విజృంభిస్తున్న కరోనా…

The booming corona...– 594 కేసులు..ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : భారత్‌లో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జెఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్నది. గురువారం 594 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారంతో పోలిస్తే యాక్టివ్‌ కేసులు 2,311 నుంచి 2,669కి పెరిగాయి. ఒక్క కేరళలోనే 265 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళలో ముగ్గురు, కర్నాటకలో ఇద్దరు, పంజాబ్‌లో ఒకరు సహా మొత్తం ఆరుగురు మరణించగా.. మతుల సంఖ్య 5,33,327కు చేరింది. ఈ వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని నిటి అయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రాల్లో పరీక్షలను వేగవంతం చేశామని అన్నారు. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్యలో పెరుగుదల లేదని చెప్పారు. కర్ణాటకలో మాస్క్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. కేరళ, మహారాష్ట్రల్లోనూ రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌ను వినియోగించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. జెఎన్‌.1 అనేది ”పిరోలా” వేరియంట్‌ బీఏ 2.86 వర్గానికి చెందినదని, ఇది ఓమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ అని ఐఎంఎ కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ డాక్టర్‌ రాజీవ్‌ జయదేవన్‌ పేర్కొన్నారు. జెఎన్‌.1 వద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుందని అన్నారు.
ఎంజీఎం, నీలోఫర్‌లో ముగ్గురికి కరోనా
– వారిలో 15 నెలల చిన్నారి..
నవతెలంగాణ-మెహిదీపట్నం/ మట్టెవాడ
హైదరాబాద్‌ నాంపల్లిలోని నీలోఫర్‌ ఒకరు, వరంగల్‌ ఎంజీఎంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. నీలోఫర్‌ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కరోనా ప్రబలింది. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి వివరాలు వెల్లడించారు. నాంపల్లికి చెందిన ఓ బాబుకు దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్య ఉండటంతో 18వ తేదీన నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. లక్షణాలను బట్టి డాక్టర్లు కరోనా పరీక్ష చేయించారన్నారు. అందులో గురువారం పాజిటీవ్‌గా రిపోర్టు వచ్చిందని తెలిపారు. చిన్నారికి ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులకు ఎలాంటి కోవిడ్‌ లక్షణాలూ లేవని చెప్పారు. ఆస్పత్రిలో కోవిడ్‌ కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇదిలా ఉండగా, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ త్రివేణి నీలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో సమావేశం నిర్వహించి కోవిడ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చర్చించారు.
ఎంజీఎంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఔట్‌ పేషెంట్లుగా వచ్చిన వారి నుంచి గురువారం రక్త నమూనాలు సేకరించి కాకతీయ మెడికల్‌ కళాశాలలోని వైరాలజీ విభాగానికి పంపించారు. శుక్రవారం ఫలితాలు వచ్చాయి. భూపాలపల్లి జిల్లాకు చెందిన యాదమ్మ, రాజేందర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. యాదమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఎంజీఎం సూపరింటెండెంట్‌ వి.చంద్రశేఖర్‌ వెల్లడించారు. కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love