సహజ శక్తిని వనరుగా మార్చి

Convert natural energy into a resource‘మహిళలు లేని రంగమంటూ లేదు. మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే నిరంతరం మనల్ని మనం చెక్కుకుంటూ ఉండాలి… గెలిస్తే అందమైన శిల్పం అవుతాం… ఓడితే శిల్పాలు చెక్కే శిల్పి అవుతాం… ఏమీ ప్రయత్నించక పోతే బండరాయిగా మిగిలి పోతాం… అయితే మనం చేసే పని పర్యావరణహితంగా ఉండాలి. మనకు ఉపాధి కల్పించాలి’ అంటారు రాధిక. సౌర విద్యుత్‌ సంస్థతో దేశవిదేశాల్లో తమ సేవలను అందిస్తున్నారు ఆమె. అమెరికాలో ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒక సాధారణ ఉద్యోగి నుంచి మహిళా పారిశ్రామికవేత్తగా ఉన్నత స్థానానికి చేరిన ఆమె విజయ గాథ నేటి మానవిలో…
చాలామంది మహిళలు పిల్లలు కాస్త పెద్దయ్యాక ఉద్యోగానికి వెళదాం అనుకుంటారు. కాని సాధ్యమైనంత వరకు పిల్లలు చిన్నగా ఉన్నపుడే తిరిగి ఉద్యోగం మొదలు పెట్టాలి అంటారు రాధిక. ఆమె సోలార్‌ సిస్టం ఉత్పత్తులను చేసే ఫ్రెయర్‌ ఎనర్జీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీ సహా వ్యవస్థాపకురాలు. ఇప్పుడిప్పుడే సౌర విద్యుత్‌ వాడకం ఊపందుకుంటుంది. కానీ ఎనిమిదేండ్ల కిందటే ఈ పరిస్థితిని ఊహించిన రాధిక సౌర విద్యుత్‌ సంస్థను ప్రారంభించారు. సంస్థ స్థాపించటం ఓ సవాలయితే, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం మరో సవాలు. ఊహ వేరు వాస్తవికత వేరు. ఈ రెంటిని సుసాధ్యం చేయాలి. పెట్టుబడి, ప్రణాళికలు, లక్ష్యాలు ఇవన్నీ వ్యాపారానికి చాలా అవసరం. అంతే కాదు వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి అంటారు ఆమె.
ఇండియా వచ్చేసి…
హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన రాధికకి చిన్నతనం నుండి సైన్సు అంటే మక్కువ. తల్లి గృహిణి. తండ్రి వ్యాపారవేత్త. రాధిక చదువుతో పాటు ఆటల్లోనూ తన ప్రతిభ కనపరిచారు. బాస్కెట్‌ బాల్‌, టెన్నిస్‌ ఆటల్లో ఆరితేరిన రాధిక నేషనల్‌ స్విమ్మర్‌ కూడా. ‘ఆడపిల్లలకు నాయకత్వ లక్షణాలు అనేవి చిన్నతనం నుంచి అలవాడాలి అవి నాకు నా క్రీడల ద్వారా, నా తల్లి దండ్రుల పెంపకం ద్వారా అలవడ్డాయి. అవే నేను ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణం’ అంటారు ఆమె. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో పర్డ్యూ యూనివర్సిటీలో న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌లో ఎం.ఎస్సీ చేసారు. చదువు పూర్తి కాగానే ప్రతిష్టాత్మకమైన నాసా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం వచ్చింది. తర్వాత మరో సంస్థలో విండ్‌ ఎనర్జి (పవన విద్యుత్‌) విభాగంలో పనిచేసారు. ఆ సమయంలోనే పావన్‌ను పెండ్లి చేసుకున్నారు. మూడేండ్లు ఇద్దరూ అమెరికాలోనే ఉద్యోగం చేశారు. రాధికకు ఇద్దరు పిల్లలు. బాబు ఆయుష్మాన్‌, పాప సహన్యా. భర్తకు హైద్రాబాదులో మంచి ఉద్యోగ అవకాశం రావటంతో ఇండియా వచ్చేసారు. ఇక్కడ రాధిక ల్యాంకో సంస్థల్లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా చేరారు.
