కూలర్లు, ఏసీల ధరలకు రెక్కలు

Wings on the prices of coolers and ACs– భానుడి ప్రతాపం.. చల్లదనం కోసం ఆరాటం
– 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
– పమ్మి(ఖమ్మం)లో 46.7 డిగ్రీలు
– 22 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ
– పలు జిల్లాల్లో వడగాల్పులు
– జాగ్రత్తలు సూచించిన వైద్యారోగ్య, పంచాయతీరాజ్‌శాఖలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భానుడు భగభగ మండిపోతున్నాడు. సాధారణంగా మే మాసం చివర్లో, జూన్‌ మొదటి వారంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మే మొదటి వారంలోనే నమోదవుతున్నాయి. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో 24 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. దీనికితోడు వడగాడ్పులు భయపెడుతున్నాయి. దీంతో ప్రజలు ఎండ వేడిమి తట్టుకోలేక చల్లదనం కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వారం రోజుల్లోనే కూలర్లు, ఏసీలకు మార్కెట్‌లో డిమాండ్‌ రెట్టింపు అయ్యింది. వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. మరోవైపు ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు పలు సూచనలు చేశాయి. అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.
భయపెడుతున్న వేడిగాలులు
రాష్ట్రంలో వేడిగాలులు ప్రజల్ని భయపెడుతున్నాయి. పట్టుమని ఐదు నిమిషాలు చెవులకు రుమాలు, ఖర్చిఫ్‌ కట్టుకోకుండా నడవలేని పరిస్థితి నెలకొంది. టీఎస్‌డీపీఎస్‌ నివేదిక ప్రకారం నల్లగొండ, మంచిర్యాల, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, కరీంనగర్‌, జోగులాంబ గద్వాల, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, నిర్మల్‌ జిల్లాల్లో శుక్రవారం వేడిగాలులు వీచాయి. శని, ఆదివారాల్లోనూ రోజులో అత్యధిక సమయం వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్‌, జగిత్యాల, కొమ్రంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో ఆరు, ఏడు తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని సూచించింది.
15 రోజుల్లో అమాంతం పెరిగిన ధరలు
ఏప్రిల్‌ 28 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి 47 డిగ్రీల వరకు పెరిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు వేడిగాడ్పులు వీస్తుండటంతో ఫ్యాన్లు బరబర తిరుగుతున్నా వశం కాని పరిస్థితి. మొన్నటిదాకా నెలన్నర ఉండే ఎండలకు కూలర్లు ఎందుకు? అనుకునే పేద, మధ్యతరగతి ప్రజలు భానుడి ప్రతాపానికి తాళలేక, ఇంట్లో చిన్నపిల్లల ఇబ్బందులు తట్టుకోలేక కూలర్ల కోసం క్యూ కడుతున్నారు. దీంతో షాపుల వద్ద వాటికి డిమాండ్‌ పెరిగింది. మరోవైపు కూలర్ల విడి భాగాలు, తయారు చేసిన కూలర్లకు కొరత ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌ పోస్టాఫీసు పక్క గల్లీలో ఏ కూలర్‌ షాపు వద్ద చూసినా పదులసంఖ్యలో జనాలు బేరమాడుతూ కనిపించారు. అక్కడ కూలర్లు తక్కువ, కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. చాలా షాపుల్లో కూలర్ల కొరత కనిపించింది. ఏప్రిల్‌ 15న రూ.3,300 ఉన్న కూలర్‌ ధర.. మే రెండో తేదీ వచ్చేసరికి రూ.4,800కి పెరిగింది. ‘ఇదేంటి 15 రోజుల కింద ఇక్కడే రూ.3,300కి కొన్నాం కదా? ఇక్కడ ఉన్నాయని వస్తే మీరేంటి ఇంత రేటు చెబుతున్నారు?’ అని కొనుగోలుదారుడు అడిగితే..’సార్‌ మా దగ్గర ఈ మూడు పీసులే ఉన్నారు. ఒక్కోదాని రేటు రూ.5,600. ఫైనల్‌గా రూ.5,000కి తక్కువరాదు’ అని మొహంమీదనే చెప్పటం కనిపించింది. బ్రాండెడ్‌ కూలర్లు అయితే రూ.6 వేల కంటే తక్కువకు దొరకట్లేదు. దీంతో కొందరు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతివారు ఇంత ధరపెట్టి కూలర్‌ కొనే బదులు ఉన్నంతలో తక్కువ ధర ఉండే ఏసీలు తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో వాటికీ డిమాండ్‌ పెరిగింది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
1. ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు.
2. వెళ్లడం తప్పనిసరైతే తలపై గొడుగు, కండువాలు, టోపీ, రుమాలు వాడాలి.
3. తమ వెంట నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లాలి. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి.
4. ఉపశమనం కోసం నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లను సేవించాలి.
5. చిన్నపిల్లలు అడగకపోయినా తరుచూ నీళ్లు తాపించాలి.
6. వడదెబ్బకు గురైతే వెంటనే ప్రథమ చికిత్స తీసుకోవాలి.
7. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.
పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలివే..
1. ప్రతి గ్రామంలోనూ బస్టాండు, ముఖ్యమైన కూడళ్లల్లో చలివేంద్రాలను పంచాయతీరాజ్‌ అధికారులు ఏర్పాటు చేయాలి.
2. వడదెబ్బ, జ్వరపీడితులను గుర్తించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అందజేయాలి. వారికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందజేయాలి.
3. పనిప్రదేశాల్లో ఉపాధి హామీ కూలీలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. ఆశావర్కర్లు, పీహెచ్‌సీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.
4. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లలో తాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.
5. వడదెబ్బకు గురైన వారికి ప్రాథమిక చికిత్స అందేలా పర్యవేక్షించాలి.
5. పశువులు, జంతువులకు తాగునీటి సౌకర్యం కల్పించాలి.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే
పమ్మి(ఖమ్మం) 46.7 డిగ్రీలు
మునగాల(సూర్యాపేట) 46.7 డిగ్రీలు
నేరెళ్ల(జగిత్యాల) 46.7 డిగ్రీలు
మంథని(పెద్దపల్లి) 46.7 డిగ్రీలు
కామారెడ్డిగూడెం(నల్లగొండ) 46.6 డిగ్రీలు
హాజీపూర్‌(మంచిర్యాల) 46.6 డిగ్రీలు
ముత్తారం (పెద్దపల్లి) 46.5 డిగ్రీలు
మామిళ్లగూడెం(సూర్యాపేట) 46.5 డిగ్రీలు
మఠంపల్లి(సూర్యాపేట) 46.5 డిగ్రీలు
ఇబ్రహీంపేట(నల్లగొండ) 46.5 డిగ్రీలు

Spread the love