అన్ని సంక్షోభాలకూ ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యుడు
న్యాయబద్ధమైన డిమాండ్లతో పోరాటం
సోనమ్ వాంగ్ చుక్ దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎంఎ బేబీ, బృందా కరత్
పదో రోజుకు ‘కాక్రోచ్’ ఆందోళనలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో న్యాయం కోసం విద్యార్థులు, యువతతో జరిగే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్‌కు జవాబుదారీతనం వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థి-యువజన ఉద్య మానికి, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సీపీఐ(ఎం) సంఘీభావం తెలిపింది. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా విఫల మవ్వడానికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని సోమవారం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు బృందా కరత్ సందర్శించారు. ఈ సంద ర్భంగా వాంగ్‌చుక్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్యం తదితర విషయాలు అడిగి తెలుసు కున్నారు. అలాగే సీజేపీ వ్యవస్థా పకుడు అభిజీత్ దీప్కేతో కూడా మాట్లాడిన సీపీఐ(ఎం) నేతలు ఉద్యమ విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఈ ఉద్య మానికి తమ సంపూర్ణ మద్దతును తెలియ జేస్తూ… న్యాయం కోసం విద్యార్థులు, యువత చేస్తున్న ఈ పోరాటంలో సీపీఐ(ఎం) వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) నేతలతో ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ మాట్లాడుతూ… సీజేపీ ఆందోళనను స్వాగతిస్తున్నామనీ, అలాగే ఆందోళన కొనసాగినంత వరకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. పరీక్షలకు సంబంధించిన అన్ని -సంక్షోభాలకూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యుడనీ, ఆయన ధర్మ మార్గంలో నడవడం లేదని తెలిపారు. ప్రజలు, సామాన్యుల మద్దతుతో ఈ ఆందోళన విజయవంతమవుతుందని చెప్పారు. ఆందోళనకారులకు స్వాగతం పలుకుతూ ‘ఇక్కడ సమావేశమైన మనందరి భాష ఒక్కటే.. అదే ఆందోళన భాష’ అని ఎంఏ బేబీ అన్నారున్యా
న్యాయబద్ధమైన డిమాండ్లతో ఆందోళన : బృందా కరత్
ఇది ఓట్లు, సీట్లు లేదా అధికారం కోసం చేస్తున్న ఆందోళన కాదని సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కరత్ అన్నారు. న్యాయబద్ధమైన డిమాండ్లతో ఈ ఆందోళన జరుగుతోందని ఆమె తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ తర్వాత 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనీ, అయినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి అదే పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఐ(ఎం) నేతలకు సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ధన్యవాదాలు తెలిపారు. వాంగ్‌చుక్‌కు మద్దతుగా యువత, విద్యార్థులతో సహా వందలాది మంది దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ప్రముఖ రైతు నాయకులు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐతో సహా వామపక్ష విద్యార్థి సంఘాల సహకారంతో సీజేపీ జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళనను నిర్వహిస్తోంది.
విద్యార్థుల మరణాలపై స్పందించడంతో కేంద్రం విఫలం : అభిజీత్ దీప్కే
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ఇటీవల జరిగిన విద్యార్థుల మరణాలను ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రదీప్ మేఘ్వాల్, ఆకాంక్ష చతుర్వేది, అమైరా కుమార్, కహాన్ పటేల్ అనే విద్యార్థుల కుటుంబాలు ‘న్యాయం కోసం వేడుకునేలా’ చేస్తున్నారని విమర్శించారు. ఆ పిల్లల మరణాల పట్ల విచారం వ్యక్తం చేయడానికి ఏ ప్రభుత్వ ప్రతినిధి కూడా వారిని సంప్రదించలేదని ఆయన ఆరోపించారు. ‘‘అధికారంలో ఉన్నవారు ఇంత ఉదాసీనంగా ఉండటమే కాకుండా, తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించాలనే అవసరాన్ని కూడా భావించనంత అహంకారంగా ఎలా ఉండగలరో నాకు నిజంగా అర్థం కావడం లేదు’’ అని అన్నారు. ‘‘మీరు వారి పిల్లలను తిరిగి తీసుకురాలేరు. కానీ కనీసం మీరు విచారం వ్యక్తం చేసి వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పవచ్చు. అది అడగడానికి మరీ ఎక్కువ అవుతుందా?’’ అని ఆయన ప్రశ్నించారు. జూన్ 18న ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థి కహాన్ పటేల్ తండ్రి తన ఆందోళనలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తెలియజేయడానికి గుజరాత్ నుంచి జంతర్ మంతర్‌కు వచ్చారు. పటేల్ తండ్రి తన కుమారుడిని చిత్రీకరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ, ఆయన ఎలాంటివాడో ప్రజలు నిజంగా అర్థం చేసుకోవాలని తమ కుటుంబం కోరుకుంటోందని అన్నారు.
రెండో రోజుకు వాంగ్‌చుక్ దీక్ష
సీజేపీ ఆందోళన పదో రోజూ కొనసాగగా, వాంగ్‌చుక్ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. లడఖ్‌లోని తీవ్రమైన సమస్యలకు మద్దతుగా ఈ దీక్షలో చేరాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘సీజేపీకి, లడఖ్‌కు మద్దతుగా నేను చేస్తున్న నిరాహార దీక్షకు ఇది రెండో రోజు. మీరు కూడా మాతో చేరవచ్చు. రోజంతా నిరాహార దీక్ష కోసం ఇక్కడికి రండి. ఒకవేళ రాలేకపోతే, విద్య, జవాబుదారీతనం, పర్యావరణ రంగాలలో సంస్కరణల డిమాండ్లకు మద్దతుగా రోజంతా నిరాహార దీక్ష చేపట్టి, మీ సంఘీభావాన్ని తెలియజేయండి. దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు యావత్ భారతదేశం ఏకం కావాలి’’ అని ఆయన అన్నారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా ఆరుగురు విద్యార్థి నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. జంతర్ మంతర్ ఆవరణలో చేపట్టిన ఈ దీక్షలో నేహా, డానిస్, మనీష్, దీపక్, హృషికేష్, ఆమీన్‌లు భాగమయ్యారు.
సీజేపీ ఉద్యమానికి సీపీఐ(ఎం) సంఘీభావం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



