ఫైనల్‌ మ్యాచ్‌ టైంలో క్రికెటర్‌ సిగరెట్‌ స్మోకింగ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: పాక్‌ ఆల్‌ రౌండర్‌ ఇమాద్‌ వసీమ్‌ సోమవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా … టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిగరెట్‌ తాగుతూ కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు టీం డ్రెస్సింగ్‌ రూంలో సిగరెట్‌ తాగడం వివాదాంశంగా మారింది. దీనిని చూసిన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ”పాకిస్థాన్‌ ‘స్మోకింగ్‌’ లీగ్‌” అని ఎక్స్‌ లో ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. అయితే వసీమ్‌పై పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇంకా స్పందించలేదు. ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం వసీమ్‌ తన ఆటతో అదరగొట్టారు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 23 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. దీంతో ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇస్లామాబాద్‌ జట్టు చెమటోడ్చింది. చివరి బంతికి విజయం సాధించి మూడోసారి పీఎస్‌ఎల్‌ టైటిల్‌ను అందుకుంది. ఇమాద్‌ వసీమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచారు.

Spread the love