పరివర్తన

Transformation”రెడ్డిగారు చెప్పండి” అన్నాడు యంకన్న మోగుతున్న సెల్‌ఫోన్‌ తీసుకొని. ”ఏం లేదురా. పక్క వూరికిపోయి పది అమ్మోనీయ, పది యూరియా సంచులు వేసుకొని రా. తొందరగా రా” అన్నాడు రెడ్డి అవతల నుండి.
”సర్లే రెడ్డిగారు వస్తా” అని ఫోన్‌ పక్కనబెట్టి భార్య పెట్టిన గొదుమరవ్వ ఉప్మా తింటున్నాడు.
”ఏంది? ఎవరు ఫోన్‌ చేసింది? రెడ్డేనా? యదవ. సిగ్గులేదు వాడికి. మళ్ళీ మందు కట్టలు వేసుకురమ్మన్నాడా? ఐనా మళ్ళీ ఎలా ఒత్త అన్నవు? మొన్న నీకు జరిగిన అవమానం మర్చిపోయావా?” అన్నది కమల వంట గదిలో పొగలు కక్కుతున్న టీని కప్పులో పోస్తూ.
యంకన్న ధీమాగా ఒక చూపు చూసి, అవమానం ఏంటే? అదంతా మాములే. వాళ్ళు అనేవాళ్ళు మనం పడేవాళ్ళం. అవన్నీ నెత్తికి ఎక్కించుకుంటే ఎలానే? బతుకు ఎలా గడుసుద్ది?” మాట పడకుండా ముద్దెట్టా వస్తది? అన్నాడు చెయ్యి కడుక్కుంటూ.
”ఊరిలో వాడొక్కడు కిరాయికి పిలవకపోతే ఏమి నష్టం? ఊరంతా గొడ్డు పోయిందా? ఐనా పిలిచిన వెంటనే పోతావు. ఒక్కడివే అన్నీ పొలం వరకు మోసుపోతావు. ఆటితో పాటు గొడ్లకి గడ్డి వేసే పని, ఆడి పెళ్ళాం చీరల ఇస్త్రీ పని… ఒకటేమిటి అన్ని పనులు చేయిస్తాడు. ఇంతజేసీ టీ నీళ్లన్న గుక్కెడు పొయ్యరు. ఎప్పుడైనా మంచినీళ్లు ఇస్తే గొడ్ల సావిట్లో పెట్టే గలాసుతో పోస్తాడు. పైగా అరే వెంకడు, రారా పోరా అనే మర్యాదలు. ఆళ్ల ముందు చెయ్యి కట్టుకొని నిలబడతావు? చీ… కొద్దిగన్నా పౌరుషం లేదు” అని కోపంగా ఒక చూపు చూసింది కమల.
ఇవేవీ పెద్దగా పట్టించుకోకుండా మూతి తుడ్చుకొని టీ తాగుతున్నాడు వెంకన్న. ”నా మాట నువ్వెప్పుడు విన్నావు గనుక నీ ఇష్టం. ఈ రోజు గుర్తుందా నీకు? ఇయ్యాల నీ పుట్టిన రోజు. నామాట విను. మందుకట్టలు రేపు తెస్తానని చెప్పు. పిల్లల్ని తీసుకొని బయటికి పోదాం” అన్నది కమల కాస్త అసహనంతో.
కమల చెప్పింది ఏమంత ప్రత్యేకమైన విషయమే కానట్టు మందుకట్టలు తెచ్చి అక్కడ పడేసోచ్చాక, సాయంత్రం పోదాంలే అని ఆటో తాళాలు తీసుకున్నాడు యంకన్న. ఆట్లాగే పో గానీ ఇదిగో ఈ కొత్త బట్టలన్నా తొడుక్కొని పో”
”వొద్దు వొద్దు సాయంత్రం వొచ్చాక కట్టుకుంటాలే” అంటూ ఆటోవైపు వెళ్ళాడు.
ఎప్పటిలానే తన మాట వినిపించుకోని భర్తని చూసి జాలి వేసింది కమలకి. ఆటో స్టార్ట్‌ చేసుకొని వెంకన్న రోడ్డు ఎక్కాడు.
ఆటోలో వెళ్తూ వెళ్తూ కమల అన్న మాటలు గుర్తొచ్చాయి. నిజమే కదా? ఆత్మాభిమానం ఉండాలి. నా కష్టం నేను పడుతున్నాను. నా బతుకు నేను బతుకుతున్నాను. దొంగతనాలు చేసి, మాయలు మోసాలు చేయటం లేదు. ఆ రోజు రెడ్డి ఏమన్నాడు?.. ‘ఏంట్రో యంకన్న కొత్త బట్టలు వేసి తలకూడా దువ్వినావు. ఆఫీసర్లాగా. ఏంటి సంగతి? ఆటో తోలుకునే వాడివి. ఆటో తోలుకునే వాడిలా ఉండాలి. ఇంకోసారి నాకు ఇట్లా కనపడమాకు. మాలాంటి వాళ్ళు నీకు కిరాయి ఇస్తేనే నీకు బతుకని గుర్తుపెట్టుకో. నేను ఈ సంగతి వూల్లో చెప్పానంటే ఇక అంతే. నీకు ఒక్క కిరాయి కూడా రాదు మరి. చెరపరా చెరుపు. తల చెరుపు ల… కొడక’ అనేగా అన్నాడు.
