లారీలు లభించక.. బస్తాలు తరలించక..

–  నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే వడ్ల బస్తాలు
– అధికారుల వైఖరితో కర్షకులకు తప్పని అవస్థలు
– తూకం వేసినా మిల్లులకు తరలించడంలో తీవ్రజాప్యం
– పెద్ద రైతులకు ఓ న్యాయం.. సన్నకారుకు మరో తీరు
– నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో దుస్థితి
నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన రైతు నిమ్మల శ్రీనివాస్‌.. 240వడ్ల బస్తాలను పండించారు. వీటిని తూకం వేసేందుకు నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. తూకం పూర్తయినా లారీలు లభించకపోవడంతో బస్తాలను అక్కడే ఉంచి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నెల రోజుల నుంచి కేవలం ఒకే లారీ ఈ కేంద్రానికి వచ్చిందని చెబుతున్నారు. లారీలను మాట్లాడితే ఒక్కో బస్తాకు రూ.20అదనంగా అందజేయాలని కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకం జరిగి లారీల కోసం ఎదురుచూస్తున్న అనేక మంది రైతులదీ ఇదే పరిస్థితి.
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకునేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించడంలో చోటుచేసుకుంటున్న జాప్యం అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో తీవ్ర ఆలస్యం జరుగుతున్నట్టు నవతెలంగాణ పరిశీలనలో తేలింది. దిలావర్‌పూర్‌ ప్రాంతాన్ని నవతెలంగాణ ప్రతినిధులు సందర్శించగా కొంతమంది రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెద్ద రైతుల ధాన్యం తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలుతుండగా.. చిన్న, సన్నకారు రైతుల ధాన్యం మాత్రం రోజుల తరబడి అక్కడే ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతున్న వడ్ల బస్తాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా.. అధికారులు కనీసం కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కంటికి రెప్పలా కాపాడుతున్నాం
పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చాను. తూకం పూర్తయింది. కానీ లారీలు దొరకడం లేదు. వర్షం వస్తుండటంతో వడ్ల బస్తాలను కాపాడుకోవడం కోసం కంటిమీద కునుకు ఉండటం లేదు. రాత్రి, పగలు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి వడ్ల బస్తాలను మిల్లులకు తరలించాలి.
– శ్రీనివాస్‌, రైతు, దిలావర్‌పూర్‌
లారీలు రావడంలో తీవ్ర జాప్యం
వడ్లను నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాను. తూకం పూర్తయింది. కానీ వడ్లను మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికే కొందరి రైతుల ధాన్యం తీసుకెళ్లారు. మాలాంటి సన్నకారు రైతులను మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో వర్షానికి వడ్ల బస్తాలు తడుస్తాయనే ఆందోళనతో రోజూ కంటికి రెప్పలా కాపాడుతున్నాం.
– రాజన్న, దిలావర్‌పూర్‌
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, దిలావర్‌పూర్‌
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా యాసంగిలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో ఎక్కువగా మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోనే వరి అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో వరి కోతలు పూర్తయి వడ్ల బస్తాలను రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. ఇప్పటికి సగం వరకు కొనుగోళ్లు పూర్తయినా ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని లారీలను సమకూర్చి మిల్లులకు జిల్లా పౌరసరఫరాల సంస్థ తరలించాల్సి ఉంటుంది. లారీ కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తూకం పూర్తయినప్పటికీ మిల్లులకు తరలించే వరకు వడ్ల బస్తా బాధ్యత రైతులదే కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అదనంగా బస్తాకు రూ.20వసూలు..?
జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల వడ్లబస్తాలను తూకం వేయడం పూర్తయినప్పటికీ ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడం రైతులకు సవాల్‌గా మారుతోంది. అధికారులు సరిపడా లారీలను సమకూర్చకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు.
రైతులు లారీలను మాట్లాడుకుంటే ఒక్కో బస్తా తరలించేందుకు అదనంగా రూ.20 అందజేయాలని లారీ డ్రైవర్లు అడుగుతున్నారని.. ఒక్కో లారీలో సుమారు 240 బస్తాల వరకు వెళ్తే.. రూ.4800 లారీల డ్రైవర్లకే అందించాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్‌ వడ్లకు కనీసం రూ.50వరకు అదనంగా లారీలకు చెల్లించాల్సి రావడంతో ఆర్థికభారం భరించాల్సి వస్తోందని చెబుతున్నారు.

Spread the love