రామానంద తీర్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎన్.విహారి కృష్ణ

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్ పూర్  గ్రామంలోని స్వామి రామానంద తీర్థ సంస్థ అందిస్తున్న సాంకేతిక శిక్షణా పరిజ్ఞానాన్ని, నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రామానంద తీర్థ ట్రేనింగ్ అధికారి డాక్టర్ ఎన్ విహారి కృష్ణ కోరారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లా లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారంతో స్వామి రామానంద తీర్థ సంస్థలో 15 రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లు నడుస్తున్నాయని ఆయన అన్నారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన యువతీ యువకులు జులై 08 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. సుమారు 6 మాసాల పాటు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ మరియు భోజన వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. శిక్షణ ముగిసిన వెంటనే ప్లేస్మేంట్  ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ యువకులు రూపాయలు 12 వేల నుండి 18 వేల వరకు వేతనం పొందవచ్చని ఆయన అన్నారు . కేంద్ర ప్రభుత్వ ధీన్ దయాల్ ఉద్యోగ్ కౌన్సిల్ యోజన మరియు మేథా చారిటబుల్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణలు పొందిన యువతీ యువకులు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచు కోవాలని ఆయన సూచించారు.  సాయి యాదాద్రి సేవాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు దెబ్బడి అశోక్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులను చైతన్యం చేసి, రామానంద తీర్థ ఆద్వర్యంలో ఇస్తున్న ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ పరిజ్ఞానాన్ని విస్తృత పరుస్తామన్నారు.  ఈ విలేకరుల సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా డైరెక్టర్ కొడారి వెంకటేష్, రామానంద తీర్థ మీడియా ఇంచార్జీ వై.ఎస్ చక్రవర్తి, ప్లేస్మేంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, యాదాద్రి సేవాశ్రమం డైరెక్టర్లు లింగం, రాజశేఖర్ పాల్గొన్నారు.
Spread the love