క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర
నవతెలంగాణ – పరకాల
డిజిటల్ క్రాప్ సర్వేను ఈ నెల 25లోగా జిల్లాలోని అన్ని మండలాల్లో వంద శాతం పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి వి. విజయచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం పరకాల మండలం మాదారం రెవెన్యూ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న వాలంటీర్లతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్వే ప్రారంభానికి ముందే గ్రామంలోని రైతులకు వాలంటీర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) పూర్తి సమాచారం అందించాలని సూచించారు. సబ్-సర్వే నంబర్ల వారీగా రైతుల వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని ఆదేశించారు.
వాలంటీర్లు యాప్ ద్వారా పంటల ఫొటోలను తీసి వివరాలను నమోదు చేసిన వెంటనే సంబంధిత ఏఈఓలు తమ లాగిన్‌లో వాటిని పరిశీలించి, వివరాలు సక్రమంగా ఉంటే వెంటనే అప్రూవ్ చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో వాలంటీర్ల పనితీరును పర్యవేక్షిస్తూ సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరకాల మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, స్థానిక ఏఈఓలు, వాలంటీర్లు పాల్గొన్నారు.



