• రిటైర్‌మెంట్‌పై ఐటీఏకు వినేశ్ సమాచారం
• అధికారికంగా వీడ్కోలు ఇవ్వలేదని సరికొత్త వాదన
న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ), భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూ ఎఫ్‌ఐ) సహా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిబంధ నలు ప్రతిబందకంగా మారాయి. రిటైర్‌మెంట్ ప్రకటించిన అథ్లెట్లు మళ్లీ ఆటలోకి రావాలంటే.. ఆరు నెలలు ముందుగా వాడాకు ఆ సమాచారం ఇవ్వాలి. ముందస్తు సమాచారంతో అథ్లెట్ శాంపిల్ సేకరించి, నిషేధిత ఉత్పేర కాల వినియోగంపై పర్యవేక్షణ ఉంచేందుకు వెసులుబాటు ఉంటుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పోరుకు చేరుకున్న వినేశ్ ఫోగట్.. బౌట్ ముంగిట బరువు పరీక్షలో విఫలమై అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. ఆ నైరాశ్యంలో కుస్తీకి వీడ్కోలు పలుకుతూ వినేశ్ భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ)కు సైతం తెలియ జేయగా.. ఆమె పేరును రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఐటీపీ) నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకుంది. ఒకవేళ, రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకునే ఆలోచన ఉంటే సమాచారం ఇవ్వాలని సైతం ఐటీఏ సూచించింది. ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు సిద్ధమవుతున్న వినేశ్ ఫోగట్‌కు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, వాడా నిబంధనలు ప్రతికూలంగా మారాయి. ఇక ఆసియా క్రీడల ట్రయల్స్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య కేవలం అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతక విజేతలు, 2025, 26 సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్స్ సహా జాతీయ అండర్-23 విజేతలను మాత్రమే అర్హులుగా పేర్కొంటూ ఫిబ్రవరిలో సర్కూలర్ జారీ చేసింది. వినేశ్ ఫోగట్ నిరుడు డిసెంబర్ 12న రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతికూల పరిస్థితులు, రూల్స్ కఠినంగా ఉండటంతో వినేశ్ ఫోగట్ రీ ఎంట్రీ అనుమానంగా మారింది.



