Wednesday, April 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపౌరసేవలకు అంతరాయం

పౌరసేవలకు అంతరాయం

- Advertisement -

మీసేవా, ఆర్టీఏ సర్వీసులపై ప్రభావం మారిన టెండర్‌ సంస్థ
ఏడాదిగా టెక్నాలజీని
బదలాయించని పాత టెండర్‌దారుడు
సీసీఎస్‌లో కేసుపెట్టిన ఈఎస్‌డీ
ట్రాన్సాక్షనల్‌ అనలిస్ట్స్‌ సంస్థ ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ అరెస్ట్‌
పరారీలో ఆ సంస్థ సీఈఓ, ప్రాజెక్ట్‌ మేనేజర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పౌరసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా మీ-సేవా, ఈ-సేవా, ఆర్టీఏ సర్వీసులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఏడాది కాలంగా ఈ వ్యవహారం పాక్షికంగా జరుగుతూనే ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఏడాది క్రితం ఈ ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించిన టెండర్లను తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ సేవల పంపిణీ (ఈఎస్‌డీ) విభాగం పిలిచింది. నూతన సంస్థ మెస్సర్స్‌ పర్వూ ఇండియా కన్సల్టింగ్‌ అండ్‌ సర్సీసెస్‌ కంపెనీ సంస్థ వీటిని దక్కించుకుంది. అప్పటి వరకు ఈ విధులు నిర్వహించిన మెస్సర్స్‌ ట్రాన్సాక్షనల్‌ అనలిస్ట్స్‌ (ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిబంధనల ప్రకారం తన దగ్గర ఉన్న అన్ని రకాల ప్రాజెక్ట్‌ డేటా, సోర్స్‌ కోడ్‌, కార్యాచరణ రికార్డులను పర్వూ సంస్థకు బదలాయించాలి. కానీ ఏడాది కాలంగా ట్రాన్సాక్షనల్‌ అనలిస్ట్స్‌ సంస్థ ఈ బదలాయింపులు చేపట్టలేదు. దీనివల్ల మీసేవ, ఈసేవ, ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ద్వారా జరిగే పౌర సేవలకు అంతరాయం ఏర్పడింది. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, పట్టాదార్‌ పాస్‌బుక్‌, భూమి రికార్డులు, ఆధార్‌ ఈ-కేవైసీ అప్‌డేట్‌ సేవలు, ఓటర్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సంబంధిత సేవలు, విద్యుత్‌, నీటి, ఆస్తిపన్ను బిల్లుల చెల్లింపులు, ఫీజులు, చలాన్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ అప్లికేషన్లు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్వీసులు, ట్రేడ్‌ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌ సేవలు, ట్యాక్స్‌ ఫైలింగ్‌, కంపెనీ,వ్యాపార అనుమతులు, పాన్‌ కార్డు నూతన దరఖాస్తులు, బ్యాంకింగ్‌,ఇన్సూరెన్స్‌ వంటి దాదాపు 500 సేవలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈ సేవల్ని రాష్ట్రవ్యాప్తంగా 4,500 కేంద్రాలు అందిస్తున్నాయి. ప్రతిరోజు భారీగా డిజిటల్‌ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి.

సీసీఎస్‌లో కేసు నమోదు
ట్రాన్సాక్షన్‌ అనలిస్ట్స్‌(ఇండియా) ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థతో పాటు దాని మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు కాటూరిపై నమ్మకద్రోహం, డిజిటల్‌ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్ట్‌ హ్యాండోవర్‌కు అడ్డంకులు సృష్టించారనే కారణాలతో ఈఎస్‌డీ విభాగం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)లో కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎకనామిక్స్‌ అఫెన్స్‌ వింగ్‌ను పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏ రామిరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. దానిలో భాగంగా ట్రాన్సాక్షన్స్‌ సంస్థకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ చట్టపరమైన నోటీసులు జారీ చేశారు. సంస్థలో చీఫ్‌ ఆఫ్‌ ప్రాజెక్ట్స్‌గా పనిచేస్తున్న ఎమ్‌ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతర నిందితులు శ్రీనివాసరావు కాటూరి, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారని సమాచారం. వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.

బ్లాక్‌ లిస్ట్‌లోకి…
ట్రాన్సాక్షన్స్‌ సంస్థ నిర్వాకాన్ని ఐటీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సదరు సంస్థపై ఒప్పంద నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడం, భవిష్యత్‌ టెండర్ల నుంచి బ్లాక్‌లిస్టింగ్‌ చేయడం, నష్టపరిహారం వసూలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యకలాపాలను దెబ్బతీసే ఇలాంటి సంస్థలను ఉపేక్షించవద్దని అన్ని ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ కేసు..
ట్రాన్సాక్షన్‌ అనలిస్ట్స్‌ (ఇండియా) ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థను 2017 జనవరిలో జారీ చేసిన వర్క్‌ ఆర్డర్‌ ద్వారా రాష్ట్రానికి చెందిన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి, నిర్వహణ కోసం నియమించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం సుమారు రూ. 70 లక్షలు అభివృద్ధి, అమలు ఖర్చులుగా చెల్లిస్తున్నది. దానితో పాటు ప్రతినెల నిర్వహణ చార్జీలు కూడా చెల్లించింది. ఒప్పంద నిబంధనల ప్రకారం, కాలపరిమితి ముగిసిన తరువాత ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డేటా, సోర్స్‌ కోడ్‌తో పాటు డిజిటల్‌ ఆస్తులపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వానికి చెందాలి. అయితే వ¶డు సార్లు (2018 నుంచి 2025 వరకు) అవే నిబంధనలతో పొడగింపు పొందిన ఈ సంస్థ కాలపరిమితి 2025 మే 31వ తేదీతో ముగిసింది. కొత్త సంస్థ ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనిలో పర్వూ ఇండియా కన్సల్టింగ్‌ అండ్‌ సర్సీసెస్‌ కంపెనీ అనే సంస్థ ఎల్‌-1గా ఎంపికైంది. ట్రాన్సాక్షన్‌ అనలిస్ట్స్‌ సంస్థ టెండర్లలో విఫలమైంది. దీనితో టెండర్‌ దక్కించుకున్న సంస్థకు సహాయ నిరాకరణను ప్రారంభించింది. పైపెచ్చు తప్పుడు యాజమాన్య పత్రాలతో ప్రభుత్వానికి చెందిన డేటాను తమదిగా చెప్పే ప్రయత్నం చేసింది. కొత్త సంస్థకు దశలవారీగా హ్యాండోవర్‌ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, పదేపదే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించింది. నిధుల దుర్వినియోగంతో పాటు, j¶జర్‌ డేటాను తమ ప్రయివేటు అప్లికేషన్‌కు మళ్లించే ప్రయత్నం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ సేవల పంపిణీ (ఈఎస్‌డీ) విభాగం చేసిన విజ్ఞప్తులను ట్రాన్సాక్షన్‌ అనలిస్ట్స్‌ సంస్థ పట్టించుకోలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -