ప్ర‌జాపాట‌కు నృత్య నీరాజ‌నం

praja pataకళలు కదిలిస్తాయి. నిజమంటూ మనల్ని నిద్దుర లేపుతాయి. నీ జీవితంలోకి ప్రసరిస్తాయి. నీలోని కల్మషాన్ని కడిగి వేస్తాయి. కడిగిన ముత్యంలా ‘మార్పు’ వైపు నడిపిస్తాయి. సకల కళలు కూడా శక్తివంతమైన ప్రక్రియలు. వీటిని మించి ప్రపంచంలో మరేది పుట్టనే లేదు. సరిగమపదనిసలు పాటల వైవిధ్యాన్ని పెంచాయి. పని నుండి పాట పరిణామం చెందింది. ఇది ఎన్నో వసంతాల గతానుభవం. కాలచక్రంలో శతాబ్దాల ప్రయాణం. ప్రతి కాలంలో ఎంతో మార్పు. మనిషి తన జీవితానుభవాలను నగిషీలు చెక్కిన కళలు, బహుళ మతాలు, భిన్న సంస్కృతుల, శ్రమైక జీవన సౌందర్యం, సమిష్టి జీవన చరిత్ర, ఈ ధరిత్రి కి సకల కళల హారతి.

రాజుల నివాసంలో జమీందారుల పోషణలోనే.. ఆది నుండి కళలన్నీ పోషించబడ్డాయి. భారతీయుని దృక్పథం అలౌకికం, ఆధ్యాత్మికం మొదట వేదాంతి, ఆ తర్వాత కళాకారుడుగా కళలకు నిలయాలు దేవాలయాలు రాజస్థానాలు ఇవన్నీ సాంప్రదాయాన్ని జీర్ణించుకున్న లలిత కళల ప్రస్తానం.
”దుఃఖానార్తానాం, శ్రమార్ధానాం శోకార్ధానాం, తపస్వీనాం విశ్రాంతి జననే కాలే నాట్యం తద్భవిష్యతి” అంటాడు కాళిదాసు. అలసి సొలసిన వారికి కొంత విశ్రాంతిని కలిగించి, వేదనకు ఊరట కలిగిస్తూ.. కొంత జ్ఞానబోధ చేస్తున్న ఈ నాట్యరీతులు శ్రమ నుండి పుట్టిన కళలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం విచారకరం. కేవలం ఆనందించడానికి మాత్రమే కాదు, సామాజికంగా పెను మార్పులకు బలీయమైన సాధనం కూడా ఈ కళలే.. వీటిలో రౌద్ర, వీర, భయానక, బీభత్స నవరసముల హవభావాల అభినయం ఉంటుంది. మనిషి పుట్టాకనే శాస్త్రాలు పుట్టాయి. శాస్త్రాన్ని అనుసరించి చేసే.. నృత్యమే.. శాస్త్రీయ నృత్యం.
భారతీయ నాట్యాలలో తొమ్మిది రకాల నాట్యరీతులున్నాయి. ఆయా ప్రాంతాలలో ఆయా నాట్యలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఈ నాట్య రీతులకు నియమాలు నిబద్దత నేర్పిన ఆది గురువు ఆచార్యులు భరతముని నాట్య శాస్త్రము రచించినదే ఈ నత్య విధానం.
భావం రాగం తాళంతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు చెప్పారు. భరతనాట్య శాస్త్రాన్ని ఒక తాటిపైకి తెచ్చి అమలుపరిచినారు. తంజావూరుకు చెందిన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలు అనబడే నలుగురు అన్నదమ్ములు ఈ కళలను దేవాలయము నుండి బయటకు తెచ్చి ఒక వినోదంగా కాకుండా శాస్త్రంగా గౌరవంగా సామాన్యులందరికీ కుడా అందుబాటులోకి తెచ్చారు.
కూచిపూడి నృత్య ప్రపంచంలో నేటి తరం మహారాణి, సృజనాత్మక ప్రక్రియ లో అరి తేరిన కళాకారిణి, నృత్య రీతుల్లో సరికొత్త ప్రయోగాలు చేసిన రుక్మిణీదేవి అరుండేల్‌ లాంటివారు ఆచార్యులు వెంపటి చినసత్యం, శోభానాయుడు, డాక్టర్‌ ఉమారామరావు, డా.అలేఖ్య పుంజల, మంజు బార్గవి, వేదాంతం సత్యనారాయణశర్మ, రాధేశ్యాం తదితరులంతా నృత్యరీతుల్లో ఎప్పటికప్పుడు ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల కనుగుణంగా మార్పులు నృత్యభంగీమలకు సరికొత్త నగీషీలు చెక్కారు.
