చేనేతకారుల బతుకుపాట

చేనేత కార్మికుల జీవితమంటేనే ఎన్నెన్నో సమస్యల వలయం. రాత్రి పగలూ తేడా లేకుండా నిరంతరం పాటుపడే శ్రామికులు వాళ్లు. రోజంతా యంత్రాల్లా తిరుగుతూ, పనిచేస్తూ ఉండే బతుకులు వాళ్లవి. ఒక్కోసారి వారి శ్రమకి ఫలితం అందకపోయినా బాధపడరు. నిరాశతో కుంగిపోరు. ఎక్కువ కష్టపడినప్పటికీ కొంచెమే ఫలితం అందినా సంతృప్తే సంపద అనుకుని జీవితమనే బండిని లాగుతారు. అలాంటి చేనేతవృత్తి కళాకారుల బతుకుచిత్రాన్ని ప్రతిఫలింపజేసే పాటను సుద్దాల అశోక్‌ తేజ రాశాడు. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
సుద్దాల అశోక్‌ తేజ అసలు సిసలైన ప్రజాకవి. శ్రామికుల జీవితాల్ని అతి దగ్గరగా చూస్తూ, వారితో ప్రయాణం చేస్తూ, వారి జీవితగాథల్నే పాటలుగా అల్లిన అచ్చమైన కవి. తెలంగాణ మట్టి పరిమళాన్ని, పలుకుబళ్లని కలంలో నింపుకున్న గీతరచయిత. శ్రమ విలువను చాటి చెప్పిన ఆయన ‘శ్రమకావ్యం’ అందుకు సాక్ష్యం. 2023లో అనుప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జోరుగా హుషారుగా’ సినిమాలో చేనేత కార్మికుల జీవితాలకు అద్దం పట్టే పాటను ఎంతో అద్భుతంగా రాశాడు. ఇందులో చేనేత కళాకారుల పనివిధానం, జీవితం కనిపిస్తాయి.
పత్తి నుండి దారం తీయడం, రాట్నాన్ని వడకడం, రంగులద్దడం, నగిషీలు దిద్దడం, చీరెలు నేయడం, వాటిని అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దడం.. ఇవి చేనేతకారులు చేసే పని. చీరెలు నేయడానికి వారు పడే కష్టం ఒక ఎత్తైతే వాటిని షావుకారు దగ్గరికి తీసుకెళ్లి అతన్ని మెప్పించి అమ్ముకోవడం ఇంకో ఎత్తు. వస్త్రం తయారు చేయడం దగ్గర నుంచి అమ్ముడుపోయే దాకా వారికి క్షణక్షణం గండంలాగా గడుస్తుంది. వారు అపురూపంగా తీర్చిన ఆ వస్త్రం వెనుక వారి నిరంతర తపన, శ్రమ, కళాసౌందర్యం దాగి ఉన్నాయి. మనల్ని అలరించే, మురిపించే వస్త్రాల్ని నేసిన ఆ శ్రామికులకు తగిన ప్రతిఫలం ఇవ్వడం మన బాధ్యత. అది వారి శ్రమకు దక్కాల్సిన గౌరవం. కాని వారి శ్రమకు తగినంత ఫలితం మాత్రం లేదు. వారి జీవితాలు ఎన్నో సమస్యల్లో చిక్కుకుని అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇది బాధాకరమైన విషయం. ఇలా.. వారి శ్రమబలాన్ని, ఔన్నత్యాన్ని అశోక్‌ తేజ ఇందులో వివరించాడు.
అప్పులు చేస్తారు. ఎవరికి ఎన్ని చీరెలు నేసివ్వాలో లెక్క రాసుకుంటారు. ఆ చీరెలు నేసి వాళ్ళకు అప్పజెప్పే దాకా సరిగ్గా తిండి, నిద్ర కూడా ఉండవు. ఇంటిలోని కుటుంబసభ్యులంతా చేనేత వృత్తినే నమ్ముకుని జీవితాన్ని సాగిస్తున్న వారూ ఉన్నారు. భార్యాభర్తలు రాత్రి, పగలూ తేడా లేకుండా నేత నేస్తూ, చెప్పిన తేదీకల్లా పనిపూర్తయిపోవాలన్న తపనతో కృషి చేస్తూనే ఉంటారు. ఆరోగ్యం సహకరించకపోయినా, చేతులు, కాళ్ళు నొప్పి పుట్టినా లెక్కచేయరు.
అనుకున్నంత ధర రాకపోయినా సరిపెట్టుకుంటారు. వచ్చిందే చాలు అన్న నిండైన సంతృప్తి వాళ్ళ మనసుల్లో మెండుగా ఉంటుంది. వారు నేసిన చీరెలు ప్రపంచమంతటా విస్తరిస్తాయి. దేశవిదేశాలకు వెళ్ళిపోతాయి. వారి కళాప్రతిభ దశదిశలా వ్యాపిస్తుంది. ఎక్కడ పెళ్ళి పేరంటాలు జరిగినా వారు నేసిన వస్త్రాలే కళకళలాడుతూ కనిపిస్తాయి. పండుగలకు, వేడుకలకు మరింత శోభనిస్తాయి. మన ఆనందాలకు ప్రతీకలవుతాయి. పట్టుచీర కట్టుకున్న ప్రతి ఆడపడుచును తోబుట్టువుగా భావించి వస్త్రాలు నేస్తారు వాళ్లు. డబ్బున్నా, లేకున్నా, తిన్నా, తినకున్నా పట్టుదల వదలరు. మగ్గమూ వదలరు. మగ్గాన్ని ఆయుధంగా చేసుకుని జీవితంలో నెగ్గడమే వారికి తెలిసిన విద్య. జీవితమంటే వారికి మగ్గంతో పెట్టిన విద్య. మార్కండేయుడు ఎలాగైతే మృత్యువుతో పోరాడి మృత్యుంజయుడయ్యాడో, చేనేతకారుడు కూడా కష్టాలతో పోరాడి జీవితాన్ని గెలుస్తున్నాడు. అంతే కాదు చేనేతకారులది మార్కండేయ వంశమే.
చేనేతకారుడు ఎవ్వరికీ చేయిచాపని వాడు. అతనికి అతనే చేయూత. అతనికి అతనే సాటి. పోటి. పద్మశాలి వంశం అయినా లోకం చేసే మాయ అనే అంగడిలో నిత్యం కష్టాలకు బలవుతూ ఉంటాడు. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మిగిలిపోతుంటాడు. అయినా అతడు చేసిన మేలు చరిత్రనే సృష్టించింది. బతుకులో వెలుగునీడలు రెండూ ఉంటాయి. రెండింటిని ఒకటిగా భావిస్తూ ముందుకు సాగేవాడతడు. వీరుడతడు. కృష్ణుడు గీతాకారుడు. భగవద్గీతను బోధించాడు. ఇతడు నేతకారుడు. వస్త్రాలు నేస్తాడు. మన శరీరాలకు రక్షణనిస్తాడు. కృష్ణుడు వనమాలి. వనంలో విహరిస్తాడు. ఇతడు వస్త్రమాలి. నిరంతరం వస్త్రాలు నేస్తూ, వస్త్రాల మధ్యనే అతని జీవితం విహరిస్తూ ఉంటుందని అంటున్నాడు అశోక్‌ తేజ.
చేనేతవృత్తి కళాకారుల జీవితాలను అద్భుతంగా వ్యాఖ్యానించిన పాట ఇది. వారి బతుకుకథను అందరికీ వినిపించే గొప్ప పాట ఇది.

