నల్ల బ్యాడ్జీలతో మేడారం పూజారుల ధర్నా..

 

– సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం: మంత్రి సీతక్క
నవతెలంగాణ – తాడ్వాయి
సమస్యల పరిష్కారం కోసం పూజారుల సంఘం, సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ఆధ్వర్యంలో పూజారులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజార్ల సంఘం కార్యదర్శి చందా రఘుపతి రావు, సిద్ధబోయిన స్వామి, కొక్కెర రమేష్ లు మాట్లాడుతూ  వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఎదుట మేడారం ఆలయం పేరిట కేటాయించిన స్థలంలో నిర్మించిన ధార్మిక భవనం భద్రకాళి ఆలయ పూజారులు కబ్జా చేసుకుంటున్నారని మండిపడ్డారు.వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా 1014 గజాల స్థలాన్ని మేడారం ఆలయ సౌకర్యాల నిమిత్తం 1993 సంవత్సరంలో దేవాదాయ శాఖ మేడారం పేరిట కేటాయించారని తెలిపారు. ఆ భూమిలో ఏర్పాటు చేసిన ధార్మిక భవనాన్ని భద్రకాళి ఆలయ అర్చకులు, అధికారులు తమకు దక్కకుండా వేద పాఠశాల పేరుతో దక్కించుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఈ విషయంపై పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేకు, మంత్రులకు వినతులు సమర్పించిన పట్టించుకోకపోవడంతో న్యాయం జరగాలని నిరసన దిగామని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గిరిజన పూజారులు తెలిపారు. ధర్నా నిర్వహిస్తున్న పూజారుల సంఘానికి తుడుందెబ్బ మహిళా రాష్ట్ర అధ్యక్షులు ఇర్ప విజయ, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జంపాల సత్యనారాయణ, వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే ఎంత దూరమైనా సమస్యను తీసుకెళ్లి అంచలంచెలుగా ఉద్యమిస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

మేడారం పూజార్ల సమస్య సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తాం: మంత్రి సీతక్క
పూజారులకు గతంలో 1993 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి జగన్నాయక్ అప్పటి కలెక్టర్ లు వరంగల్ లో పూజారులకు స్థలం అప్పగించారు. దాన్ని అప్పటినుంచి పూజారులు కాపాడుకుంటూ వస్తుండగా, కొంతమంది భద్రకాళి పూజ రులు రాజకీయ నాయకుల అండదండలతో మేడారం పూజారుల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఈ సమస్యకు పరిష్కారంగా మేడారం పూజారులు మేడారంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు.  ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క మేడారం ధర్నా వద్దకు చేరుకున్నారు. పూజారులతో మాట్లాడారు. వారి సమస్యలను వారి దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మేడారం పూజారుల సంఘం లోని పూజారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పూజార్లు మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు సిద్ధబోయిన మునేందర్, సిద్ధబోయిన స్వామి, కొక్కెర రమేష్, కాకా సారయ్య, కాక అమృత, కాక వెంకటేశ్వర్లు, మరియు సమ్మక్క, సారమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు, ఎండోమెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love