దళితబందు ఓ మోసపూరితమైన ప్రకటన 

– కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మానాల రవి ఆరోపణ 
– అంబేడ్కర్ అభయహస్తంతో రూ.12 లక్షల ఆర్థిక భరోసా
నవతెలంగాణ-బెజ్జంకి : మానకొండూర్ నియోజకవర్గంలో అత్యధికంగా దళిత సామాజిక వర్గాల ఓట్లున్నాయని గ్రహించి దళితులందరికి దళిత బందు వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్  ప్రకటన చేయడం దళితులను మరోసారి మోసం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మానాల రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మానాల రవి మాట్లాడారు. మండలంలోని చీలాపూర్ పల్లి, నర్సింహుల పల్లి గ్రామాలను మొదటి విడత దళిత బందు పథకంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల్లోని ఆర్హులకు అందించకుండా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు, అనుచరులకు కట్టబెట్టిన ఘనత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దని అన్నారు. మళ్లీ అందరికి దళిత బందు వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన మోసపూరితమైందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్హులైన దళితులందరికి అంబేడ్కర్ అభయహస్తం ద్వార రూ.12 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు శానకొండ శ్రవన్, నాయకుడు కత్తి రమేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వి మోసపూరిత వాగ్దానాలు..
ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ ను గెలిపిస్తేనే మానకొండూర్ నియోజకవర్గ దళితులందరికి దళిత బందు పథకం వర్తింపజేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం మరో మారు దళితుల ఓట్లను దండుకునే యత్నమేనని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలన్ని మోసపూరితమైనవని యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మంకాల ప్రవీన్ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన సమావేశంలో రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ప్రవిన్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటన ఎన్నికల కోసమేనని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమన్యాయం జరుగుతుందన్నారు. అభివృద్ది పేరుతో ప్రజా ధనాన్ని దోపిడి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
Spread the love