అభివృద్ధి సరే… అసమానతల సంగతేంది?

Development OK...what about odds?భారతదేశం సుసంపన్నమే కానీ దేశ ప్రజలే పేదవాళ్లు అనే నానుడి నేటికీ మన దేశంలో చెలామణిలో ఉంది. ఏ దేశ ప్రగతికైనా సమర్థ మానవ వనరులే కీలకం. అలా మన దేశంలో యువ సమర్థ మానవ వనరులకు కొదువ(వెలితి) లేదు. ఆ మానవశక్తిని సద్వినియోగపరుచుకోవాల్సినది ప్రభుత్వాలే కదా! ఒకవైపు దేశంలో సంపన్నులు పెరుగుతున్నా మరోవైపు పేదరికం తగ్గడం లేదు. ఈ సామాజిక వ్యవస్థ ఫలానా విధానాల్లో ఎక్కడో ఉన్న లోపం మూలంగానే కుళ్ళిపోతుంది. ఈ సామాజిక వ్యాధిని కట్టడి చేయాల్సిన బాధ్యత పాలక వైద్యులపై లేదా? ధనవంతులు, కార్పొరేట్లు వారు సృష్టించిన మీడియా సంస్థలు వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి. కానీ ప్రజల ఓటు ద్వారా అధికార పీఠాన్ని చేపట్టిన ప్రభుత్వాలు కూడా వారి భజన చేస్తూ, వారి ప్రయోజనాల కోసం పని చేస్తున్నంత కాలం… ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది ప్రజాస్వామ్యమనిపించుకోదు. ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న ధనస్వామ్యమే అవుతుంది. దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం సాధించింది వీరి కోసమేనా? ఆర్థిక సమానత సాధించడంలో లోపం ఎక్కడుంది? శాపం ఎవరికి! వారు చేసిన తప్పేమిటి పరిశీలిద్దాం… మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ద్రవ్య విధానంలో కాఠిన్యం, బలహీనపడిన ఎగుమతులు, ఎల్‌నినో, రుతుపవనాల బలహీనతతో తీవ్ర ముప్పు, ప్రతి కూల తల వల్ల ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో కదలాడుతూ ఉండటం చూస్తున్నాం. ఇది ఆర్థిక వృద్ధికి ముప్పేనని నిపుణులు అంటున్నారు. వినియోగదారుల ఆదాయం, కర్షక, కార్మికుల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడంతో వారు నిరాశకు లోనవుతున్నారు. కానీ మన పాలకులు భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ను అధిగమించి ఐదో స్థానంలో నిలిచిం దని, త్వరలోనే మూడో స్థానంలో నిలుస్తుందని… ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఒకటో స్థానానికి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే ప్రచార బాకాలూదుకుంటున్నారు. నగరాలు, పట్టణంలో అభివృద్ధి, ఆ పక్కనే పూరిండ్లు, స్లమ్‌ ఏరియాలను చూస్తున్నాం. అభివృద్ధికి దూరంగా గ్రామాలు, ఏజెన్సీలు ప్రాంతాల వారి అసమానతలు కనిపిస్తున్నాయి. పేదరికం, ఆకలితోడై ప్రజల కొనుగోలు శక్తి క్రమేపి నిర్వీర్యం అవడంతో దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. పాలకులు చెప్పినట్లు బలపడుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెరుగుతుందా…? అనేది ప్రధాన ప్రశ్న?
వాస్తవంగా మనదేశంలో అలా లేదు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల ప్రజల జీవన ప్రమాణాలకు, భారత ప్రజల జీవన ప్రమాణాలకు మధ్య చాలా వ్యత్యాసం(తేడా) ఉంది. మన దేశ ప్రజల తలసరి ఆదాయంతో పోలిస్తే బ్రిటన్‌ ప్రజల తలసరి ఆదాయం 18రెట్లు అధికం. దీనిని బట్టి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు, ప్రజల జీవన ప్రమాణాలలో మెరుగుదలకు సంబంధం లేదనిపిస్తుంది. ప్రజల తలసరి ఆదాయం పెరగడమే అత్యంత ప్రధానం. కానీ ఈ తలసరి ఆదాయాన్ని లెక్కించడంలో కూడా పలు వివాదాలు ఉన్నాయి. మన దేశంలోని ధనవంతులు, అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తల ఆదాయంతో పాటు, అతి తక్కువ వేతనం పొందే వ్యక్తిని కూడా పరిగణనలోకి తీసుకొని ”సగటు తలసరి ఆదాయాన్ని” నిర్ణయిస్తారు. కాబట్టి కేవలం తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నంత మాత్రాన కూడా దేశ ప్రజలందరి ఆదాయం పెరిగిందని, వారి జీవితాలు సాఫీ(బేషు)గా సాగుతున్నాయని అనుకోవడానికి వీల్లేదు. మన దేశం ప్రజల తలసరి