాగునీరు విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని, లోటుపాట్లు ఉన్నచోట పైఅధికారుల దృష్టికి వెంటనే తేవాలని, ట్యాంకుల క్లీనింగ్, బ్లీచింగ్ నిర్వహాణ పట్ల రిజిష్టర్స్ నిర్వహించాలని, ప్రతి రెండు వారాలకు ఒక సారి ట్యాంకులను కడిగించాలని తెలిపారు.
ప్రతి విద్యార్ధి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఎలాంటి ఉపేక్ష లేకుండా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలని, వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ప్రత్యేకించి సెలవు రోజులలో కొన్ని గంటలైనా గడపి పరిశీలించాలని, వసతి గృహాల విజిటర్ల రిజిష్టర్లను తనిఖీ చేయాలని, సిసి కెమెరాల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్ని వసతి గృహాల పట్ల సరైన షెడ్యూలుతో మెడికల్ క్యాంపులు, వైద్యుల విజిట్ లు నిర్వహించాలని, గురుకులాలలో వున్న ఎ.ఎన్.ఎం. ల పనితీరు, వారి వద్ద మందుల వివరాలు, రిజిష్టర్లు తనిఖీ చేయాలని, ఏ విధమైన జబ్బుకు ఏ మందులు వాడుతున్నారనేది గమనించాలని, ఎక్కువ సార్లు వైద్య సహాయం పొందే విద్యార్ధులను గమనించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. అన్ని సంక్షేమ శాఖలను సమన్వయం చేసుకొని వసతి గృహాల నిర్వహణపై స్పష్టమైన లక్ష్యాలు, సాధించే ప్రగతి పట్ల పీరియాడికల్ నివేదికలు రూపొందించాలని, అలాగే ప్రతి రెండు నెలలకోసారి మోటివేషన్ ప్రేరణ కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి సూచించారు. వసతి గృహాల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్నా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎంఎ కృష్ణన్, జిల్లా వైద్య అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి యాదయ్య, జిల్లా ఎస్.సి అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, ఎస్.సి కార్పోరేషన్ ఇడి శ్యాంసుందర్, వసతి గృహాల ప్రిన్సిపాల్స్   లు పాల్గొన్నారు.
Spread the love