– గుడిసెల కూల్చివేత అప్రజాస్వామికం
– పేదలకు ఇండ్ల పట్టాలిచ్చి మాట నిలుపుకోవాలి
– కొట్లాడితేనే ఇండ్ల స్థలాలు సాధ్యం
– జీవించే హక్కును కాలరాస్తే సహించం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
– సంగారెడ్డిలో గుడిసెలు కూల్చిన స్థలాల్ని పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
”రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లులేని పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి పట్టాలిచ్చే వరకు గుడిసెలేసుకున్న స్థలాల నుంచి కదిలే ప్రసక్తిలేదు. ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు వేసుకున్న ఇండ్లను కూల్చివేయడం అప్రజాస్వామికం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు ఇండ్ల స్థలాలిచ్చి మాట నిలుపుకోవాలి. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాస్తే సహించేది లేదు. పేదలంతా ఐక్యంగా కొట్లాడితే తప్ప ఇండ్ల స్థలాలు సాధించకోవడం సాధ్యం కాదు” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెల్ని అధికారులు కూల్చి వేసిన విషయం తెల్సుకున్న సీపీఐ(ఎం) బృందం ఆదివారం సందర్శించారు. సందర్భంగా జరిగిన సమావేశంలో ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలో వందలాది మంది పేదలేసుకున్న గుడిసెల్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు నేల మట్టం చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ స్థలాల్లో లక్షకుపైగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారన్నారు. వీరందరికీ గతంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలిస్తామని చెప్పి దాటవేసిందని గుర్తుచేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఎక్కడా పేదలకిచ్చిందిలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఇంటి స్థలాల్లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా రాష్ట్రంలో ఎక్కడా ఏ ఒక్క నిరుపేదకు ఇండ్ల్ల స్థలాలివ్వలేదని విమర్శించారు. ప్రజలు గుడిసెలేసుకుంటే పట్టాలెట్లా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సహేతకంగా లేదన్నారు. ఇండ్లు లేని పేదలు ప్రభుత్వ స్థలాల్లో వంద గజాల వరకు ఇల్లు కట్టుకుంటే హక్కు కల్పించాలని రాజ్యాంగమే చెప్పిందన్నారు.
ప్రజలకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తే సహించేదిలేదని స్పష్టంచేశారు. మహబూబాబాద్, హన్మకొండ, జడ్చర్ల, కోరుట్ల, సంగారెడ్డి, వరంగల్, బచ్చన్నపేట వంటి ప్రాంతాల్లో పేదలేసుకున్న ఇండ్లను కూల్చివేయడం ప్రభుత్వ దమననీతికి అద్దం పడుతుందన్నారు. ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాల్ని కేటాయించడం ఇష్టలేని రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థలాలను అమ్ముకుని ఖజానా నింపుకోవాలని చూస్తుందన్నారు.
ఇచ్చిన మాట నిలుపులేని ప్రభుత్వాలపై కొట్లాడితే తప్ప ఇండ్ల స్థలాల్ని సాధించుకోవడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలంతా ఎక్కడిక్కడ ఐక్యంగా నిలబడి పట్టాలిచ్చే వరకు వేసుకున్న గుడిసెల్లోనే నివసిస్తూ పోరాడాల్సిన అవసరముందని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదిర్శ వర్గ సభ్యులు అతిమేల మాణిక్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎం.యాదగిరి, ఇళ్ల స్థలాల పోరాట నాయకులు మణి, లలిత, సుజాత, రాజయ్య, దత్తు, సాయిలు, పద్మ పాల్గొన్నారు.