నీట్‌ రద్దుపై తేల్చండి

Decide on cancellation of NEET– కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు
– జులై 8న మళ్లీ విచారణ
న్యూఢిల్లీ: నీట్‌- యూజీ 2024 పరీక్షల రద్దుపై కేంద్రం, ఎన్టీఏ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్‌ రద్దు చేయాలా అనే అంశంపై వివరణ ఇవ్వాలని వారిని కోరింది. నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీం తెలిపింది. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే నీట్‌ రద్దుపై వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సుప్రీంకు మార్చాలని ఎన్టీఏ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై వివిధ పార్టీల నుంచి ధర్మాసనం వివరణ కోరింది. జులై 8న మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. అయితే నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్‌పై కూడా కోర్టు విచారణ చేపట్టనున్నది.
నీట్‌ లీక్‌ నిజమే.. బీహార్‌ పోలీసులకు విద్యార్థి వాంగ్మూలం..
నీట్‌ పరీక్షలో అక్రమాలపై విద్యార్థులు, విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత బీహార్‌లో నీట్‌ ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు రాగా కేంద్రం, ఎన్టీఏ తోసిపుచ్చాయి. కానీ పరీక్ష తేదీకి ముందు రోజే నీట్‌ పరీక్షా పత్రం తమ చేతికి వచ్చిందని ఇదే కేసులో బీహార్‌లో అరెస్టైన విద్యార్థులు పోలీసుల విచారణలో అంగీకరించారు.మరోపక్క నీట్‌ లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ సిట్‌ అధికారులు 14 మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒక జూనియర్‌ ఇంజినీర్‌, ముగ్గురు నీట్‌ అభ్యర్థులు ఉన్నారు. ఈ నలుగురిలో ఓ నీట్‌ అభ్యర్థి.. జూనియర్‌ ఇంజినీర్‌కు మేనల్లుడని తెలుస్తోంది.నీట్‌ పరీక్షకు హాజరైన సదరు విద్యార్థి పోలీసుల విచారణలో స్పందిస్తూ.. ‘రాజస్థాన్‌లోని కోటాలో నేను నీట్‌ కోసం ప్రిపేరవుతున్నా. మా మామయ్య ఫోన్‌ చేసి, నీట్‌ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశా.. ఇంటికి రమ్మన్నారు. గత నెల ఐదో తేదీన నీట్‌ పరీక్షకు ఒక రోజు ముందు రాత్రి నా మిత్రులతో కలిసి మామయ్య ఇంటికి వెళ్లా.. అక్కడ నాకు నీట్‌ ప్రశ్నాపత్రం, ఆన్సర్‌ షీట్‌ ఇచ్చారు. ఆ రాత్రంతా వాటిని కంఠస్థం చేశాం. ఐదో తేదీన పరీక్షా కేంద్రంలో మాకు ఇచ్చిన ప్రశ్నాపత్రం.. ముందు రోజు మా మామయ్య ఇచ్చిన పేపర్‌ ఒక్కటే అని తేలింది’ అని చెప్పాడు. ఇదే విషయమై రాత పూర్వకంగా రాసివ్వడంతో నీట్‌ యూజీ 2024 అక్రమాల వ్యవహారం మరింత తీవ్రమైంది.అయితే బీహార్‌లో నీట్‌ పరీక్షా పత్రం లీకేజీ కోసం సంబంధిత ముఠా రూ.32 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తున్నది. అలా లీకైన ప్రశ్నాపత్రం అందుకున్న విద్యార్థుల్లో ఒకరికి 720 మార్కులకు 185, మరొకరికి 300, మరో ఇద్దరికి 581, 483 మార్కులు వచ్చాయని తెలుస్తున్నది.

Spread the love