బీఆర్ఎస్ తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం..

నవతెలంగాణ- తుంగతుర్తి
బీఆర్ఎస్ తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం- మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్.. బీఆర్ఎస్ పార్టీ తోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని గారడీ చేసే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్ అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మండల పరిధిలోని దేవునిగుట్టతండ గ్రామపంచాయతీలో శనివారం ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఈ మేరకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశ పెట్టడం జరిగిందని, గతంలో కంటే ఊహించని స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి చేసే పార్టీ ఏది, అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్న నాయకుడు ఎవరు అనేది గుర్తు చేసుకోవాలని సూచించారు.వ్యవసాయాన్ని పండుగ చేసి, కేసీఆర్ అన్నపూర్ణ రాష్ట్రంగా ఏర్పాటు చేశారని, త్రాగు సాగునీరు కోసం ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందని, పట్టణాలను పారిశ్రామిక రంగాలుగా తీర్చిదిద్దే క్రమంలో టీ హబ్ లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బందు అర్హులను ఎంపిక చేసే సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆగిపోయాయని, ఎన్నికల అనంతరం ప్రతి సంక్షేమ పథకం కొనసాగుతుందని తెలిపారు. తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ఈనెల 29న తిరుమలగిరిలో జరిగే సమర శంఖారావం బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుగులోత్ ఈరోజి, గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్, ఎల్లబోయిన బిక్షం, పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love