న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం
రైతుల ధర్నా అధికారులకు పట్టదా..?
2013 చట్టం ప్రకారం సాగు భూములను తీసుకోవద్దు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రాపోల్, కాడ్లాపూర్ భూబాధితులకు మద్దతు
రైతులంతా ఐక్యంగా ఉండాలని పిలుపు
నవతెలంగాణ-పరిగి
ఇండిస్టియల్ కారిడార్‌లో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల పక్షాన సీపీఐ(ఎం) పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్, కాడ్లాపూర్ గ్రామంలో ఇండిస్టియల్ కారిడార్‌లో భూములు కోల్పోతున్న రైతులను మంగళవారం కలిసి మద్దతు తెలిపారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ భూములు తీసుకుంటే ఇక్కడ రైతన్నల బతుకుదెరువు పోతుందని అన్నారు. రైతులు ధర్నా చేస్తుంటే.. అధికారులకు పట్టదా? అని ప్రశ్నించారు.
అభివృద్ధి చేస్తారని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి ఓట్లేసి గెలిపిస్తే.. ఇప్పుడు రెండు గ్రామాల రైతులు ధర్నా చేస్తుంటే కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సాగు భూములను తీసుకోవడానికి వీల్లేదన్నారు. గ్రామసభ అనుమతి లేకుండా భూసేకరణ చేపట్టకూడదన్నారు. గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను తీసుకుంటున్నారని, అవి పోతే పేద రైతులు రోడ్డుపాలు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కమ్యూనిస్టులు పోరాటం చేస్తే రైతులకు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వాలు రైతుల నుంచి దాదాపు 40 వేల ఎకరాలను సేకరిస్తున్నాయని విమర్శించారు. ‘మీరు చేస్తున్న ఈ పోరాటానికి సీపీఐ(ఎం) అన్నివేళలా అండగా ఉంటుంది.కమ్యూనిస్టులు పార్టీ అణగారిన వర్గాలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల కోసం పోరాడుతుంది. నిరంతరం ఉద్యమాలు నిర్మిస్తుంది’ అని భరోసానిచ్చారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పడితే కాలుష్యం ఏర్పడి ఈ ప్రాంతం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రెండు గ్రామాలకే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ నష్టం కలుగుతుందన్నారు. రెండు గ్రామాల రైతులందరూ కలిసి వస్తే హైదరాబాద్‌లో ధర్నా చేస్తామని అన్నారు. బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే.. ఎర్రజెండా రైతుల వెంటనే ఉంటుందని హామీ ఇచ్చారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. వేల ఎకరాల భూ సేకరణ చేసి ఎంతమందికి ఉపాధి కల్పించారని ప్రశ్నించారు. లక్షల ఎకరాల భూమిని సేకరిస్తున్న పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయని, అబివృద్ధి జాడ ఏదని నిలదీశారు. బడాబడా కంపెనీలకు భూములను అప్పజెప్పి జేబులు నింపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్, కె.శ్రీనివాస్, బుస్సా చంద్రయ్య, నరసమ్మ, రామకృష్ణ, మంగమ్మ, సుదర్శన్ సతీష్, గోపాల్‌రెడ్డి, వీరన్న, హబీబ్, సత్తయ్య,రఘురాం, నర్సింలు వెంకటయ్య, మహిపాల్‌రెడ్డి సత్తయ్య, సుశీల తదితరులు పాల్గొన్నారు.



