– మూడు తొమ్మిదులు పోయినా రుణమాఫీ కాలే..
– కాంగ్రెస్ మాయమాటలతో ప్రజలు మోసపోయారు
– మార్చి 17తర్వాత ప్రజల్లోకి వెళ్దాం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-కామారెడ్డి
ప్రస్తుతం మనం గతం గురించి మాట్లాడుకోవద్దని.. భవిష్యత్తు గురించి ఆలోచిద్దామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9 మూడు తొమ్మిదులు పోయినా ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని ఏ కార్యకర్త కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంప గోవర్ధన్ మీకు అండగా ఉన్నారని, ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో తాము ఎంత ఇబ్బంది పడుతున్నారో రైతులకు తెలుసని, పంటలు ఎండిపోయి పెట్టుబడి రాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోయారన్నారు. రైతుబంధు మూడెకరాలకు మించి ఇప్పటికీ పడలేదని, కేసీఆర్ కామారెడ్డిలో గెలిస్తే రైతుల పొలాలు గుంజుకుంటాడని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని తెలిపారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే సీట్లలో 39 సీట్లు గెలవడం చిన్న విషయం కాదని, ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా వారి పక్షాన ఉండి వారికి న్యాయం చేయడానికి బీఆర్‌ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పారు. తండ్రి పేరు చెప్పుకొని నేను పదవులు పొందుతున్నానని రేవంత్ అంటున్నారని, బరాబర్ మా తండ్రి పేరు చెప్పుకుంటానని, ఆయన తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి అని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పార్లమెంట్ కోడ్ అమల్లోకి వచ్చేలోపు రైతులకు ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తానన్న దానికి జీవో తేవాలని తెలిపారు. ప్రస్తుతం కరెంటు సరిగ్గా లేక నీరందక ఎండుతున్న వరి పంట పొలాలకు ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తాము ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి మార్చి 17 నాటికి వంద రోజులు నిండుతాయని, ఆ తర్వాత మనమంతా జనాల్లోకి వెళ్లి ఇచ్చిన హామీలు ఎందుకు అమలుకాలేదో నిలదీద్దామన్నారు. అనంతరం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. సమావేశంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజిబొద్దీన్‌్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పరికి ప్రేమ్‌కుమార్, ఐసీడీఎస్ వైస్‌చైర్మెన్ ఇంద్రసేనారెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి, తిరుమల్‌రెడ్డి, సుమిత్రానంద్, రమేష్‌గుప్తా, లోయపల్లి నర్సింగరావు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ ముందే డిష్యూం డిష్యూం
గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన సమావేశం అప్పటివరకు ఎదురుచూసిన కార్యకర్తల్లో నిరాశను నింపింది. దీనికి తోడు స్టేజీపై నిలబడిన వ్యక్తులను అక్కడి నుంచి వెళ్ళమనడంతో విసిగిపోయిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. సీనియర్ నాయకులు తిరుమల్‌రెడ్డి మాట్లాడుతుండగా.. గంప పేరును చెప్పలేదని కార్యకర్తలు సమావేశంలో గలాటా సృష్టించారు. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మైకు తీసుకొని కార్యకర్తలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సమావేశానికి కామారెడ్డికి చెందిన రాష్ట్ర నాయకులు నిట్టు వేణు దూరంగా ఉండటం గమనార్హం.