శాస్త్రీయ నాట్యానికి ఆచార్యులైన భరతముని లాంటివారు చివరలో ఓ మాట చెప్పారు… ”ఏదో నాకు తెలిసినంతవరకు చెప్పాను ఏవైనా ఉంటే.. ఈ లోకం నుంచి చూసి నేర్చుకోవడమే”.
అందుకే ప్రపంచంలో ఏ గొప్ప కళనైనా తిలకించండి… అది ఒక వ్యక్తి నిర్మాణం చేస్తాడు. కావ్యమైనా, చిత్రమైనా కళలనైనా నృత్య భంగీమలయినా… ఏదైనా ఒక యంత్రం నుండి తయారుచేసిన నాణెముల వలె యధాతధంగా వుండడం అసంభవం. నాణెములలో కూడా నిరంతరం మార్పులు జరుగుతుంటాయి. అందుకే నిన్నటి పాటకు రేపటి పాటను సృష్టించి ఈనాటి స్వరం కట్టి పాడాలి. పాట జీవ వాహిని లాంటిది. జగత్తును మదిస్తే హలాహలం. మనస్సును మదిస్తే ఆలోచనమృతం. అదే చైతన్యతత్వం. సర్వ కళలు మన పూర్వులు పెంచిన గులాబీ మొక్కలు. మన గర్వానికి నవ్వులు. ఆనందాలు పూసిన ఆశల మేడలకు తోరణాలు. ఇది ఎన్నో వసంతాల గత అనుభవం. కాలచక్రంతో శతాబ్దాల ప్రయాణం కాలానుగుణంగా ఎన్నో మార్పులు. ముల్లోకాలను వడబోసే నేత్రం, నిత్యం శోదించే తత్వం, తెలుగు కళ్ళకు తెలుసు. మన తెలుగాళ్లకు తెలుసు నవీనత్వం నూతనత్వం.
మానవతా విలువలు మాయమవుతున్న తరుణం, సమిష్టి సమూహ గానాలు కాకుండా ఏకత్వం ఎగబాకుతున్న ఈ సమయంలో కళ కళ కోసమే కాదు, అది ప్రజల కోసం. శాస్త్రీయతను గౌరవిస్తూ సామాజిక అంశంతో కూడిన ప్రజాపాటకు నృత్య నీరాజనం. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే 2సం|| ముల క్రితం సుద్దాలఅశోక్‌ తేజ వర్ష వర్సెస్‌ వర్షిత అనే పాట, ధనిక పేద బడి పిల్లల బాధల గాధను అర్ధనారీశ్వర కతులలో సాహిత్యాన్ని చేర్చి, శాస్త్రీయ నృత్య భంగిమలు చేర్చి ఢిల్లీలో తన మనవరాలితో చేసిన ప్రయోగం పలువురి ప్రశంసలందుకున్నది. నత్య గురువులందరూ ప్రజల ఆలోచనల యజ్ఞములు పాలుపంచుకోవడం అంటే ఇదే. ఈ ప్రక్రియను మనం ఎందుకు చేయకూడదు? అందరూ ఆలోచించారు. మేము సైతం అంటూ చేయి చేయి కలిపి ప్రజా పాటలకు పట్టం కట్టారు. తెలంగాణ బాలోత్సవం కార్యక్రమం రూపొందించి, ఆచరణలో పెట్టింది. నృత్య గురువుల సమ్మేళనం జరిగింది. 16 మంది నృత్య గురువులు ముక్తకంఠంతో ముందుకు రావడం విశేషం. నృత్యగురువు రమణిసిద్ది కన్వీనర్‌గా, కో కన్వీనర్‌ గా ఇందిర పరాశరం బాధ్యతలు తీసుకున్నారు.
హైదరాబాద్‌ అంటే భారతీయ కళల జగత్తుకు విశ్వజనీనమైంది. తనదైన శైలి, సహకరించే ధోరణి ప్రజా సమస్యలకు నిలువెత్తు దర్పణం లాంటి పాటలనే ఎంపిక చేసుకోన్నారు.
శాస్త్రీయ నృత్య సంగీతంలో నిష్ణాతులైన నృత్య గురువులు, సాంకేతిక నైపుణ్యంతో కరుణ, రస, వీర, భయానక రసాలలో ఆత్మలను కదిలించే అభినయంతో పిల్లలను తయారు చేసారు. పిల్లలు కూడా ఎంతో శ్రద్దతో ఒక వైపు బడి, మరో వైపు నాట్యం చక్కగా సమన్వయం చేసుకున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫిబ్రవరి 17న ‘ప్రజాపాటకు నృత్య నీరాజనం’ కార్యక్రమానికి చిన్నారులు వేష భూషణాలతో కదలి వచ్చారు. చిన్నారుల వెంట తల్లిదండ్రులు, వారి బంధు గణమంతా నృత్య గురువుల సారధ్యంలో సుందరయ్య కళానిలయంకు తరలివచ్చారు.