ఎన్నో అధ్యయనాల తర్వాత…
2008లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయిలో మహిళలు అరుదు. అలాంటి సమయంలోనే విండ్‌ ప్రాజెక్ట్‌ మరింతగా విస్తరించటంలో రాధిక ముఖ్య పాత్ర పోషించారు. తర్వాత కాలంలో ఎన్నో అధ్యయనాలు చేసిన రాధిక ఫ్రెయర్‌ ఎనర్జి అనే పేరుతో అంకుర పరిశ్రమ స్థాపించారు. అమెరికాలో ఆమె ఉద్యోగానుభవం దీనికి బాగా ఉపయోగపడింది. భవిష్యత్తులో సౌర విద్యుత్‌కి పెరగనున్న ఆదరణను గుర్తించి సహజ శక్తిని వనరుగా మార్చటం సులభం అని గ్రహించారు. అది పర్యావరణహితం కాబట్టి నేనే ఒక సంస్థని ప్రారంభిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని కుటుంబంతో పంచుకున్నారు. స్నేహితులు, సౌరబ్‌ మర్థ భాగస్వామ్యంతో ఈ రోజు ఫ్రెయర్‌ ఎనర్జి అనే సంస్థతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
ప్రజలకు మరింత చేరువై…
ఎన్నో గ్రామాల్లో సౌర విద్యుత్‌తో వెలుగులు నింపుతున్నారు రాధిక. మార్కెటింగ్‌లో తమ సంస్థ ముందు ఉండటం కోసం ఓ యాప్‌ని కూడా ఏర్పాటు చేసారు. దాని పేరు సన్‌ ప్రో ప్లస్‌. ఇది ప్లే స్టోర్‌లో ఎవరైనా డౌన్‌ లోడ్‌ చేసుకుని సోలార్‌ ఉత్పత్తుల గురించి, వాడకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే ప్రేయర్‌ ఎనర్జీ మొదటి ప్రాజెక్ట్‌గా పాడేరులోని 40 గ్రామాలకు వెలుగునిచ్చిన రాధిక తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఛత్తీస్‌ ఘడ్‌, మహా రాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, మణిపూర్‌ ఇలా 26 రాష్ట్రాలతో పాటు ఘానా, నైజిరియా లాంటి దేశాల్లోనూ తన సేవలు అందిస్తున్నారు. మొదట ఇద్దరితో మొదలై నేడు 120 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎందరికో స్ఫూర్తి దాయకంగా మారిన మహిళా పారిశ్రామికవేత్త రాధికా. రాబోయే రోజుల్లో తమ సంస్థ సేవలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరవేయటమే తన లక్ష్యం అని చెప్తున్నారు.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
‘మనకు వస్తున్న అవకాశాలను వినియోగించు కునేందుకు వీలుగా మన ఆలోచనలను మార్చు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టుదల, అంకితభావం, ఎదగాలనే తపన ఇవన్నీ ముఖ్యం. ఒక మహిళగా ఉన్నత స్థానంలో పనిచేసేప్పుడు ఇబ్బందులు ఉంటాయి. 23 ఏండ్ల వయసులో డిప్యూటీ మేనేజర్‌ హోదాలో పనిచేసినప్పుడు నా సబార్డినేటర్స్‌ అంత నాకన్నా పెద్దవాళ్లు. కానీ వారితో నాకెలాంటి సమస్య రాలేదు. ఇతరులతో మనం ఎలా కనెక్ట్‌ అవుతాం? అజమాయిషీ చలాయించకుండా కలిసి పనిచేసే దృక్పథంతో ముందుకు వెళ్తే ఇది సాధ్యమే. పారిశ్రామికవేత్తగా, ఇద్దరు పిల్లల తల్లిగా నా బాధ్యత లను నిర్వహిస్తున్నాను. పని ఒత్తిడిని తట్టుకోవటానికి రోజూ వ్యాయమం చేస్తాను. ఇదే నాకు శక్తినిస్తుంది. మహిళ తనకోసం కూడా రోజులో ఒక 30నిముషాలు కేటాయించుకోవాలి. ప్రతి మహిళా తనలో ఉన్న శక్తి సామర్ధ్యాలను వెలికి తీయాలి. అవకాశాలని అందిపుచ్చుకుని ముందడుగువేయాలి. అది ఉద్యోమైనా, వ్యాపారమైనా నిరంతరం మనల్ని మనం పరిశోదించుకుంటూ ఉండాలి. అప్పుడే మనం చేయాల్సిన పనికి సరైన ఫలితం దక్కుతుంది’ అంటున్నారు రాధిక.
– రేణుక బెజవాడ

Spread the love