ఆదాయం చాలా దారుణంగా ఉంది. పేద దేశమైన అంగోలాలో కంటే తక్కువే. ఈ అంశంలో మన దేశం 197 దేశాలలో 142వ స్థానంలో ఉంది. మన తలసరి ఆదాయం 2601 డాలర్లు. దీనితో పోలిస్తే అమెరికాలో 31రెట్లు, జపాన్‌, ఇటలీ దేశాల్లో 14రెట్లు ఎక్కువ. కానీ కొందరు చేస్తున్న వాదన ఏంటంటే? మనదేశంలో జనాభా అధికంగా ఉండడం వల్ల మన తలసరి ఆదాయం తక్కువ ఉంటుందన్నారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. మొన్నటి వరకు ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనాలో తలసరి ఆదాయం మన దేశంతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా ఉంది. అంతేకాదు బడా దేశాల సంగతి పక్కన పెడితే మనం ఎన్నడూ పేరు కూడా వినని దేశాలైన వనటూ, సావో టోమ్‌ ప్రిన్సిప్‌లలో కూడా మనకంటే తలసరి ఆదాయం ఎక్కువే. ఇది కాదనగలరా! మన దేశంలో అభివృద్ధిలో అసమానతలకు తోడుగా ప్రపంచంలో ధనవంతులు మరింత సంపన్నులుగా, పేదలు మరింత నిరుపేదలుగా మారిపోతున్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే మనదేశంలో అభివృద్ధిలో అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంపన్నుల ఆదాయం శరవేగంగా పెరగడంలో పేదల ఆదాయం అధాఃపాతాళానికి పడిపోతుంది. మన దేశ జనాభాలో ఐదుశాతం మంది ధనవంతుల చేతిలో 60శాతం దేశ సంపద కేంద్రీకృతమై ఉంది. దీని మూలంగా మిగతా జనాభా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించ లేకపోతున్నారు. పాలకుల ద్వంద్వ విధానాలు ఆర్థిక అస మానతలు పూడ్చలేని స్థితికి దిగజారుటకు కారణం కాదా!
అలా 2020లో మనదేశంలో 102మంది బిలియనీర్లు ఉండగా, ఈ సంవత్సరంలో వారి సంఖ్య 163కు పెరిగింది. ఒకవైపు సంపన్నుల సంపద పెరుగుతుంటే? మరోవైపు పేదల సంఖ్యతో పాటు, వారిలో పేదరికం కూడా పెరిగిపోతుంది. 2018వ సంవత్సరంలో ఆకలితో అల్లాడిన భారతీయుల సంఖ్య 19కోట్లు ఉండగా, 2022 నాటికి 35కోట్లకు పెరిగిపోయింది. అదేవిధంగా 2022లో చనిపోయిన ఐదేండ్లలోపు పిల్లల్లో 65శాతం మంది ఆకలితోనే ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల పరిమాణంలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ, అనేక ఇతర రంగాల్లో మన దేశ స్థానం అట్టడుగున(చిట్ట చివరన) ఉంటుంది. అత్యంత ఆనందకరమైన దేశాలలో మనది 125వ స్థానం. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన పది దేశాల్లో ఏ ఒక్కటి కూడా పై జాబితాలో లేదు. పత్రికా స్వేచ్ఛలో 161వ స్థానం. మానవ అభివృద్ధి సూచీలో కూడా మనం 130వ స్థానంలో ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నంత మాత్రాన దేశం సుసంపన్నం కాదు. అసలు మన దేశంలోని అసమానతల సమస్యను పాలక, ప్రతిపక్షాలు పక్కనపెట్టి దేశం పేరు మార్చితేనో, ఎన్నికల విధానాల్లో మార్పు వచ్చినా, సాంకేతికంగా ఎంతో డిజిటలైజేషన్‌ అయినా, చంద్రమండలంపై అడుగుపెట్టినా ”తినే అన్నం” మాత్రం డౌన్‌లోడ్‌ చేయలేరు. రైతులు, కార్మికులు కష్టపడితేనే ప్రజల కడుపునిండేది ప్రజల జీవనం సాఫీగా సాగేది. సంపద కేంద్రీకృతాన్ని, ప్రభుత్వాల పాలనా విధానాల్లోని లోపాన్ని సవరించి సమ్మిళిత అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలి. పేద ప్రజల వ్యక్తిగత(తలసరి) ఆదాయం పెరుగు తున్నప్పుడు, ప్రజలకు సుపరిపాలన లభిస్తున్నప్పుడు, ప్రజ లందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే దేశం సౌభాగ్య వంతమైన (శ్రేయో) రాజ్యం అనబడుతుంది. గతంలో స్వాతంత్య్రానికి పూర్వం ఆంగ్లేయులను విమర్శించాం… నేటి 76ఏండ్ల స్వయం పాలనలో కూడా మనదేశం వివిధ రంగాల్లో అసమానతలను చవిచూస్తు న్నప్పుడు మనం ఎవరిని ప్రశ్నించాలి? దానికి బాధ్యులు పాలకులు కాదా! ఈ సమస్యను పరిష్కరించలేకపోతే? భవిష్యత్తు తరాల దృష్టిలో నేటి పాలకులు దోషులుగా మిగిలిపోతారు.

మేకిరి దామోదర్‌
9573666650

Spread the love