ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టే
20లోపు మెడికల్ బోర్డు పెట్టకపోతే నిరవధిక నిరాహార దీక్ష : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కవితను అడ్డుకున్న జేవీఆర్-
ఓసీ సెక్యూరిటీ, పోలీసులు
గేటు వద్ద ఉద్రిక్తత
తోసుకొని ఓసీలోకి వెళ్లిన కవిత
నవతెలంగాణ-సత్తుపల్లి
‘‘కార్మికుల సాధకబాధకాలు తెలుసుకోవడానికి నేను సత్తుపల్లి వస్తే.. అన్ని మైన్ల దగ్గర అడ్డుకోవడమే కాకుండా, మేము వచ్చేసరికే కార్మికులను బలవంతంగా గనుల్లోకి పంపించారు.. కార్మికులను కలవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది.. కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదు’’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షులు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
బొగ్గు గనుల ‘బావి బాట’ కార్యక్రమం సందర్భంగా శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్-ఓసీ సందర్శనకు వచ్చిన కల్వకుంట్ల కవితను సింగరేణి సెక్యూరిటీ, స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ కవితను, నాయకులను లోపలికి వెళ్లకుండా గేట్లు వేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ నేతలు గేట్లను నెట్టుకొని కవితను ఓసీలోకి తీసుకెళ్లారు. లోపల కార్మికులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తూ తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, మద్దతుగా నిలుస్తున్న ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంఘాలకు రోజులు దగ్గర పడ్డట్టేనని హెచ్చరించారు. కార్మికులను కలవకుండా ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది కేవలం వెయ్యి రోజులు మాత్రమేనని విమర్శించారు. .
మీడియాకు నో ఎంట్రీ చెప్పిన సింగరేణి సెక్యూరిటీ
‘బావి బాట’ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు జేవీఆర్-ఓసీకి వెళ్లిన మీడియా బృందాన్ని సింగరేణి సెక్యూరిటీ నో ఎంట్రీ చెప్పింది. దీంతో చేసేది ఏమీ లేక మీడియా బృందం గేటు బయట పడిగాపులు పడాల్సి వచ్చింది.మెడికల్ బోర్డు ఎక్కడ..?
నెల రోజులుగా తాను సింగరేణి ఏరియాల్లో పర్యటిస్తున్నానని, ప్రతిచోటా కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాలు, అలియాస్ పేర్ల అంశాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారని కవిత తెలిపారు. కొద్ది రోజుల్లో రిటైర్డ్ కాబోతున్న కార్మికులు తమ పిల్లల భవిష్యత్‌పై నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే డిపెండెంట్ ఉద్యోగాలతోపాటు, మెడికల్ బోర్డు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20 లోపు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయకపోతే, అదే రోజు (20వ తేదీన) తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. గాంధేయ మార్గంలో పోరాడి, ప్రభుత్వం మెడలు వంచైనా సరే మెడికల్ బోర్డు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రభుత్వానికి ఇంకా కేవలం వెయ్యి రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ఆ తర్వాత వచ్చేది కార్మికుల రోజులే అన్నారు. యాజమాన్యాలు, పాలకులు ఎన్ని కుట్రలు చేసినా కార్మికుల పక్షాన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. హెచ్ఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్ధన్, హెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సారన్న, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి గుట్టు కరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం నాగేందర్, కిషన్ నాయక్, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ వన్నెంరెడ్డి సాగర్ (జాగృతి), సత్తుపల్లి హెచ్ఎంఎస్ నాయకులు ఆంజనేయులు, అజ్గర్ ఖాన్, వరికూటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, రాము పాల్గొన్నారు .
‘చీప్ ట్రిక్స్’ ప్లే చేస్తే ఊరుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



