తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ..
పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తాం..
నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను ఇప్పటికీ అర్హులైన పేదలకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఇండ్లకు సంబంధించిన పట్టా సర్టిఫికెట్లు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పలువురు లబ్ధిదారులు బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల వివరాల ప్రకారం 2019 సంవత్సరంలో 16 ఇండ్లు, 2021లో 64 ఇండ్లు, 2023లో 42 ఇండ్లు ప్రభుత్వం ద్వారా నిర్మించి అర్హులైన పేద కుటుంబాలకు కేటాయించడం జరిగింది.
ఇండ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు అందులో నివాసం ఉంటున్నప్పటికీ, సంబంధిత పట్టా సర్టిఫికెట్లు మాత్రం పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదని వారు వాపోయారు. పంపిణీ కార్యక్రమం జరిగిన రోజున కొంతమందికి మాత్రమే మొక్కుబడిగా పట్టాలు అందజేసి, మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు గడుస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఈ కాలంలో ముగ్గురు ఆర్డీవోలు, నలుగురు తహసీల్దార్లు మారినా లబ్ధిదారుల సమస్యను పట్టించుకున్న వారు లేరని విమర్శించారు. పట్టా సర్టిఫికెట్లు రెడీ అయి సంవత్సరాలు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడం వెనుక కారణాలు ఏమిటో అధికారులే చెప్పాలని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బ్యాంకు రుణాలు, ఇతర ధ్రువపత్రాల విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని లబ్ధిదారులు తెలిపారు.
పేదల సమస్యను అధికారులు సీరియస్‌గా తీసుకొని వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ,వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని. ఇకపై కూడా నిర్లక్ష్యం కొనసాగితే వారం రోజుల తర్వాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పట్టా సర్టిఫికెట్లు అందజేయాలని కోరుతున్నారు.



