సేవా సంస్థ పేరిట ఏపీ, తెలంగాణలో మోసం
రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు వసూళ్లు
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
రూ.20 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు పిర్యాదు
నవతెలంగాణ-నకిరేకల్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని దేవాలయాల హుండీల లెక్కింపు ఉద్యోగం పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన విషయం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో వెలుగు చూసింది. దేవాలయాల్లో హుండీ నగదు లెక్కింపు పని ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసి కోట్ల రూపాయలు కాజేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. నకిరేకల్ మండలంలోని నోముల, గోరెంకలపల్లి, కట్టంగూరు మండలంలోని చెరువు అన్నారం గ్రామాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన పులి రవి, ‘రవి సేవా సమితి’ పేరుతో సేవా సంస్థగా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని, దేవాదాయ శాఖలో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించాడు. నెలకు ఆరు రోజులు పని, ఒక్కో డ్యూటీకి రూ.4 వేల వేతనం, ప్రయాణ భత్యం రూ.500తో కలిపి నెలకు రూ.27,500 వస్తుందని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. గ్రామాలలో ఏజెంట్లను పెట్టి నిరుద్యోగులను ఎంపిక చేసి వారి నుండి డబ్బులు వసూలు చేయించేవాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని వాట్సప్ గ్రూపులలో సమాచారాన్ని అందించేవాడు. లెక్కింపునకు వెళ్లిన యువకులను ఆలయాల వద్ద రిసీవ్ చేసుకుని పని పూర్తయ్యాక వీఐపీ దర్శనం, లడ్డు ప్రసాదం ఇప్పించడంతో ఉద్యోగం పై మరింత నమ్మకం పెరిగింది. విజయవాడ కనకదుర్గ దేవాలయ హుండీ లెక్కింపు సమయంలో అక్కడ దేవాదాయ శాఖ అధికారులను వేతనాల గురించి అడగగా మీరు సేవ పేరుతో వచ్చారు.. వేతనాలు ఎక్కడినుండి వస్తాయి. అని చెప్పడంతో అసలు మోసం బయటపడింది. సుమారు ఏడు నెలల పాటు డ్యూటీలు చేస్తే కేవలం రెండు నెలల వేతనాలు మాత్రమే చెల్లించాడన్నారు. డబ్బులు అడిగితే తప్పించుకుంటూ చివరకు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడని తెలిపారు. మధ్యలో ఉద్యోగం మానేస్తే డిపాజిట్ తిరిగి ఇస్తామని చెప్పి రూ.50 స్టాంప్ పేపర్‌పై కొందరికి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు తిరిగి చెల్లిస్తామని బాండ్ పేపర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు….
బాధితుల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1,000 నుంచి 1,500 మంది మోసానికి గురై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బట్టి చూస్తే ఈ కుంభకోణంలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పైగా డబ్బులు చేతులు మారి ఉండొచ్చని భావిస్తున్నారు. సేవా సంస్థ పేరుతో దేవాలయాలలో నమోదు చేసుకుని, ఉద్యోగాల పేరుతో యువకుల నుండి వసూలు చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని మళ్లీ వేతనాలుగా చెల్లిస్తూ నమ్మకం కలిగించాడని బాధితులు వాపోయారు.
పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతాం : సీఐ హరిబాబు
జరిగిన అన్యాయం పై బాధితులు నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకుంటాం.
హుండీ లెక్కింపు ఉద్యోగమంటూ టోకరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