బూతులు కూడా తిట్టాడు కదా. ఏం కొత్త బట్టలు కట్టుకోవడం తప్పా? తల దువ్వుకొని నీట్‌గా ఉండటంలో ఏమి తప్పుంది?
రెడ్డి తలచెరుపు అన్నప్పుడు నేను తల ఎందుకు చెరిపాను? అంటే తల దువ్వుకోవటం, కొత్తబట్టలు ధరించటం తప్పని నేను ఒప్పుకుంటున్నానా? ఆలోచనలతో తల వేడెక్కింది. ఆటో వేగంగా ముందుకు దూసుకుపోతుంది.
రెడ్డి ఇట్లా అన్నడని కమలకి చెప్తే తాను ఏమన్నది? తల చెరుపుకోకుండా ఉండాల్సింది అని. మళ్ళీ కమలే కొత్త బట్టలు తొడుక్కోవటం ఎందుకు తప్పో నువ్వు ఎందుకు అడగలేదని గట్టిగా అడిగింది. నిజమే నేను ఎందుకు రెడ్డిని ప్రశించలేదు? నా రక్తంలో వేడి తగ్గిందా? అనుకున్నాడు.
ఆటో వేగం ఇంకా పెరుగుతుంది. మందుల కొట్టుముందు ఆటో ఆపి లోడ్‌ చేసుకొని తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు. మళ్ళీ అవే ఆలోచనలు. వొస్తూ వొస్తూ ఇంటి ముందు ఆటో ఆపి ”కమల, కమలా” అని పిలిచాడు.
ఇల్లూడుస్తున్న కమల యంకన్నని చూసి ”ఏంటి అప్పుడే వొచ్చవా? సరే, పోపో. పోయి మందు సంచులు ఆడేసి రా” అన్నది కమల.
”లేదు లేదు తర్వాత పోతాలే” అంటూ నీళ్ల గదిలోకి వెళ్లి తలారా స్నానం చేస్తున్నాడు యంకన్న.
ఏమయినాది ఈ మనిషికి అనుకొని చీపురు కట్ట పడేసి తుండుగుడ్డ తెచ్చింది. ముఖం నిండా ఆనందంతో వొచ్చి కొత్త బట్టలు తొడుక్కొని, తల దువ్వుకొని రెడ్డి ఇంటి ముందర ఆటోని ఆపాడు.
యంకన్న కొత్త బట్టలు, క్రాపు చూసి రెడ్డి విస్తుపోయి ”యారా యురియా కట్టలు తెచ్చి లోపలి ఎయ్యి” అన్నాడు కోపంగా.
”ఇయ్యాల నా పుట్టిన రోజు అండి. మందు సంచులు దించితే, నా కొత్త బట్టలు మురికి పడతాయి. ఇవాళ్టికి మీరే దింపుకొండి” అన్నాడు యంకన్న.
”ఏమిరో అహంకారం నెత్తికి ఎక్కిందా? నీయమ్మ. కుడితి గాబులో వేసి తొక్కేస్తా” అని మరో బూతుమాట ఏదో రెడ్డి మాట్లాడబోతుంటే మధ్యలోనే అడ్డుకొని ”మాటకి మాట అనగలను నేను కూడా. వొద్దండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇంకో మాట, ఇక నుండి మీ మందుసంచుల పని నేను చేయను. ఇంకొకడ్ని చూసుకో. వస్తానండి” అని ఆటోలో ఉన్న సంచుల్ని రోడ్డుమీదనే డొల్లించి కాలర్‌ భుజం మీదనుండి రెండించలు పైకి ఎగరేసి వేగంగా ఆటో తొలుకుంటూ ఇంటి వైపు వొచ్చాడు.
పుట్టిన ఇన్నేళ్ళకి జన్మించడం అంటే ఏంటో అర్ధమైంది యంకన్నకి.

– పెద్దన్న, 9866881140

Spread the love