రాజకీయ క్షేత్రంలో రాముడు

Rama in the political arena– అయోధ్య పై ఉన్న భక్తి.. భద్రాద్రిపై లేదెందుకు?
– భద్రాచలం వైపు కన్నెత్తయినా చూడని మోడీ, షా
– అయోధ్య మందిర నిర్మాణానికి వేల కోట్లు
– రూ.100 కోట్లు వెచ్చిస్తే భద్రాచలంలో ఎంతో పురోగతి
– హెరిటేజ్‌ సిటీ కాదూ.. రైలుమార్గమూ రాదు..
– నేడు శ్రీ సీతారాముల కళ్యాణ మహౌత్సవం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అయోధ్య రామునిపై ఉన్న భక్తి ప్రవత్తులు.. భద్రాద్రి రామునిపై ప్రధాని మోడీకి ఎందుకు లేవని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి రాముడిని ఎందుకింత నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. రాముని పేరుతో రాజకీయం చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శకుల మాట. ప్రతి ఎన్నికలకు ముందు రాముని పేరుతో రాజకీయం చేయడం.. తద్వారా ఓట్లు రాల్చుకోవడం బీజేపీకి ఆనవాయితీగా మారింది. నిజంగా రామునిపై భక్తి ఉంటే భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై లేదా? అనే సందేహాలను రామ భక్తులు వెలిబుచ్చుతు న్నారు. రామాయణ ఇతివృత్తంలోని అనేకం దక్షిణ అయోధ్య భద్రాచలంతో ముడిపడివున్నా ఇక్కడి రాముడు నిర్లక్ష్యానికి గురవడం వెనుక రాజకీయం తప్ప మరో కారణం లేదనే అభిప్రాయం పలువురిలో ఉంది. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండటంతోనే అయోధ్య రాముని విూద భక్తి ప్రదర్శిస్తున్నారనే విమర్శ బీజేపీపై ఉంది.
హెరిటేజ్‌ హౌదా లేదు.. రైలూ రాదు..
భద్రాద్రికి కూడా పౌరాణిక ప్రాధాన్యత చాలానే ఉందని భక్తులు నమ్ముతున్నారు. అయినా భద్రాద్రి విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు హయాంలో ప్రాశస్త్యం కలిగిన స్థలాలకు హెరిటేజ్‌ సిటీ హౌదా ఇచ్చారు. కానీ ఎంతో విశిష్టత కలిగిన వారసత్వ ప్రాంతాల జాబితాలో భద్రాచలానికి చోటు దక్కలేదు. రూ.లక్ష కోట్లతో బుల్లెట్‌ రైళ్లు, వందే భారత్‌ రైళ్లు, దేశంలోని పలు నగరాల నుంచి అయోధ్యకు రైళ్లు ఏర్పాటు చేసిన సర్కారు నిజంగా రామునిపై భక్తి ఉంటే ఇంతకాలంగా భద్రాచాలనికి రైలుమార్గం ఎందుకు ఏర్పాటు చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భద్రాచలానికి కేవలం 5 కి.మీ దూరంలోని పాండురంగాపురం వరకు రైల్వే లైన్‌ ఉన్నా కనీసం రూ.50 కోట్లు ఖర్చు పెట్టి రైల్వేలైన్‌ నిర్మించడంలో కేంద్రం నిర్లక్ష్యం ఉందనే విమర్శలున్నాయి.
భద్రాద్రి పరిరక్షణ మరిచి నిర్వీర్యం..!
భద్రాచలం పరిరక్షణ మరిచిన కేంద్ర ప్రభుత్వం చివరకు దాని నిర్వీర్యంలో భాగస్వామవుతోంది. రామాలయం తెలంగాణలో ఉండగా సుమారు వెయ్యి ఎకరాల రామాలయ భూములను, పోలవరం ముంపులో లేనప్పటికీ ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారు. గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక పంచాయతీలను ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో కలిపారు. రాముడు తెలంగాణలో.. రామాలయ భూములు ఆంధ్రాలో ఉండటం వల్ల కనీసం చెత్త డంపింగ్‌కు కూడా స్థలం లేని దుస్థితి. అర్థచంద్రాకృతిలో రెండుగా ఉన్న భద్రాచలంలో ఓవైపు గోదావరి, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ భూములున్నాయి. ఫలితంగా భద్రాచలంలో డంపింగ్‌యార్డు సైతం ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేదు. దీనివల్ల భద్రాచలం పట్టాణాభివృద్ధి శాశ్వతంగా భూస్థాపితం అయింది. ఈ నేపథ్యంలో రామభక్తులకు నిలువ నీడలేకుండా చేసింది మోడీ ప్రభుత్వం కాదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థలం లేని కారణంగా కొత్తగూడెం జిల్లా కేంద్రాన్ని భద్రాచలంలో కాకుండా పాల్వంచలో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాటి బీఆర్‌ఎస్‌ పాలకులది సైతం అదే తీరు..
గత బీఆర్‌ఎస్‌ పాలకులు సైతం భద్రాచలం విషయంలో నిర్లక్ష్యాన్నే సాగించారు. హైదరాబాద్‌ సమీపంలో ఉన్న యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రాముడు కొలువుదీరిన భద్రాచలంపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. తానీషా ప్రభువు కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాల సమర్పణ విషయంలోనూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిన్నచూపే చూశారు. కేవలం ఒక్కసారి మాత్రమే పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కేసీఆర్‌ సమర్పించడం గమనార్హం. రూ.వంద కోట్లు అని ఒకసారి, రూ.వెయ్యి కోట్లు అని మరోసారి హామీ ఇచ్చిన కేసీఆర్‌ భద్రాచలం అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించిన దాఖలాలు లేవు. అమిత్‌షా, మోడీ ఎన్నో సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఒక్కసారైనా భద్రాచలం వచ్చారా? అనే ప్రశ్నలు స్థానిక రామభక్తులు లేవనెత్తుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో బుధవారం నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు ఇప్పటికే విచ్చేశారు.
భద్రాచలం రాజకీయంగా ఉపయోగపడదనే..
– మిడియం బాబూరావు, మాజీ ఎంపీ, ఆదివాసీ నాయకులు
భద్రాచలం రాజకీయంగా ఉపయోగపడదనే బీజేపీ నిర్లక్ష్యం చేస్తోంది. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రం భద్రాచలానికి పర్యాటక క్షేత్రంగా లేదా హెరిటేజ్‌ పట్టణంగా నిధులు ఇవ్వవచ్చు. రావణుడు ఏలిన శ్రీలంకలో రామాయణ సర్క్యూట్‌ పెట్టి పర్యాటకులను ఆకర్షిస్తుంటే భద్రాచలాన్ని ఎందుకు టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయకూడదో ఆలోచించాలి. కేంద్రానికి ఆదివాసీలు, ఆదివాసీ సంస్కృతులు అక్కర్లేదు. వాళ్లు నిజంగా రామభక్తులు కాదు.. రాజకీయం కోసమే రామున్ని వాడుకుంటున్నారు. వేల కోట్లు వెచ్చించి అయోధ్య రామాలయాన్ని నిర్మించిన కేంద్రం రూ.వంద కోట్లు పెట్టి భద్రాచలాన్ని అభివృద్ధి చేయలేదా..?

Spread the love