అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తీక్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవలే ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్… తాజాగా క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు అధికారిక ప్రకటన చేశాడు. ఇన్నాళ్ల పాటు తనకు మద్దతు పలికిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన తల్లిదండ్రులు తనకు అన్నివేళలా వెన్నుదన్నుగా నిలిచారని వెల్లడించాడు. వాళ్ల దీవెనలు లేనిదే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదని పేర్కొన్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని అదృష్టంగా భావిస్తానని తెలిపాడు. డీకేగా సుప్రసిద్ధుడైన దినేశ్ కార్తీక్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. 2000వ సంవత్సరం ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన దినేశ్ కార్తీక్… 26 టెస్టులు, 94 వన్డేలు, 60 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ నమోదు చేశాడు. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించని తత్వం, నరనరానా పోరాట తత్వాన్ని జీర్ణించుకున్న వైనం… దినేశ్ కార్తీక్ ను ఇప్పటివరకు ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిపింది. ఎంఎస్ ధోనీ మాంచి ఊపుమీదున్న టైమ్ లో బీసీసీఐ పెద్దలు మరో వికెట్ కీపర్ కోసం చూడాల్సిన అవసరం లేకపోయింది. దాంతో దినేశ్ కార్తీక్ కు రావాల్సినన్ని అవకాశాలు రాలేదన్న వాదనలు ఉన్నాయి. ఒక విధంగా ధోనీ ప్రాభవం చాటున డీకే కెరీర్ మరుగునపడిపోయిందని చెప్పాలి. ఇక, ఐపీఎల్ లో దినేశ్ కార్తీక్ కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Spread the love