– పొంగులేటి, తుమ్మలకు ప్రజలే బుద్ది చెప్పాలి
– గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపెడతా..
– లక్ష్మీపురం ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ -బూర్గంపాడు
పైలెట్ ప్రాజెక్టు కింద పినపాక నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసి చూపుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దళితులు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నారని, వారి కోసమే దళిత బంధు పథకాన్ని బిఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు అభ్యర్థన మేరకు కాంతారావును గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా మారుస్తారని ఆయన అన్నారు. ఒకప్పుడు మన్యం ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ‘మంచం పట్టిన మన్యం’ అంటూ వార్తాపత్రికలో ప్రముఖం గా వచ్చేవని, వాటిని నివారించేందుకు తాను నియోజకవర్గాలలో వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేశానని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను భద్రాచలం, పినపాక నియోజకవర్గాలలో పర్యటిస్తానని రాష్ట్ర బృందాన్ని కూడా తీసుకువస్తానని సిఎం హామీ నిచ్చారు.
ఆ ఇద్దరికీ ప్రజలే బుద్ధి చెప్పాలి : పొంగులేటి, తుమ్మలపై మండిపడ్డ సీఎం కేసీఆర్
అహంకారంతో విర్రవీగుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ ఇద్దరు నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులపై మండిపడ్డారు. ప్రజలైన మీరు ఓట్లు వేసి గెలిపిస్తుంటే అసెంబ్లీ గేట్లు తాకనీనని.. ఎవరిని రానివ్వనని దురహంకారానికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.ఈ ఆశీర్వాద సభకు పినపాక నియో జకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడవల్లి కృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు, పార్టీ యువజన విభాగ మండల అధ్యక్షుడు గోనెల నాని, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.