Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅభివృద్ధి సరే..నాన్‌ రెగ్యులర్‌ ఉద్యోగుల మాటేమిటి..?

అభివృద్ధి సరే..నాన్‌ రెగ్యులర్‌ ఉద్యోగుల మాటేమిటి..?

- Advertisement -

వారి హక్కులకు సమాధి
ఫిక్స్‌‌డ్‌ ‌టర్మ్‌ ఎంప్లాయీమెంట్‌ ‌అంటే శాశ్వత బానిసత్వమే..
ప్రమాదకర స్థితిలో పని పద్ధతులు
తనిఖీలు చేయని కార్మిక శాఖ
దినదినగండంగా బతుకులు
నేడు సంగారెడ్డిలో రాష్ట్ర ప్రథమ మహాసభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రంలో జోరుగా సాగుతోం దని ప్రభుత్వం ఢంకా భజాయిస్తోంది. కొత్త కర్మాగారాలు, పరిశ్రమలు, సంస్థలు ఇదిగో వస్తున్నాయని చెబుతున్నారు. వారు చెప్పే గణాంకాలు అభివృద్ధిని చాటుతున్నాయి. కానీ.. ఈ అభివృద్ధికి మూలస్థంభాలైన కార్మికుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మిగిలిపోతున్నది. వీరిని ఆదుకోవాలన్న సోయి ప్రభుత్వాలకు వీసమంతైనా లేకపోవటం బాధాకరం.
83శాతం కాంట్రాకే..
రాష్ట్రంలో సుమారు 10,368 పరిశ్రమలున్నాయి. వీటిల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. 83శాతం మంది కాంట్రాక్ట్‌, ఫిక్స్‌‌డ్‌ ‌టర్మ్‌, అప్రంటీస్‌, నాప్స్‌, నాక్స్‌, మీమ్స్‌, అసోసియేటెడ్‌, క్యాజివల్ తదితర పేర్లతో వీరు పని చేస్తున్నారు. వీటిల్లో 17శాతం మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఉపాధి భద్రత లేదు, సామా జిక భద్రత అంటే ఏమిటో తెలియదు. వీరే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 65 శాతం వాటా వీరిదే.. కానీ, వీరి బతుకులు మాత్రం అనిశ్చితి, దోపిడీల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.
సౌకర్యాలు నిల్‌..
కాంట్రాక్ట్‌, ఫిక్స్‌‌డ్‌ ‌టర్మ్‌ ‌కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌,బోనస్‌, గ్రాట్యూటీ,సెలవులు, చట్టబద్దహక్కులు ఇవ్వటానికి యజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. పర్మినెంట్‌ ‌కార్మికులకు షిప్ట్‌ ‌రిలివర్లుగా వీరు పనిచేస్తున్నారు. అప్రంటీస్‌‌లు, నిమ్ లు, నాట్స్‌‌లాంటి వారికి కేవలం స్టైఫండ్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మొత్తం కార్మికుల్లో 58శాతం మందికి ఎలాంటి నియామక పత్రాలు లేవు.54శాతం మందికి ఎట్లాంటి సామాజిక భద్రత ప్రమా ణాలు అందుబాటులో లేవు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో సరైన భద్రతా సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల ప్రమా దాలకు గురౌతున్నారు. ఆ కోవలోనే సంగారెడ్డి జిల్లాలో సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం. 54మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇలా ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో రకరకాల పేర్లతో ఎంతో మంది నియమితులవుతున్నారు. సుప్రీం కోర్టు గుర్తించిన విధంగా, ‘తాత్కాలిక’ అనే లేబుల్ ను శాశ్వత పని కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఒకే డెస్క్ మీద, ఒకే అధికారి కింద, రెగ్యులర్ ఉద్యోగి చేసే పనే చేస్తున్నా.. వారికి పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి ఏమీ ఉండవు. దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఎవరైనా తమ హక్కుల కోసం గొంతెత్తితే నిర్భంధాలు, కేసులతో కార్మికులను భయపెడుతున్నది.
కొత్త లేబర్ కోడ్లు: ఊరటనా, మరో ముప్పా?
ప్రమాదకరంగా కార్మిక కోడ్‌‌లు

