‘డిలే’ఎంహెచ్‌వో..

'Delay' MHO..– విధుల్లో ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తీరని నిర్లక్ష్యం
– డిప్యూటీ డీఎంహెచ్‌వోగా ఉన్నప్పటి నుంచీ అదే తీరు
– నాడు హెచ్‌డీఎస్‌ నిధులు వెనక్కి.. ఆమె నిర్లక్ష్య ఫలితమే..
– ఒక్కో పీహెచ్‌సీ ఏటా రూ.లక్ష వరకు కోల్పోయిన వైనం
– ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు..
– కలెక్టర్‌ ఆర్డర్స్‌ ఉన్నా ఉద్యోగికి శాలరీ చేయకుండా వేధింపులు?
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ఖమ్మం:
ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.మాలతి తీరుపై తీవ్ర విమర్శలున్నాయి. విధుల్లో తీరని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారనే ఆరోపణలు ఆమెను వెంటాడుతున్నాయి. శాఖకు సంబంధించిన వివిధ ఫైల్స్‌ను రోజుల తరబడి తన దగ్గర అట్టిపెట్టుకుని, వాటిని క్లియర్‌ చేయకుండా ఉంటారనే అభియోగం ఆమెపై ప్రధానంగా ఉంది. తన పై అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరణలు కోరినా ఏ ఒక్క ఫైల్‌ కూడా ఆమె నుంచి సకాలంలో అందిన దాఖలాలు లేవు. ఈ నిర్లక్ష్యం ఇప్పటి నుంచి కాదు… తాను డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న కాలం (2015-2019) నుంచీ కొనసాగుతోందనే ప్రచారం ఉంది. ఆమె నిర్లక్ష్య ఫలితంగా జిల్లాలో దాదాపు 32 పీహెచ్‌సీలకు చెందిన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ (హెచ్‌డీఎస్‌) నిధులు నాలుగేండ్ల పాటు వెనక్కి వెళ్లాయి. ఒక్కో పీహెచ్‌సీకి ఏటా రూ.లక్ష వరకు ఈ నిధులు వస్తాయి. ఒక ఏడాది ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటేనే మరుసటి ఏడాది కూడా అవి మంజూరవుతాయి. కానీ నాటి డిప్యూటీ డీఎంహెచ్‌వో నిర్లక్ష్య ఫలితంగా ఆ నిధులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పొందలేకపోయాయి. అలాగే కొందరు ఉద్యోగుల పట్ల కూడా ఆమె కక్షపూరితంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. ఇటీవల దాదాపు రెండునెలల పాటు సెలవుల్లో ఉన్న డీఎంహెచ్‌వో గత సోమవారమే తిరిగి విధుల్లో చేరారు. ఆమె సెలవులో ఉన్నప్పుడు డీఎంహెచ్‌వోగా పనిచేసిన రామునాయక్‌, సుబ్బారావు తీసుకున్న నిర్ణయాలను ఈమె తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
హెచ్‌డీఎస్‌ కమిటీ తీర్మానం చేసినా.. వెంటాడిన నిర్లక్ష్యం..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ నిధులు వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి డిప్యూటీ డీఎంహెచ్‌వో, తహసీల్దార్‌, ఎంపీడీవో, పీహెచ్‌సీ డాక్టర్‌, స్థానిక సర్పంచ్‌ తదితరులు ప్రాతినిధ్యం వహిస్తారు. సమావేశాలు నిర్వహించి ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి కావాల్సిన తీర్మానాలు చేస్తారు. సంబంధిత ఫైల్‌పై డిప్యూటీ డీఎంహెచ్‌వో కచ్చితంగా సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ మాలతి డిప్యూటీ డీఎంహెచ్‌వోగా ఉన్న కాలంలో సంబంధిత నిధుల ఫైల్‌పై సంతకాలు చేసిన దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. తద్వారా ఆ నిధులు డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏటా ఒక్కో పీహెచ్‌సీకి మంజూరయ్యే రూ.లక్ష హెచ్‌డీఎస్‌ నిధులను మెడిసిన్‌, పీహెచ్‌సీల మరమ్మతులు, ఇతరత్ర సౌకర్యాల కల్పన కోసం ఉపయోగించాలి.