పాట:
పత్తీనుండి దారం తీసి రాట్నం వడికి రంగులద్ది/
నగిషిలు దిద్ది దిద్ది దిద్ది చీరెలు నేసి నేసి నేసి/
అంగడికెళ్ళి షావుకారుల ముంగిట పెట్టి మెప్పులు పొంది/
అప్పులు చేసి ఎన్ని చీరెలు నేసివ్వాలో లెక్కరాసుకొని/
ఆలుమగలు రేయిపగలు రెక్కలార్చుకుని నేతనేసుకుని/
మాట ఇచ్చిన డేటుకు ఇచ్చి గిట్టీ గిట్టని రేటును పొంది/
లోకం నిండా పెళ్లిళ్లలో పేరంటాల్లో నేసే నేత/
పట్టుచీర కట్టుకున్న ఆడపడుచు తోబుట్టువై/
ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా మగ్గం విడువని
మార్కండేయుడి అంశం నీదయ్యా/
వారెవ్వా వవ్వారేవా వవ్వారేవా చేనేత/
ఎవ్వరికీ చేయి చాపని నీకూ నువ్వే చేయూత/
పద్మశాలి వంశం అయినా లోకం చేసే మాయా అంగడి/
పద్మవ్యూహంలోన చిక్కిన అభిమన్యుడిలా మిగిలావయ్యా/
అయినా నీవు చేసిన మేలు చరిత్రనే సృష్టించేనయ్యా/
వెలుగు నీడలు బతుకుల్లోన నిలిచే వీరుడు నీవేనయ్యా/
కృష్ణుడేమో గీతాకారుడు నువ్వేమో నేతకారుడివి/
కృష్ణుడేమో వనమాలి నువ్వేమో వస్త్రమాలి/
వారెవ్వా వవ్వారేవా వవ్వారేవా చేనేత/
ఎవ్వరికి చేయి చాపని నీకూ నువ్వే చేయూత..

– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]

Spread the love