బర్రెలక్క తమ్ముడిపై దాడికి సీపీఐ(ఎం) ఖండన

బర్రెలక్క తమ్ముడిపై దాడికి
సీపీఐ(ఎం) ఖండన– ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి: తమ్మినేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొల్లాపూర్‌ శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన బర్రెలక్క (అలియాస్‌ శిరీష) ప్రచారం ముగించుకుని వెళ్తున్న సమయంలో ఆమె తమ్ముడిపై గుర్తు తెలియని వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడటాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఖండించింది.
ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులను ప్రలోభాలకు, వేధింపులకు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఒకవైపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అంటూనే, నిరుపేద దళిత అమ్మాయి రాజకీయంగా ముందుకొస్తే ఇలాంటి ఘటనలకు పాల్పడడం దారుణమని విమర్శించారు.
గతంలో నిరుద్యోగ అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినందుకు శిరీషపై కేసు పెట్టి కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిప్పుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీచేసే హక్కును కాలరాయడం సరైంది కాదని తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలనీ, శిరీష కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love