
– మానాల తండాల్లో ఉపాధి హామీ పని ప్రదేశంలో ఎన్నికల ప్రచారం
– మానాల గ్రామ అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం బాల్కొండ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం మానాల గ్రామ పరిధిలోని దేగవత్ తండా, వీరున్ తండలలో ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జీవన్ రెడ్డిని గెలిపించాలని ఉపాధి హామీ పని ప్రదేశంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మానాల గ్రామంలోని ముదిరాజ్, మున్నూరు కాపు సంఘాల నాయకులతో, సభ్యులతో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మానాల గ్రామంలో అభివృద్ధి జరిగిందన్నారు.గడిచిన పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పాలకులు మానాల గ్రామాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, మానాల గ్రామంలో అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున మానాల గ్రామ అభివృద్ధి తప్పకుండా జరుగుతుందని, దాని బాధ్యత తాను తీసుకుంటానని మోహన్ రెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే అనేక పథకాలు అమలు చేసిందని, అందులో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గాని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం గాని, ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం కానీ, వంట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు అందించడం గాని, 30 వేల వరకు ఉద్యోగాలు అందించడం జరిగిందని తెలిపారు
. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా మరింత బలం చేకూరి మరింత అభివృద్ధి జరిగే దిశగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ఇచ్చిన ఐదు గ్యారంటీల మేరకు యువతకు మొదటి సంవత్సరంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, రైతులకు రైతు రుణమాఫీ చేసి పండించిన పంట యొక్క మద్దతు ధరకు చట్ట భద్రత కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పేద మహిళలకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు అందిస్తామని, ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు కనీస వేతనం 400 రూపాయలు ఉండే విధంగా చేస్తామని, కులగనన చేసి ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం యొక్క సామాజిక ఆర్థిక సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. తద్వారా జీవన్ రెడ్డి పార్లమెంటులో మన సమస్యలు చెప్పి అభివృద్ధి జరిగే దిశగా పనులు చేస్తారని ఆయన గెలుపుకు కృషి చేయాలని గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో రుద్రాంగి మండల తూము జలపతి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దేవేందర్, కాంగ్రెస్ నాయకులు జక్కు మోహన్, గ్రామ అధ్యక్షులు దిలీప్, రవీందర్ రెడ్డి, రాజు నాయక్, జక్కు వంశీ, జక్కు లింగారెడ్డి, జక్కు లక్మి నర్సయ్య, గురుదాస్, తిరుపతి, బంకట్ లాల్, మహేష్, బాలు, దర్సింగ్, మానాల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.