ప్రేరేపించిన వారిపైనా కేసులు నమోదు చేయాలి
బీఆర్ఎస్ నేత జోడు శ్రీనివాస్ డిమాండ్
నవతెలంగాణ – కాటారం:-
శిలాఫలకాల ధ్వంసం ఘటనల వెనుక కేవలం ధ్వంసానికి పాల్పడిన వారే కాకుండా, వారిని ప్రేరేపించి రెచ్చగొట్టిన వారిపైనా సమానంగా కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముందుగా ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనంతరం శ్రీధర్ బాబు శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్త వంశీని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనకు దారితీసినట్లు పేర్కొన్నారు.
“వంశీని పిలిపించుకుని అవమానకరంగా దూషిస్తూ, శిలాఫలకం పగలగొట్టకపోతే నీకు రక్తం మరిగదా అంటూ రెచ్చగొట్టారు. తమ నాయకుడు వద్ద పేరు సంపాదించుకోవడానికే ఈ కుట్ర చేశారు” అని జోడు శ్రీనివాస్ ఆరోపించారు. వంశీపై నమోదైన కేసుల మాదిరిగానే ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులపై కూడా అదే తరహా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీధర్ బాబు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రైతుల వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గిపోతుండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. “అన్నం రామచంద్రా అంటూ రైతులు విలవిల్లాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రైతు సమస్యలు పరిష్కరించాల్సింది పోయి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది” అని విమర్శించారు.
శిలాఫలకం ధ్వంసం ఘటన సమయంలో పలువురు కాంగ్రెస్ నాయకులు అక్కడే ఉండి మొత్తం వ్యవహారాన్ని వీడియోలు తీశారని, ఆ దృశ్యాలు ఆధారంగా ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. “మా శిలాఫలకం కనిపించకుండా కంకర కుప్పలు పోసి ధ్వంసం చేసి, ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లు మాట్లాడుతున్నారు” అని కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని, ఓటుతో సమాధానం ఇస్తారని జోడు శ్రీనివాస్ హెచ్చరించారు. గతంలో పుట్ట మధుకర్ శిలాఫలకం ధ్వంసం ఘటనపై ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు తిరిగి పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో వూర వెంకటేశ్వరరావు, కొండగొర్ల వెంకటస్వామి, గాలి సడువలి, జక్కు శ్రవణ్, మానేం రాజబాపు, తొంబర్ల రమణ, ముల్కపల్లి శ్రీలక్ష్మి చౌదరి, వంగల రాజేందర్ చారి, కొండపర్తి రవి, బొడ్డు రాజబాబు, చల్ల శేఖర్ రెడ్డి, రామిళ్ల రాజు, మెడిగడ్డ దుర్గారావు, గంట సమ్మయ్య, గంట ప్రభానందం తదితరులు పాల్గొన్నారు.



