జికా వైరస్ కలకలం..వైద్యుడు సహా కుమార్తెకు పాజిటివ్

నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో 46 ఏళ్ల డాక్టర్, ఆయన కుమార్తెకు జికా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బుధవారం ఒక అధికారి తెలిపారు. ఆ వైద్యుడికి ఇటీవల జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయనను ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. రక్త నమూనాలను సేకరించి నగరానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపించారు. జూన్ 21న వారికి జికా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ పాజిటివ్ అని నివేదికలు ధృవీకరించాయని పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) ఆరోగ్య అధికారి తెలిపారు. డాక్టర్ నగరంలోని ఎరంద్‌వానే ప్రాంతంలో నివాసి అని వెల్లడించారు. అనంతరం వైద్యుడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను విశ్లేషించగా.. ఆయన 15 ఏళ్ల కుమార్తెకు కూడా జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు.

Spread the love