కానీ నాటి డిప్యూటీ డీఎంహెచ్‌వో మాలతి పీహెచ్‌సీల తీర్మానాలపై సంతకం చేయకపోవడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లాయి. ఒక ఏడాది ఉపయోగించుకోని కారణంగా మరుసటి సంవత్సరం కూడా మంజూరు కాకుండా పోయాయి. ఇప్పుడు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆఫీస్‌ అదర్‌ ఎక్స్‌పెండేచర్‌ (ఓఓఎక్స్‌) నిధుల్లో ఒక్క పైసా కూడా కార్యాలయ నిర్వహణకు వెచ్చించడం లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగా గుండు పిన్‌ నుంచి కాగితాలు, ఇతర స్టేషనరీ సామగ్రి, చివరకు కంప్యూటర్‌ రిపేర్‌ వచ్చినా ఉద్యోగులు సొంత డబ్బులనే వెచ్చిస్తున్నారు. రూ.లక్షల్లో వచ్చే ఓఓఎక్స్‌ నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు ఉద్యోగ వర్గాల ఆరోపణ.
ఉద్యోగులపై కక్ష సాధింపు..
డీఎంహెచ్‌వో మాలతి ఇటీవల సెలవుల్లో ఉన్నారు. దీనికి ముందే ఆఫీస్‌లో ఈ3 సెక్షన్‌ఎంపీహెచ్‌ఎస్‌ (మేల్‌) ఎండీ ఖలీద్‌బిన్‌ సయ్యద్‌ నకిలీ వైకల్య సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ సెక్షన్‌కు ఇన్‌చార్జిగా ఉన్న సీనియర్‌ అసిస్టెంట్‌ జె.ఇందిరారాణిని రిపోర్టు ఇవ్వాల్సిందిగా డీఎంహెచ్‌వో మాలతి ఆదేశించారు. ఈమేరకు సీనియర్‌ అసిస్టెంట్‌ నివేదిక పనిలో ఉన్నారు. దీనిపై ఖలీద్‌ వ్యూహాత్మకంగా సీనియర్‌ అసిస్టెంట్‌పై తన భార్య సాధియా బేగంతో తెలంగాణ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. తద్వారా నకిలీ వైకల్య ధ్రువీకరణపత్రాలపై జరగాల్సిన విచారణ పక్కదోవ పట్టింది. సీనియర్‌ అసిస్టెంట్‌, ఎంపీహెచ్‌ఎస్‌ (మేల్‌) భార్య మధ్య వివాదం పేరుతో విచారణ కొనసాగింది. ఇప్పుడా విచారణ ముగిసి దాదాపు 20 రోజులకు పైగా అవుతుంది. ఈ వివాదంపై ‘నవతెలంగాణ’ పత్రికలో వార్తలు వచ్చాయి. అదే క్రమంలో డీఎంహెచ్‌వో మాలతి ‘అమ్మ పేరుతో అద్దె కారు’ నిర్వహిస్తున్న తీరుపైనా పత్రికలో కథనం ప్రచురితమైంది. తనపై వస్తున్న వార్తల వెనుక ఆఫీసులోని కొందరు ఉద్యోగులు ఉన్నట్టు కలెక్టర్‌ మొదలు హెల్త్‌ డైరెక్టరేట్‌ వరకు డీఎంహెచ్‌వో చిత్రీకరించారనే ఆరోపణలున్నాయి. తాను డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తుండగా అప్పట్లో డీఎంహెచ్‌వోగా ఉన్న అధికారిపై సైతం తప్పుడు ఆరోపణలు చేసి ఆర్‌ఎంవోగా బదిలీ చేయించారనే అభియోగం మాలతిపై ఉంది. ఇప్పుడు తన సీటుకు కూడా అదే విధంగా ఎసరు తెచ్చేందుకే ఈ విధమైన వార్తలు రాయిస్తున్నారనే దురాభిప్రాయంతో ఉన్న డీఎంహెచ్‌వో కొందరు ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిలో భాగంగానే బదిలీలు, శాలరీల పేరుతో కొందర్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు సమాచారం. ఓవైపు నిర్లక్ష్యం.. మరోవైపు కక్షపూరిత వైఖరి.. నిధులు, అధికార దుర్వినియోగం తదితర చర్యల వల్ల డీఎంహెచ్‌వో కార్యాలయ పాలన తీరు గాడితప్పుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు.
నిబంధనల ప్రకారమే నడవడిక..
నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాను. నాలుగేండ్లకు పైగా అయింది కదా.. హెచ్‌డీఎస్‌ నిధుల విషయం గుర్తులేదు. పీహెచ్‌సీలకు వచ్చే ఆ నిధులను సద్వినియోగం చేసుకున్నట్టే గుర్తుంది. ఉద్యోగులు, బదిలీలు, వేతనాల విషయంలో ప్రొసీజర్‌ ప్రకారమే నడుచుకుంటున్నా.
– బి.మాలతి, డీఎంహెచ్‌వో, ఖమ్మం

Spread the love