ఈ విషయాలు తెలుసా..?

ఈ విషయాలు తెలుసా..?మారుతున్న కాలంతో పాటు పని వేళల్లో మార్పులొచ్చాయి. వాటికి తగినట్టుగానే నిద్ర విషయంలోనూ ఆ మార్పులు చోటుచేసుకుం టున్నాయి. ఏ సమయంలో ఏం చేయాలో అది చేయకపోతే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అనేది నిద్ర విషయంలో బాగా సరిపోతుంది. నిద్ర తగ్గడానికి కారణాలు ఒకటి, రెండు కాదు.. అనేకం ఉన్నాయి. ఉద్యోగ సమయాలు, అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మారుతున్న జీవనసరళి వంటివి నిద్రపై ఎంత ప్రభావం చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నిద్ర మనకు ఎంత అవసరమో, సరిగా నిద్రపోకపోతే ఏర్పడే సమస్యలేంటో తెలుసుకుందాం…
శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనిషికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. ఎప్పుడైనా తప్పనిసరైతే ఆ సమయాన్ని కొంచెం తగ్గించుకోవడం వల్ల పెద్ద సమస్యలు ఉండవు. కానీ అదే అలవాటైతే మాత్రం అనేక శారీరక, మానసిక సమస్యలకు దారి తీస్తుంటాయి. అంతేకాదు, నిద్ర అవసరం కదా అని అదే పనిగా నిద్ర పోయినా ప్రమాదమే. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి రోగాలెలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.
తేడాలు
ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర విషయానికి వస్తే ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అని, పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావట. అయితే ఇది అందరికీ ఒకేలా వర్తించదు.
అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని లండన్‌లో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైందట. ఈ రోజుల్లో ఎక్కువ నిద్ర పోయే వారు అరుదుగానే ఉంటారు. ఇక తక్కువ నిద్ర పోయే వారికి సంబంధించి కొన్ని విషయాలున్నాయి.
శరీరంపై ప్రభావం
నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 153 అధ్యయనాల్లో చాలా మందికి నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని వారు కనుగొన్నారు. యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారి తీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్‌ స్థాయిని నియంత్రించే సామర్థ్యం దెబ్బతిని, తత్ఫలితంగా నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. దీంతో తొందరగా ఇన్‌ఫెక్షన్‌లు సోకే అవకాశ ముంటుందని ఆ అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారి కన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్‌ గ్రెలిన్‌ ఎక్కువగా విడుదలయ్యి ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని, కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్‌ లెప్టిన్‌ తక్కువగా విడుదలయ్యి మరింత ఆహారం తినేవిధంగా చేసి, ఊబకాయానికి దారి తీస్తుందని మరో అధ్యయనంలో వెల్లడైంది.
మెదడు పనితీరుపై ప్రభావం
ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని ప్రొఫెసర్‌ షేన్‌ ఓమారా పేర్కొన్నారు. అందుకే సరిపడ నిద్రలేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
ఎక్కువ నిద్ర దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. కానీ అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
పని వేళల వల్ల…
షిఫ్టుల్లో పనిచేసేవారికి సమస్యలు తప్పవు.
షిఫ్టుల్లో పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా తక్కువ నిద్రపోయే వారికి మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదాలున్నాయని పరిశోధకులంటున్నారు. బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇలాంటి వారు దీర్ఘకాల అనారోగ్యం పాలవుతున్నారని తేలింది.
నిద్రలేమి ప్రభావం శారీరక శ్రమతో కూడిన ఉద్యోగంలో, ఒకేచోట కూర్చొని చేసే ఉద్యోగుల విషయంలో భిన్నంగా ఉంటుందని కూడా తేలింది. ఒకేచోట కూర్చొని పనిచేసే ఉద్యోగులపై నిద్రలేమి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
స్త్రీలపై…
నిద్రలేమి స్త్రీలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని, అయితే వారే ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతున్నారని తేలింది.
పిల్లల పెంపకం, ఉద్యోగం మహిళల నిద్రలేమికి ముఖ్య కారణాలని అంటున్నారు. కెఫిన్‌, మద్యం కూడా నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులంటున్నారు.
రాత్రివేళల్లో పార్టీల్లో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. పగటిపూట ఎక్కువసేపు నిద్ర పోయినా ఆ నిద్ర రాత్రి నిద్రకు సమానమవ్వదని తెలిపారు.
స్మార్ట్‌ ఫోన్‌ల ప్రభావం
టీనేజర్లు రాత్రిపూట ఎక్కువగా ఫోన్‌లు చూస్తూ నిద్రకు దూరమవుతున్నారట. ఒకప్పుడు బెడ్‌రూమ్‌ అంటే విశ్రాంతికి మాత్రమే ఉండేది. ఇప్పుడక్కడ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికం గా కనిపిస్తున్నాయి. వీటి నుంచి వెలువడే నీలి రంగు వెలుతురు కళ్లపైపడి నిద్ర రాకుండా చేస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
పరిష్కారాలు
నిద్రలేమికి ‘కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరఫీ’ అంటే.. ఆలోచనా, ప్రవర్తనా విధానాన్ని మార్చే చికిత్సే పరిష్కారమని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కాదని హెచ్చరిస్తున్నారు.

Spread the love