2025 నవంబర్ 21న అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లు – వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రత – వీటిని ‘సంస్కరణ లు’గా పిలుస్తున్నారు. కానీ, వీటిలోని కొన్ని నిబంధనలు కార్మికులకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ (ఎఫ్‌‌టీఈ) ను చట్టబద్ధం చేశారు. నిర్ణీత కాలానికి ఉద్యోగం ఇవ్వడం ఇప్పుడు సాధారణ పద్ధతిగా మారుతోంది. దీన్ని ‘హైర్ అండ్ ఫైర్’ విధానానికి పునాది అని కార్మిక సంఘాలు విమర్శిస్తు న్నాయి. యజమానులు శాశ్వత పనులకు కూడా పదే పదే స్వల్పకాలిక ఒప్పందాలు ఇచ్చే అవకాశం ఉంది. పేరుకు ఎఫ్‌‌టీఈ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమాన ప్రయోజనాలు ఉన్నట్లు చెప్పినా, ఆచరణలో ఇది యాజ మాన్యాల దోపిడీని చట్టబద్ధం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం స్థానంలో కొత్త కోడ్ ల ప్రకారం 12 గంటల పనిదినాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి. ఇది సాధించిన శ్రామిక హక్కులపై దాడి తప్ప మరొకటి కాదు..
​ పారిశ్రామిక అభివృద్ధి – ఎవరి కోసం?
​పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది, కానీ అందులో 80 శాతం మంది పారిశ్రామిక కార్మికులకు సామాజిక భద్రత లేదు. కాంట్రాక్టు పద్ధతులు పెరిగిపోతున్నాయి. యాజమాన్యాలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో కార్మికులను దోచుకునే వెసులుబాటును సృష్టిస్తున్నాయి.
ఒక ఉద్యోగి ఒక నెల సెలవు తీసుకుంటే, తిరిగి వచ్చేసరికి అతను ‘కొత్త నియామకం’గా మారతాడు. అతని సామాజిక భద్రతా ప్రయోజనాలు అన్నీ రీసెట్ అవుతాయి. ఇది ఎంతటి క్రూరమైన దోపిడో అర్థం చేసుకోవచ్చు.
నేడు సంగారెడ్డిలో ప్రథమ మహాసభ
తెలంగాణ స్టేట్‌ ‌ఫిక్స్ డ్‌‌టర్మ్ అండ్‌ ‌నాన్‌ ‌రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌ ‌యూనియన్‌ (‌సీఐటీయూ) రాష్ట్ర ప్రథమ మహాసభ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వ హించనున్నారు. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. మహాసభలకు ముఖ్య అతిథిగా సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు బాస్కర్‌ హాజరుకానున్నారు. వీరి సమక్ష‍ంలో పలు తీర్మానాలు చేయనున్నాం.

కార్మికులు మౌనంగా లేరు
అభివృద్ధి అంటే కేవలం కొత్త కర్మాగారాలు, పెరిగిన లాభాలు మాత్రమే కాదు. ఆ అభివృద్ధిని సృష్టించే కార్మికుల జీవితాలు కూడా అభివృద్ధి చెందాలి. వారికి ఉపాధి భద్రత, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవితం లభించాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఆ దిశగా లేవు.కార్మికులు ఇక మౌనంగా లేరు. హైదరాబాద్‌‌లో షాహి కార్మికులు, హెచ్‌‌బీఎల్‌ ‌కార్మికులు, నోయిడా కార్మికులు వారణాసిలో బ్లింకిట్ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మెలు చేశారు. ఈ పోరాటం కొనసాగాలి. ఎందుకంటే, కార్మికుల హక్కులు హననం కావడం అంటే మానవ హక్కుల హననం. అది ఎంతకాలం సహించాలి? కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. పని ప్రదేశాల్లో కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలి. క్యాంటిన్‌, ట్రాన్స్‌‌పోర్టు,యూనిఫాం,వైద్య సౌకర్యం ఇతర చట్టబద్ద హక్కులు కల్పించాలి.
జె మల్లిఖార్జున్‌, యూనియన్‌ అధ్యక్ష‍ులు

​​​​కార్మికుల పట్ల సర్కార్‌ ‌నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల శ్రేయస్సు కంటే.. యాజమానుల శ్రేయస్సే కీలకంగా మారింది. కార్మికుల హక్కులను హరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను అమలు చేసేందుకు పూనుకుంటుంది.ఈ విషయంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నాం. ఫిక్స్‌‌డ్‌ ‌టర్మ్‌ అండ్‌ ‌నాన్‌ ‌రెగ్యులర్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ ‌ప్రధమ మహాసభను జరుపుతున్నాం. 33 జిల్లాల నుంచి 500మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరవుతున్నారు.
– కూరపాటి రమేష్‌, యూనియన్‌ ‌ప్రధాన కార్యదర్శి ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -