ఇలాంటి సమయంలో బీజేపీ మురికి రాజకీయాలు చేస్తోంది : ఢిల్లీ మంత్రి అతిషి

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ నేతల తీరుపై ఢిల్లీ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నాయకురాలు అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజలు నీటి కొరతతో అల్లాడుతుంటే.. ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తూ బీజేపీ డర్టీ పాలిటిక్స్‌ చేస్తున్నదని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ ఎండలతో అల్లాడుతున్నదని, దాంతో భూగర్భ జలాలు తగ్గి నీటి కొరత ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సాయపడాల్సింది పోయి బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ‘ఢిల్లీలో ఇప్పుడు ఎండలు భగ్గున మండుతున్నాయి. ఈ ఎండల కారణంగా నీటి కొరత ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ మురికి రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు గుంపులుగా ఢిల్లీ సెక్రెటేరియట్‌ ముందు ఆందోళన చేస్తున్నారు. నేను వాళ్లను ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇది అత్యవసర సమయం. పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు చేరుకుంటున్నాయి. ప్రజల అవస్థలు పడుతున్నారు. కానీ బీజేపీ రాజకీయాలు చేస్తున్నది. మురికి రాజకీయాలు చేయడానికి ఇదే సమయమా..?’ అని అతిషి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీకి ఆనుకునే హర్యానా ఉన్నదని, ఢిల్లీకి అనుకునే ఉత్తరప్రదేశ్‌ ఉన్నదని, ఆ రెండు రాష్ట్రాల్లోనే బీజేపీనే అధికారంలో ఉన్నదని అతిషి చెప్పారు. తాను ఢిల్లీ ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని, ఈ క్లిష్ట సమయంలో ఢిల్లీకి అదనపు తాగునీటిని సమకూర్చాలని కోరారు.

Spread the love