నీతి, నిజాయితీకి పట్టం కట్టండి

– సీపీఐ(ఎం)ని గెలిపించండి
– 8న పార్టీ అభ్యర్థి నామినేషన్‌
– రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
నీతి, నిజాయితీగా నిలబడి ప్రజా సమస్యలపై అనునిత్యం పనిచేసే సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపించాలని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీ పోటీ చేస్తుందని పార్టీ అభ్యర్థి నవంబర్‌ 8న నామినేషన్‌ వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. శనివారం పార్టీ భద్రాచలం పట్టణ జనరల్‌ బాడీ సమావేశం ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో సీపీఐ(ఎం) శాసనసభ సభ్యులుగా కుంజా బొజ్జి, ముర్ల ఎర్రయ్య రెడ్డి, సున్నం రాజయ్య నీతి, నిజాయితీగా ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో వారు చేసిన కృషి ఫలితంగానే అభివృద్ధి జరిగిందని అన్నారు. పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేసిందని, పోడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్‌ కోసం పోరాడి సాధించిన ఘనత కమ్యూనిస్టులదని అని అన్నారు. అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించాలంటే సీపీఐ(ఎం) గెలిపించాలని మచ్చా పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ ప్రజలకు అండగా నిలుస్తూ అనేక కష్ట కాలాలలో కరోనా, వరదలు మొదలగు సమయాలలో ప్రజలకు అండగా నిలిచిందని అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. నియోజవర్గంలో విలువలు లేని వారిని పోరాటం చేతకానివారిని ఓడించాలని ప్రజల పక్షాన నిరంతరం నిలబడి పనిచేసే సీపీఐ(ఎం)ను గెలిపించాలని అన్నారు. పార్టీ అభ్యర్థి నవంబర్‌ 8 తేదీన నామినేషన్‌ వేయడం జరుగుతుందని ఈ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మెన్‌ ఎలమంచి రవికుమార్‌, జిల్లా నాయకులు మధు, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్‌, ఎం.రేణుక, సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకటరెడ్డి, బండారు శరత్‌ బాబు, వై.వెంకట రామారావు, పి.సంతోష్‌ కుమార్‌, పట్టణ కమిటీ సభ్యులు సిహెచ్‌ మాధవ్‌, కుంజా శ్రీనివాస్‌, లక్ష్మీకాంత్‌, యు.జ్యోతి, జీవనజ్యోతి, ఏ.రత్నం, కోరాడ శ్రీనివాస్‌, సత్య, ఎన్‌.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love