కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు

Negotiations on a ceasefire agreement– నేడు ఖతార్‌కు ఇజ్రాయిల్‌ ప్రతినిధి బృందం
జెరూసలేం : గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించడానికి సోమవారం ఖతార్‌కు ఇజ్రాయిల్‌ ఒక ప్రతినిధి బృందాన్ని పంపనుంది. విరమణ ఒప్పందం చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ బృందాన్ని పంపుతున్నట్టు తెలిపింది. రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై ఈజిప్టు,ఖతార్‌ మధ్యవర్తులు, హమాస్‌ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయనే వార్తలు నేపథ్యంలో ఇజ్రాయిల్‌ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ‘అమెరికా మద్దతుగల మధ్యవర్తుల ఆహ్వానాన్ని అంగీకరిస్తూ తమ బృందం ఖతార్‌కు వెళ్లనుంది’ అని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇతర వివరాలను వెల్లడించలేదు. అలాగే హమాస్‌ ప్రతినిధి అబ్దేల్‌ -లతీఫ్‌ అల్‌ కనౌవా కూడా ఎటువంటి వివరాలు ప్రకటించలేదు. నిజానికి కాల్పుల విరమణపై రెండవ దశ చర్చలు ఒక నెల ముందే ప్రారంభం కావాల్సి వుంది. ఇజ్రాయిల్‌ వైఖరి కారణంగా ఈ చర్చలు ముందుకు సాగలేదు. అయితే గత వారంలో హమాస్‌ వద్ద మిగిలిన ఉన్న బందీల్లో సగం మందిని విడుదల చేయాలని, దీని తరువాతపై కాల్పుల విరమణపై చర్చలు ప్రారంభిస్తామని ఇజ్రాయిల్‌ తెలిపింది. అంతేకాకుండా హమాస్‌పై ఒత్తిడి తీసుకుని రావడానికి గాజాకు ఎలాంటి మానవతా సాయం అందకుండా సరిహద్దులు మూసివేసింది. దీంతో ఇజ్రాయిల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

Spread the love