ప్రజా పాటలకు తనదైన శైలిలో నాట్య రీతులకు దివిటి పట్టింది. సుమారు 300 మంది చిన్నారులలో 3 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలబాలికలు పాల్గొన్నారు. కళారంగ దిగ్గజాలు 16 మంది నిత్య గురువులు పోటీపడి నేర్పించిన కళాకృతులు ఈ మహా ప్రదర్శనలలో కొలువుతీరాయి. సుందరయ్య కళా నిలయమంతా చక్కటి వాతావరణం నెలకొంది. చూడముచ్చటగా ఎక్కడ చూసినా పిల్లలే భాగస్వాములయ్యారు. నృత్య గురువులంతా మౌనం గాంభీర్యంగా కనిపించారు. మా ప్రతిభ పాఠవాలు మా పిల్లల్లోనే ఉన్నాయన్నంత ధీమాగా అగుపించారు.
ఇక పిల్లలను ఎవర్ని చూసినా వసంతంలో నెమళ్ల గుంపును చూసినట్టుగా ఉంది. పిల్లలు వేసుకున్న మేకప్‌లు, పాత్రోచితమైన రంగురంగుల వస్త్రాలంకరణ, ఆప్యాయతతో పలకరింపులు, ఆలింగనాలు చూసినప్పుడు ఆకాశమే మురిసి ఇంద్రధనస్సు విప్పారినట్లు సుందరయ్య ప్రాంగణమంతా ‘నాట్యమయూరాల’తో పులకించిపోయింది. ఆ సంతోషాల నడుమ వేడుక ప్రారంభమైంది. ప్రజాపాటకు నృత్య నీరాజన జ్యోతిని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ జ్యోతి వెలిగించి నృత్యనీరాజనానికి నాంది పలికారు. బాలోత్సవ జండా ఊపి నృత్యాలకు తెర లేపారు. అప్పటికి కార్యయోధులుగా పిల్లలంతా నవరస నృత్యాభినయనానికి సిద్ధంగా ఉండడంతో బాలోత్సవ గీతం ఆరంభంగా అద్భుతంగా సాగింది. ఇది సుద్దాల రాసిన పాట. బాలోత్సవ ఉద్దేశ్యం, విషయ నిరూపణ బాలబాలికల కర్తవ్య కార్యదీక్షతో ప్రారంభమై, పలువురిని కదిలించే విధంగా ఉంది. ఆనాడు ఆది శివుడు ఢమరుకాను ఎలా ఆడించాడో.. ఆ నాట్యపు అడుగులు ఎలా వేశాడో మనకు తెలియదు కానీ, ప్రజల ఆలోచనలకు ప్రతి దృష్టి కోణాన్ని పిల్లలు చూపెట్టారు
‘చీడపీడ వంటి అబద్ధాల క్రీడ వంటి మూఢ నమ్మకాల పైన పిడుగులమవుతాం’ అన్నప్పుడు పిల్లలు చూపిన సమన్వయం, కళ్ళల్లో అభినయం చూసినప్పడు శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో కానీ 16 మంది పిల్లల కోపాగ్ని ‘మంటగా మారి మూఢనమ్మకాలు తగలబడుతున్నయా అన్నట్లుగా ఉన్నాయి. హిందువైనా.. ముస్లిమైయినా.. ఈ సాయి సిక్కులైన.. జైనులైన ఈ గడ్డను పుట్టిన ప్రతి ఒక్కరు నా బిడ్డలని గర్జించే ఈ నేల నడుగుల మౌతాం… ఇండియా గౌరవాన్ని ఈ ప్రపంచ మండపాన ఎగిరేసే పౌరుషమౌతాం… పతాకాలమవుతాం.. అన్నప్పుడు హాలంతా హర్షధ్వనులతో పులకరించింది. రిథమ్‌కు తగ్గ కాంపోజిషన్‌ చేసిన సంగీత దర్శకుడు యశోకృష్ణ , అద్భుత గాత్రం రాంకీ, ఈ సాహిత్యానికి అనుగుణంగా హస్తముద్రికలు పాదాల కదలికలు ముఖ కదలికల అభినయం అసమాన శైలిలో నాట్య గురువైన ఇందిరా పరాశరం ప్రదర్శించిన తీరు నృత్య నూతన సృష్టి. నృత్య నీరాజనానికి ప్రేక్షకులు పలికిన జేజేలు. కన్వీనర్‌ అయిన రమణిసిద్ధి నాట్య గురువు.
స్వాగతం సుస్వాగతం నృత్య ప్రదర్శన కొరియోగ్రఫీ వైవిధ్యంగా, ఎంతో అర్థవంతంగా ఉంది.
రామలక్ష్మి నాట్య గురువు వారి శిష్యబృందం చేసిన ”అణగారిన జీవితాల్లో అక్షరదారి” అనే పాటకు, ”ఇదే ఇదే నా దేశం అనే పాటకు” చక్కటి రిథమ్‌తో కూడిన నృత్యం చూపరుల హదయాలను గెలుచుకున్నది. నాన్‌స్టాప్‌గా కరతాల ధ్వనులతో మార్మోగిపోయింది ఆడిటోరియం.
నాట్యగురువు అయిన ఎం.పద్మజ నేతృత్వంలో ”పుణ్యభూమి నాదేశం నమో నమామి” అనే పాటకు ప్రతి చరణానికి జేజేలు పలికారు. ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కంపోజింగ్‌ ఆలోచనాత్మకంగా ఉంది. బ్రిటిష్‌ వారి అన్యాయాలపై అల్లూరి సీతారామరాజు, వీర పాండ్య కట్ట బ్రహ్మన, సుభాష్‌ చంద్రబోస్‌ పాత్రల అభినయం ఆకట్టుకున్నది. సుభాష్‌ చంద్రబోస్‌ మళ్ళీ పుట్టాడా? అన్నట్టుగా మూడేళ్ల చిన్నారి అభినయం ఆకర్షణీయంగా ఉంది. ‘కల్లాకపటం తెలియని వాడ’ అనే పాటకు నృత్యం, ‘పాడవొయి భారతీయుడా’ పాటకు నృత్య దర్శకురాలు లక్ష్మీ ప్రసూన బృందం ప్రదర్శించిన తీరు, చక్కటి సమన్వయం, సొగసైన సౌందర్య వైభవం దృశ్య మానమైన సంతోషాన్ని కలిగించారు.
ప్రకతి కవి జయరాజు రాసిన ”పచ్చనిచెట్టును నేను రా.. పాలు గారే మనసు నాదిరా” అనే పాటకు తేజస్విని అందమైన సాహిత్యంలోని సూక్ష్మ భేదాలను సంగ్రహించినది. ఉన్నతమైన అభినయంతో ఆకట్టుకున్నారు భావనదీప్తి, రాధిక శ్రీనివాస్‌. చక్కని నృత్యాంశాలు ప్రదర్శించి కనువిందు చేశారు. ఆహార్యం చిన్నారుల క్రమశిక్షణ తల్లిదండ్రుల ప్రోత్సాహం స్ఫూర్తిదాయకం. ప్రజాపాటలకు శాస్త్రీయతను జోడించే నృత్య గురువులు వైవిధ్యం ప్రదర్శించి నృత్యకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నృత్యంలో తమను తాము నిరూపించుకోడానికి పిల్లల నిరంతర తపన పట్టుదల కనబడింది.
మారుతున్న ప్రపంచంలో ప్రతి తరం కొత్త చూపుని సరికొత్త వ్యక్తీకరణల్ని తీసుకొస్తుంది. కొత్తతరం ఆలోచనలతో సమాజం ఎప్పటికప్పుడు నవీకరణ చెందుతున్నది. అనుభవం నుండి జ్ఞానం సంపాదించుకుంటుంది. ప్రతి సమాజం ఇలా ముందుకు మునుముందుకు పోతున్నది. దీన్ని మనందరం స్వాగతించాలి.
సాహిత్యం, కళలు ప్రజాసంస్కృ‌తిని ప్రతిబింబించాలి. పరాయిగా ఉండకూడదు. అందుకే మన నృత్య గురువులు మన చిన్నారులు మరల పుష్పించే ప్రగతి పుష్పాలుగా ఉండాలి.
మన కళలను పంచాలి. బహు విధమైన వేల కళలను ప్రజాదష్టి కోణంలో స్నేహ పందిరిని నిర్మిద్దాం. చీకటి సంప్రదాయాలను తుద ముట్టించి ప్రజాకళలకు హారతి పడుదాం. ప్రజాప్రయోజనాల దష్ట్యా… ప్రజాపాటకు నృత్య నీరాజన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిద్దాం. ప్రజల మన్ననలు పొందుదాం.

– భూపతి వెంకటేశ్వర్లు, 9490098343

Spread the love